హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై కఠినచర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి మహిళా నాయకురాళ్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రాష్ట మహిళా కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. చైర్పర్సన్ నేరెళ్ల శారద అందుబాటులో లేకపోవడంతో కమిషన్ సభ్యులు సుదం లక్ష్మి, రేవతిరావు, ఉమ, అప్రోజ్ సహీనాకు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముందస్తు సమాచారం ఇచ్చినా చైర్మన్పర్సన్ అందుబాటులో లేరని.. సెక్రటరీ సైతం ఫిర్యాదు లేఖను తీసుకోవడానికి అంగీకరించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళలను కించపర్చే వ్యక్తుల విషయంలో ఇలాంటి వైఖరి మంచి పద్ధతి కాదని హితవుపలికారు. ఈ క్రమంలో కమిషన్ సభ్యులు స్పందించి.. ఫిర్యాదును చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకునేలా చూస్తామని హామీఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా జాగృతి అధ్యక్షురాలు మరిపల్లి మాధవి, సీనియర్ నాయకులు వరలక్ష్మి, పడాల మనోజ, దేశపాక సుచిత్ర, సంధ్యరెడ్డి, షాహీన్, పరమేశ్వరి, కుసుమ రజిత, రజితా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన నాయకులను కమిషన్ కార్యాలయంలోకి అనుమతించకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో కమిషన్ కార్యాలయం ఎదుట రెండుగంటలపాటు ఎండలో బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫిర్యాదు చేయడానికి వస్తే ఎందుకు గేట్లు మూసేశారని నిలదీశారు. మహిళలను కించపర్చిన వ్యక్తులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందా? అని ప్రశ్నించారు. కమిషన్ చైర్పర్సన్ జోక్యం చేసుకుని కొందరు నాయకులను లోపలికి అనుమతించడంతో ఆందోళన విరమించారు.