Operation Sindoor | హైదరాబాద్ : ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్న లక్ష్యంతో భారత సైన్యం మొదలుపెట్టిన ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా ఈ నెల 9వ తేదీన భారీ ర్యాలీ చేపట్టనున్నట్టు తెలంగాణ జాగృతి సంస్థ ప్రకటించింది. శుక్రవారం నాడు సాయంత్రం 6 గంటలకు పీపుల్స్ ప్లాజా నుంచి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వరకు సాగనున్న ఈ ర్యాలీకి తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వం వహించనున్నారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాగుతున్న ఆపరేషన్ సిందూర్‌ను ప్రతి ఒక్కరూ బలపరచాల్సిన అవసరం ఉందని, ఉగ్రవాదంపై వీరోచితంగా పోరాడుతున్న భారత సైన్యానికి ప్రజలంతా దన్నుగా నిలవాలని తెలంగాణ జాగృతి సంస్థ విజ్ఞప్తి చేసింది. అందులో భాగంగా భారత సైన్యానికి మద్దతుగా నిర్వహిస్తున్న ర్యాలీకి ప్రజలు, యువత పెద్ద ఎత్తున తరలి రావాలని తెలంగాణ జాగృతి పిలుపునిచ్చింది.