e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home Top Slides ఇండస్ట్రీ ఏదైనా ఇక్కడే

ఇండస్ట్రీ ఏదైనా ఇక్కడే

ఇండస్ట్రీ ఏదైనా ఇక్కడే
 • పరిశ్రమలకు ‘అడ్వాంటేజ్‌ తెలంగాణ’
 • రోజుల వ్యవధిలో 2 మెగా ప్రాజెక్టులు
 • ప్రభుత్వ విధానాలు ఆకర్షణీయం
 • రాష్ర్టానికి క్యూ కడుతున్న కార్పొరేట్లు
 • తరలివస్తున్న వేల కోట్ల పెట్టుబడులు

రంగం ఏదైనా.. పరిశ్రమ ఏమైనా.. వాటి గమ్యస్థానం ఇప్పుడు తెలంగాణే. పుష్కలంగా భూ వనరులు, కొదవేలేని నైపుణ్యం, ప్రతిభ కలిగిన యువశక్తి రాష్ట్రం సొంతం. అందుకే కార్పొరేట్లు క్యూ కడుతున్నారు.
మొన్న వెల్‌స్పన్‌.. నిన్న ట్రిటాన్‌.. నేడు కిటెక్స్‌.. ఇలా ఎన్నో సంస్థలు రాష్ర్టానికి తరలివచ్చాయి, వస్తున్నాయి. ఇండస్ట్రీకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత, ఇక్కడి మౌలిక వసతులు..
పెట్టుబడుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. విధివిధానాల రూపకల్పనలో దేశానికే ఆదర్శంగా ఉంటూ.. కరోనా సంక్షోభంలోనూ అభివృద్ధిలో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తున్నది.

హైదరాబాద్‌, జూలై 17: దేశంలో నూతన పెట్టుబడుల కేంద్రంగా తెలంగాణ అవతరిస్తున్న ది. కొద్దిరోజుల వ్యవధిలో రెండు మెగా ప్రాజెక్టు ల్ని రాష్ట్రం చేజిక్కించుకోవడమే ఇందుకు తార్కాణం. జూన్‌లో అమెరికాకు చెందిన ట్రిటాన్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ కంపెనీ జహీరాబాద్‌లో ఉత్పాదక కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేసింది. ఈ కంపెనీ రూ. 2,100 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ ప్లాంటు నెలకొల్పుతుంది. ప్రాజెక్టును ప్రారంభించిన తొలి ఐదేండ్లలో 50,000 వాహనాల్ని ఉత్పత్తి చేయాలన్నది ప్రణాళిక. ఈ ప్రాజెక్టు ద్వారా 25,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ట్రిటాన్‌ ప్రకటన వెలువడిన కొద్దిరోజులకే మరో మెగా గ్రూప్‌ రాష్ర్టానికి తరలివచ్చింది. అదే గార్మెంట్స్‌ దిగ్గజం కిటెక్స్‌.

- Advertisement -

శరవేగంగా ప్రభుత్వ స్పందన
కేరళకు చెందిన కిటెక్స్‌ గ్రూప్‌ ఆ రాష్ట్రం నుంచి భారీ ప్రాజెక్టును తరలించడానికి వివిధ రాష్ర్టాల్ని అన్వేషిస్తున్న సంగతి తెలియగానే తెలంగాణ ప్రభుత్వం వేగంగా స్పందించి, కిటెక్స్‌ గ్రూప్‌ను రాష్ర్టానికి తీసుకురాగలిగింది. కిడ్స్‌ వేర్‌ తయారీలో ప్రపంచ అగ్రగామి కంపెనీల్లో ఒకటైన కిటెక్స్‌.. వరంగల్‌ కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌లో ఉత్పాదక కేంద్రాన్ని నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఈ అప్పారెల్‌ ప్లాంటు కోసం కిటెక్స్‌ తొలి దశలో రూ.1,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది. కేరళలో ఇబ్బందుల్ని ఎదుర్కొన్న కిటెక్స్‌ ఆ రాష్ట్రం నుంచి వెలుపలికి వచ్చేందుకు చూస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా స్పందించడంతో ఆ కంపెనీ దక్కింది.

పారిశ్రామికవర్గాల ప్రశంసలు
కిటెక్స్‌ బృందాన్ని చార్టర్డ్‌ విమానంలో రప్పించడం దగ్గర్నుంచి, టెక్స్‌టైల్‌ పార్క్‌ సందర్శనకు తక్షణ ఏర్పాట్లు చేయడం, వారి సందేహాల్ని వెనువెంటనే నివృత్తి చేయడంలో తెలంగాణ వ్యవహరించిన తీరుపై పారిశ్రామిక వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. పెద్ద ప్రాజెకుల్ని రాష్ర్టానికి రప్పించే ప్రక్రియనంతటినీ పరిశ్రమలు, ఐటీ మంత్రి కేటీఆర్‌ స్వయంగా పర్యవేక్షిస్తూ అవకాశాల్ని చటుక్కున అందిపుచ్చుకుంటున్నారు.

