హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించటంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటులో ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటించింది. గురువారం లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ‘తెలంగాణలో తాగునీటిలో ఆరు శాతం శాంపిల్స్‌లో
కలుషితాలు ఉన్నట్టు తేలింది. ఈ సమాచారం కేంద్రంవద్ద ఉన్నదా?’ అని ప్రశ్న అడిగారు. రాష్ట్రంలో తాగునీరు కలుషితంగా ఉన్నదని నిరూపించేందుకు రేవంత్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఈ ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తిశాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్‌సింగ్ పాటిల్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ‘మేము తాగునీటి నాణ్యతను పరీక్షించేందుకు నిర్వహించిన పరీక్షల్లో తెలంగాణలోని అత్యధిక ప్రజలు స్వచ్ఛమైన, శుద్ధమైన నీటిని పొందుతున్నారని, నీరు కలుషితం కావడం అతిస్వల్పమేనని తేలింది. తెలంగాణలో 2020-2021లో 1.74 లక్షల శాంపిల్స్ పరీక్షించగా 411 శాంపిల్స్‌లో మాత్రమే కలుషితాలు ఉన్నట్టు గుర్తించాం. నమునాల్లో ఇది 0.23 శాతమే’ అని ప్రకటించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే ఎక్కువగా కలుషిత తాగునీరు సరఫరా అవుతున్నట్టు కేంద్రం ఇచ్చిన సమాధానంలో స్పష్టమైంది.
ఫిల్టర్ బెడ్ల వద్ద గంటకోసారి పరీక్ష
రాష్ట్రంలో ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించటంలో సీఎం కేసీఆర్ మానస పుత్రిక మిషన్ భగీరథ పథకం అద్భుత ఫలితాలు ఇస్తున్నది. రాష్ర్టాన్ని అతి తక్కువ కలుషిత నీరు అందిస్తున్న రాష్ట్రంగా నిలిపింది. గ్రామీణ నీటి సరఫరా అధికారులు ప్రతి గ్రామంలో ఏటా రెండుసార్లు నీటి పరీక్షలు నిర్వహిస్తుంటారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో 75 ల్యాబ్‌లు ఉన్నాయి. రాష్ట్రస్థాయిలో మరో రెండు ల్యాబ్‌లు అదనంగా పనిచేస్తున్నాయి. ప్రతి ల్యాబ్‌లో కెమిస్ట్, మైక్రోబయోలాజిస్ట్ ఉంటారు. గ్రామాల్లోని ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల వద్ద వీరు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఏదైనా గ్రామంలో నీటి నాణ్యతపై ఫిర్యాదులు వస్తే వెంటనే పరీక్షలు నిర్వహిస్తారు. కలుషితాలు ఉన్నట్టు తేలితే తగిన చర్యలు తీసుకుంటారు. మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్ల వద్ద ప్రతి గంటకోసారి నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించిన తర్వాతే నీటిని గ్రామాలకు సరఫరా చేస్తారు. ఆ పరీక్షల వివరాలను ఎప్పటికప్పుడు రికార్డు చేస్తారు. ఉన్నతాధికారులు వీటిని నిత్యం పరిశీలిస్తారు. దీంతో నీరు కలుషితమయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి.