
రామంతాపూర్, డిసెంబర్ 11: తెలంగాణ ఐటీ పరిశ్రమ దేశంలోనే నంబర్‌గా ఉన్నదని, దీన్ని హైదరాబాద్‌లో అన్నివైపులా విస్తరించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ‘లుక్ ఈస్ట్’ పాలసీని తీసుకొచ్చిందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. శనివారం ఆమె ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డితో కలిసి ఉప్పల్ పారిశ్రామికవాడలో సాలిగ్రామ్ టెక్స్మార్ట్ ఐటీ కంపెనీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. దేశంలో ఐటీకి మారుపేరుగా హైదరాబాద్ మరింత ఎదుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ యువతకు అద్భుత ప్రోత్సాహాన్ని అందిస్తున్నారని, సాలిగ్రామ్ టెక్స్మార్ట్ కంపెనీలో ఇప్పటికే 300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో నిరుద్యోగులకు మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించాలని ఆ కంపెనీని కోరారు. తెలంగాణ బిడ్డలు ఇక్కడ ఐటీ కంపెనీని ప్రారంభించడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో కంపెనీ నిర్వాహకులు పీ పవన్‌రావు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.