ఆకట్టుకుంటున్న పారిశ్రామిక విధానం
అన్నింటికంటే ప్రధానమైనది తెలంగాణ పారిశ్రామిక విధానం. ఇది వాణిజ్యవేత్తలను ఎంతగానో ఆకర్షిస్తున్నది. ఆరేండ్లుగా అమలవుతున్న టీఎస్‌-ఐపాస్‌ విజయవంతం కావడంతో సులభతర వ్యాపార ర్యాంకింగ్‌లో రాష్ట్రం ఉన్నత స్థానానికి చేరుకోగలిగింది. అన్ని పరిశ్రమల క్లియరెన్స్‌లు ఈ సర్టిఫికేషన్‌ సర్వీసు ద్వారా నోటిఫై అవుతాయి. టీఎస్‌-ఐపాస్‌ కింద దరఖాస్తు చేస్తే 27 శాఖలకు సంబంధించిన 35 రకాల క్లియరెన్స్‌లు లభిస్తాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్క్రూటినీ 72 గంటల్లో పూర్తవుతుంది. దరఖాస్తుదారులు ఇంకా సమర్పించాల్సిన సమాచారం గురించి వెంటనే తెలుసుకోగలుగుతారు. సీఎం కార్యాలయంలో పరిశ్రమల పర్యవేక్షణా సెల్‌ ఉంటుంది. ముఖ్య ప్రధానకార్యదర్శి నేతృత్వం లో ఈ సెల్‌ ప్రధాన ప్రాజెక్టుల అమలును, వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని పర్యవేక్షిస్తుంది.

మెగా ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు
మెగా ప్రాజెక్టులకు స్టేట్‌ ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ కమిటీ (ఎస్‌ఐపీసీ) నుంచి స్థల కేటాయింపులు జరుగుతున్నాయి. ప్రాజెక్టుకు పలు ప్రోత్సాహకాలు కూడా సిద్ధంగా ఉంటున్నాయి. రూ. 200 కోట్లకుపైగా పెట్టుబడి, 1,000 మందికి పైగా ఉపాధి కల్పించే వాటిని మెగా ప్రాజెక్టులుగా వర్గీకరిస్తారు. ఈ తరహా పారిశ్రామిక సానుకూల విధానాల ఫలితంగా దక్షిణాదిలో పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ ముందున్నది. ఇందుకు నిదర్శనమిదే.. కేరళలో ఇబ్బందుల్ని ఎదుర్కొన్న కిటెక్స్‌ బృందం ఆఘమేఘాల మీద తెలంగాణకు రావడమే కాదు. వచ్చిన గంటల్లోనే భారీ పెట్టుబడిని ప్రకటించింది. ఈ ప్రకటనకు స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తునే మద్దతిచ్చారు. కిటెక్స్‌ షేరు కేవలం వారంలో 85 శాతం పెరిగి రూ.110 నుంచి రూ.204కి చేరింది.

పెట్టుబడుల వెల్లువ
రాష్ట్ర ప్రణాళికా శాఖ ప్రచురించిన ‘తెలంగాణ సామాజిక-ఆర్థిక అవుట్‌లుక్‌ 2021’లో టీఎస్‌-ఐపాస్‌ వంటి విధానాలు రాష్ట్రంలో సానుకూల పెట్టుబడుల వాతావరణాన్ని సృష్టించినట్లు పేర్కొన్నది. ఈ వివరాల ప్రకారం తెలంగాణ ఆవిర్భావం నుంచి టీఎస్‌-ఐపాస్‌ ద్వారా 13,379 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు రూ.18,495 కోట్ల పెట్టుబడులతో నమోదయ్యాయి. 2,43,556 మందికి ఉపాధి కల్పన జరిగింది. ఇదే స్కీము ద్వారా 889 పెద్ద సంస్థలు రిజిష్టర్‌ అవగా, ఇవి రూ.1,88,881 కోట్ల పెట్టుబడుల్ని ప్రతిపాదించాయి. 12,14,462 ఉద్యోగాల కల్పన జరిగింది. శరవేగంగా వృద్ధి చెందుతున్న ఎలక్ట్రానిక్స్‌ వంటి నవరంగాల నుంచి తెలంగాణ రెండేండ్లలో రూ.7,500 కోట్ల పెట్టుబడుల్ని సాధించడం విశేషం.

కీలక అంశాలివే

 • ‘అడ్వాంటేజ్‌ తెలంగాణ’కు పలు కారణాలున్నాయని పారిశ్రామిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రోజుల వ్యవధిలో రెండు మెగా ప్రాజెక్టులు రాష్ర్టానికి తరలిరావడానికి వివిధ అంశాలు కీలకంగా నిలిచాయని ఆ వర్గాలు అంటున్నాయి.
 • మొదటిది: పరిశ్రమల ఏర్పాటులో రాష్ర్టాన్ని ఒక భాగస్వామిగా చూపించే సానుకూల దృక్పథం. ఇది పారిశ్రామికవేత్తల్ని రాష్ర్టానికి దగ్గర చేస్తున్నది.
 • రెండోది: నీరు, విద్యుత్‌, రోడ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పన.
 • మూడోది: నైపుణ్యాన్ని పెంపొందించడం తెలంగాణ వృద్ధి ప్రణాళికలో ప్రధానమైనది. నైపుణ్యంగల సిబ్బందిని పరిశ్రమలకు అందించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకున్నది.
 • నాల్గవది: భారత చిత్రపటంలో తెలంగాణకున్న స్థానం. దీంతో ముడి పదార్థాలు, తుది ఉత్పత్తుల్ని సులభంగా రవాణా చేసుకునే ప్రయోజనం పరిశ్రమలకు లభిస్తున్నది.
 • మొత్తంగా ఈ అంశాలన్నింటితో తెలంగాణ రాష్ట్రం.. పారిశ్రామికవేత్తలకు కీలక పెట్టుబడుల కేంద్రంగా మారింది.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇండస్ట్రీ ఏదైనా ఇక్కడే
ఇండస్ట్రీ ఏదైనా ఇక్కడే
ఇండస్ట్రీ ఏదైనా ఇక్కడే

ట్రెండింగ్‌

Advertisement