మడికొండ, అక్టోబర్ 11: నాణ్యమైన వస్ర్తాలకు తెలంగాణ నిలయమని మినిస్ట్రీ ఫ్యామిలీ ఇన్ కువైట్, కువైట్ పార్లమెంట్ మాజీ స్పీకర్ ఒమైర్ ఏవోఏ అలజ్మీ అన్నారు. హనుమకొండ జిల్లా మడికొండలోని కాకతీయ వీవర్స్ సొసైటీ టెక్స్టైల్ పార్కును మంగళవారం ఆయన సందర్శించారు. ఆయనతో పాటు అల్రాజా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అభినవ్ అల్లాడి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రషీద్ బిన్ సయీద్ అల్హది, అపోలో హాస్పిటల్స్‌లో జనరల్ సర్జన్ డాక్టర్ అర్జున్‌రెడ్డి, టెక్స్టైల్ వ్యాపారవేత్త నవనీత్ అగర్వాల్ ఉన్నారు.
టెక్స్టైల్ పార్కులో నాణ్యమైన యంత్రాలు ఉండటం వల్ల దుస్తులు మన్నికగా ఉంటాయని పేర్కొన్నారు. కువైట్‌తో పాటు ఐదు దేశాలకు సరిపడా తెల్లని వస్త్రం ఆర్డర్ ఇస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే పెట్టుబడి పెడుతామని, ముడి సరుకు కూడా పంపిస్తామని చెప్పారు. సొసైటీ సభ్యులు సమష్టిగా ఏర్పడి క్లస్టర్ ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
సూరత్‌కు దీటుగా ఇక్కడ యూనిట్లను స్థాపించడం బాగుందని తెలిపారు. టెక్స్టైల్ పార్కు అభివృద్ధికి తమ వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు. తమకు నాణ్యత ముఖ్యమని, నాణ్యత ప్రమాణాలు పాటిస్తే ముస్లిం దేశాలకు ఇక్కడినుండే క్లాత్ తీసుకెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు దర్గ స్వామి, ఉపాధ్యక్షుడు కూరపాటి ఐలయ్య, మచ్చ వీరన్న, డైరెక్టర్లు దగ్గు రవీందర్, సదానందం, వెంకటేశ్వర్లు, రాజు తదితరులు పాల్గొన్నారు.