Telangana | ఏడాది పాలనతోనే తెలంగాణ రెయిజింగ్ అంటూ కాంగ్రెస్ సర్కారు చేసుకుంటున్న ప్రచారంపై బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం బీఆర్ఎస్ నేతలతో కలిసి తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో కంటే ఇతర అంశాల్లో దూసుకెళ్తోందని విమర్శించారు. నిర్భంధాలలో, కూల్చివేతలలో, హత్యలు, అత్యాచారాలలో, రైతుల కష్టాలలో, రైతుల ఆత్మహత్యల్లో, గురుకులాల విద్యార్థుల మరణాలలో, ధర్నాలు, లాఠీచార్జీలు, అక్రమ అరెస్టులలో, రైతు కష్టాల్లో, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యల్లో, పోలీసు కానిస్టేబుళ్ల ఆందోళనల్లో, జర్నలిస్టుల మీద దాడుల్లో, ఎన్ కౌంటర్లలో రెయిజింగ్ అవుతోందని ఆరోపించారు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి బూతుల్లో, ముఖ్యమంత్రి అబద్దాల్లో చాలా రెయిజింగ్ ఉందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ సర్కారు స్కాముల్లో, అవినీతిలో, ఢిల్లీ ట్రిప్పుల్లో, ఢిల్లీకి పంపే మూటల్లో పెరుగుదల ఉందని వై.సతీశ్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ రెయిజింగ్ అవ్వకపోగా.. అప్పటికే అభివృద్ధిలో దూసుకెళ్తున్న రాష్ట్రం తిరోగమన మార్గం పట్టిందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు రక్తం చిందిస్తోంటే.. కాంగ్రెస్ సర్కారు జల్సాలు చేస్తోందని ఆరోపించారు.
తెలంగాణ రెయిజింగ్ అంటే.. అన్ని రంగాల్లో వృద్ధి కనిపించాలని.. కానీ ఇప్పుడు ఏ రంగంలోనూ వృద్ధి కనిపించడం లేదని అన్నారు. రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందని, పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగ కల్పన 9 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయని చెప్పారు. ఉద్యోగాల కల్పనలో 2015 కంటే దిగువకు రాష్ట్రం పడిపోయిందని వివరించారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కూడా పూర్తిగా పడిపోయిందని… ఇండ్లు కొనాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. ఉన్న ఇళ్లు కూడా ఉంటాయో కూలిపోతాయో అన్న భయం ప్రజల్లో కనిపిస్తోందని అన్నారు.