హైదరాబాద్ : దేశం మొత్తం మీద సామాజిక పింఛన్లను పెద్ద సంఖ్యలో అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బోదకాలు,హెచ్ఐవి బాధితులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, చేనేత, గీత, బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తూ సీఎం కేసీఆర్ వారి జీవితాలకు భరోసా కల్పించి కొండంత అండగా నిలిచారన్నారు.
జగిత్యాల జిల్లా ధర్మారం మండలంలో కొత్తగా మంజూరైన 1,783 మందికి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కొత్తగా ప్రకటించిన 10లక్షలతో కలిపి మొత్తం 46 లక్షల మందికి ప్రతి నెల పింఛన్లు అందుతాయని పేర్కొన్నారు. ఇందుకోసం ఏటా రూ.12 వేల కోట్లు ఖర్చవుతాయని, వయో పరిమితిని 65 నుంచి 57 ఏండ్లకు తగ్గించారని తెలిపారు.
గడపగడపకు సంక్షేమ పథకాలు అందిస్తున్న సీఎం కేసీఆర్ గొప్ప మానవతా మూర్తి అని ప్రశంసించారు. తెలంగాణ గొప్ప లౌకిక, సంక్షేమ, శ్రేయోరాజ్యంగా దేశం మొత్తం మీద పేరుగాంచిందని మంత్రి కొప్పుల అన్నారు.
అన్ని వర్గాల ప్రజల భద్రత, సంక్షేమం, ఉన్నతి, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అంకితభావంతో ముందుకు సాగుతున్న కేసీఆర్ పాలనకు సంపూర్ణ మద్దతునివ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మంత్రి తెలిపారు.