
హైదరాబాద్ : దేశంలోనే వైద్యరంగంలో తెలంగాణ ఉత్తమ రాష్ట్రం అని మరోసారి రుజువైంది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్రం నిర్వహించిన హెల్త్ అండ్ ఫిట్ నేషన్ కార్యక్రమంలో తెలంగాణ వైద్య రంగం పాల్గొన్నది. ఈ కార్యక్రమంలో భాగంగా వెల్నెస్ యాక్టివిటీస్‌లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలవగా, ఎన్సీడీ స్క్రీనింగ్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్య సిబ్బందికి ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అభినందనలు తెలిపారు.
నవంబర్ 16 నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు జరిగిన ఈ క్యాంపెయిన్ సబ్ సెంటర్ స్థాయిలో కేవలం మూడు లక్ష్యాలను నిర్దేశిస్తూ కొనసాగింది. ఒకటి ఒక సబ్ సెంటర్ పరిధిలో కనీసం 100 మందికి నాన్ కమ్యూనికబుల్ డిసీసెస్(NCD) పరీక్షలు నిర్వహించడం, రెండోది సబ్ సెంటర్ పరిధిలో 10 వెల్నెస్ యాక్టివిటీస్ నిర్వహించడం, మూడోది సబ్ సెంటర్ పరిధిలో కనీసం 100 డిజిటల్ ఐడీలు సృష్టించడం. అయితే ఈ మూడింటిలో రెండు విభాగాలకు రాష్ట్రానికి అవార్డులు వచ్చాయి. వెల్నెస్ యాక్టివిటీస్‌లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలవగా, ఎన్సీడీ స్క్రీనింగ్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు అవార్డులు రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో తెలంగాణ వైద్య రంగం పటిష్టమైందని మరోసారి చాటి చెప్పింది. రాష్ట్రంలోని సబ్ సెంటర్ల పరిధిలో వైద్య సిబ్బంది ఈ కార్యక్రమాలు నిర్వహించారు.

యూనివర్సల్ హెల్త్ కవరేజీ డే-2021 సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఈ అవార్డులను బహుకరించింది. కేంద్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, కేంద్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రాజేష్ భూషణ్, NHA CEO ఆర్ఎస్ శర్మ, NHM ASMD వికాస్ శీల్ తదితరుల చేతుల మీదుగా రాష్ట్ర సిబ్బంది అవార్డులు అందుకున్నారు.
యూనివర్సల్ హెల్త్ కవరేజి డే-2021 సందర్భంగా ఈ రోజు కేంద్ర వైద్యారోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి @DrBharatippawar గారి చేతుల మీదుగా రాష్ట్ర వైద్య సిబ్బంది అవార్డులు అందుకున్నారు. సీఎం శ్రీ కేసీఆర్ గారి మార్గనిర్దేశకంలో రాష్ట్ర వైద్య రంగం బలోపేతమైందని మరోసారి నిరూపితమైంది. 2/2
— Harish Rao Thanneeru (@trsharish) December 13, 2021