కాగజ్‌నగర్, మే 26 : ద్రోహులతోనే తెలంగాణ రాష్ట్రం చీకట్లో నెట్టబడిందని, తెలంగాణను కాంగ్రెస్ దోపిడీ నుంచి విముక్తి చేసేది, మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సోమవారం ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. పార్టీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్‌లో చేరిన ఇంద్రకరణ్‌రెడ్డి, పోచారం తదితర ద్రోహులు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనప్పలాగే తిరిగి పార్టీలోకి వచ్చేందుకు తియ్యటి మాటలు మాట్లాడినా ఆశ్చర్యంలేదని చెప్పారు.
కోనప్ప కాంగ్రెస్‌లో చేరే నాటికే తాను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో కేసీఆర్‌తో ఎన్నికలలో పొత్తుపై చర్చించినట్టు గుర్తుచేశారు. సిర్పూర్లో కోనేరు కోనప్ప కుటుంబం మాఫియా దౌర్జన్యాల నుంచి ప్రజలు విముక్తి కోరుకున్నందుకే తాను సిర్పూర్ నియోజవర్గానికి వచ్చానని తెలిపారు.