హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో ఎనిమిది జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు క్యాబినెట్ సోమవారం అనుమతి ఇచ్చింది. తద్వారా దేశ వైద్య రంగ చరిత్రలో తెలంగాణ మరో రికార్డు సృష్టించింది. జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రంగా నిలిచింది. జోగులాంబ గద్వాల, నారాయణపేట, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మలాజిగిరి జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అనుమతి ఇస్తూ వైద్యారోగ్యశాఖ ఈ నెల 5న ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిర్ణయానికి క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. వచ్చే ఏడాది నుంచి ఒకో కాలేజీలో వంద ఎంబీబీఎస్ సీట్లతో తరగతులు ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోబోతున్నారు. దీంతో మరో 800 మెడికల్ సీట్లు కొత్తగా అందుబాటులోకి వస్తాయి. తద్వారా తొమ్మిదేండ్లలోనే 29 ప్రభుత్వ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కింది.
2014 నాటికి రాష్ట్రంలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. ప్రజలకు స్పెషాలిటీ సేవలను అందుబాటులోకి తేవడంతోపాటు తెలంగాణ బిడ్డలకు వైద్యవిద్యను చేరువ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆయన చొరవతో తొలి విడతగా మహబూబ్నగర్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేటలో మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. రెండో విడతలో నిరుడు 8 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది మరో తొమ్మిది మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. మిగతా 8 జిల్లాలకు తాజాగా మెడికల్ కాలేజీలు మంజూరయ్యాయి. దీంతో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ కల నెరవేరనున్నది.