హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): గడియకోసారి పెరుగుతున్న గ్యాస్ ధరతో దేశప్రజలకు గుండెదడ వస్తున్నదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ కాదని.. ఆయన ధరేంద్రమోదీ అని వ్యాఖ్యానించారు. మోదీ అస్తవ్యస్త విధానాలతో వంట గదుల్లో మంట పడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ ఎనిమిదేండ్ల అసమర్థ పరిపాలనలో గ్యాస్ ధర 170 శాతం పెరిగిందని, ప్రపంచంలోనే అత్యధిక రేటుకు వంటగ్యాస్ అమ్ముతున్న బీజేపీ సర్కార్ రికార్డు సృష్టించిందని విమర్శించారు.
ఈ ఏడాది ఆరు నెలల్లోనే గ్యాస్ ధరను రూ.244 మేర పెంచారని, మోదీ పాలన చూసి అరాచకత్వం సైతం సిగ్గుతో తలవంచుకుంటున్నదని ఎద్దేవా చేశారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో రూ.410గా ఉన్న సిలిండర్ ధర తాజాగా పెంచిన రూ.50తో మూడు రెట్లు పెరిగి రూ.1100 దాటడం దురదృష్టకరమని అన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా వంట గ్యాస్ ధర రూ. 1100 దాటడం బీజేపీ అసమర్థ పరిపాలనకు నిదర్శనమని చెప్పారు. ‘ధరేంద్ర మోదీ’ హయాంలో గ్యాస్ బండ ధరలతో పేదల్ని బాదే కార్యక్రమం అడ్డూ అదుపు లేకుండా సాగుతున్నదని నిప్పులు చెరిగారు. రాయితీకి ‘రాం.. రాం’ చెప్పి సబ్సిడీలు ఎత్తేసి దేశ ప్రజలపై మోదీ దొంగ దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల నడ్డి విరుచుడే సుపరిపాలనా?
రూపాయి విలువ నానాటికీ పడిపోతుండగా, మరోవైపు పెట్రో ధరలు అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. చుక్కలనంటుతున్న నిత్యావసరాల ధరలతో ప్రతి భారతీయ కుటుంబం బడ్జెట్ పెనుభారంగా మారిందని చెప్పారు. బీజేపీ అసమర్థ పాలన వల్లనే ప్రతి వస్తువు ధర ఆకాశన్నంటుతున్నదని, అయినా కేంద్రానికి సోయి లేదని నిప్పులు చెరిగారు. ప్రజల కష్టాలతో సంబంధం లేకుండా మోదీ పాలన సాగుతున్నదని విమర్శించారు. ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారని మండిపడ్డారు.
కొత్త ఉద్యోగాలు రాక, ఉన్న ఉద్యోగాలు ఊడి ప్రజల ఆదాయాలు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాకముందు గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై గొంతు చించుకున్న బీజేపీ నేతలంతా ఇప్పుడు తేలు కుట్టిన దొంగల లెక గప్చుప్ అయ్యారని ధ్వజమెత్తారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేని దౌర్భగ్య పాలనకు మోదీ నేతృత్వం వహిస్తున్నారని చెప్పారు. ధరలతో దేశ ప్రజలపై దండయాత్ర చేయడం, పన్నులు పెంచి ప్రజల నడ్డి విరచడాన్నే సుపరిపాలనగా భావిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.
కేంద్రంపై నిరంతర ఒత్తిడి
గ్యాస్ ధరల పెంపునకు అంతర్జాతీయ కారణాలను చూపించి తమ చేతకానితనాన్ని దాచాలనుకుంటున్న మోదీ కుటిలనీతిని దేశ ప్రజలు గుర్తిస్తున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఉజ్వల్ పథకం పేరుతో తమకు అంటగట్టిన సిలిండర్లను పెరుగుతున్న గ్యాస్ ధరల వల్ల మహిళలు ఉపయోగించడం లేదని, మళ్లీ కట్టెల పొయ్యి దికు చూస్తున్నారని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెప్తున్న జుమ్లాల మాదిరగానే ఉజ్వల పథకం తయారైందన్నారు.
ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే ధరలను నియంత్రించి దొంగ నాటకాలు ఆడే బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా పేద ప్రజల పట్ల సానుభూతితో వ్యవహరించి గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గ్యాస్ ధర పెంపునకు వ్యతిరేకంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.