హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఎనిమిదేండ్ల పాలనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క భారీ ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయింది. వివిధ రాష్ర్టాల్లో ఎన్నికల సందర్భంలో జాతీయ ప్రాజెక్టులను అట్టహాసంగా ప్రకటించడమే తప్ప వాటిని పూర్తి చేసేందుకు ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదు. అందుకు నిలువెత్తు నిదర్శనం ఏపీలోని పోలవరం ప్రాజెక్టు. వాస్తవంగా 2004లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. అప్పట్లోనే ప్రాజెక్టుకు సంబంధించిన కుడి, ఎడమ కాలువలను చాలా వరకు తవ్వారు. ఇక 2014లో ఏపీ పునర్విభజన చట్టాన్ని అనుసరించి ఈ ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చారు. అప్పటికే నిర్మాణ వ్యయం రెండింతలైంది. గత ఎనిమిదేండ్లలో స్పిల్‌వే నిర్మాణం మాత్రమే పూర్తయింది. కాలువల పనులు చివరి దశకు చేరుకొన్నాయి. నీటి నిల్వకు సంబంధించిన కీలకమైన ఎర్త్ఫిల్ రాక్డ్యామ్ పనుల్లో అడుగు కూడా ముందుకు పడలేదు. దీనికితోడు ఇప్పటికే పూర్తయిన పనుల్లో అనేక లోపాలు బయటపడుతున్నాయి. స్వయంగా కేంద్ర జలసంఘం అధికారులే వాటిని గుర్తించడంతోపాటు ఆయా పనులపై పునఃపరిశీలనకు నడుం బిగించడం గమనార్హం. డ్యామ్ నిర్మాణంలో ప్రధానమైన డయాఫ్రం వాల్ పూర్తిగా దెబ్బతినింది. మొత్తంగా రూ.650 కోట్లతో నదీ గర్భం నుంచి నిర్మించిన ఈ డయాఫ్రం వాల్ ఏ విధంగానూ పనికి రాదని దానిపై అధ్యయనం చేసిన నిపుణులు నిర్ధారించారు. ప్రస్తుతం నిర్మించిన డయాఫ్రం వాల్‌ను పూర్తిగా తొలగించి, కొత్తగా నిర్మించాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అంతేగాక అనేక లోపాలను సీడబ్ల్యూసీ అధికారులే గుర్తించారంటే పోలవరం పనులపై కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ ఎంత హీనంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. పోలవరమే కాదు ఇటీవల ప్రకటించిన అప్పర్‌భద్ర ప్రాజెక్టుదీ అదే పరిస్థితి. ఇక కెన్-బెత్వా రివర్ లింకింగ్ ప్రాజెక్టు పనుల్లో పురోగతి సున్నా.
దేశవ్యాప్తంగా సగటు ఆలస్యం 42.13 నెలలు
పోలవరం మాత్రమే కాదు దేశవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు ఏండ్ల తరబడి సాగుతూ.. నత్త నడకను తలపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కేంద్రం చేపట్టిన ఒక్కో ప్రాజెక్టు నిర్దేశిత సమయం కంటే సగటున 42 నెలల 13 రోజులు (సుమారు మూడున్నరేండ్లు) ఆలస్యమవుతున్నది. ఆయా ప్రాజెక్టుల వ్యయం లక్షల కోట్లు పెరిగిపోతున్నదని కేంద్రం ప్రకటించిన గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. నిర్మాణ పనుల ఆలస్యం కారణంగా దేశవ్యాప్తంగా కేంద్రం చేపట్టిన వివిధ ప్రాజెక్టుల అంచనా వ్యయం 2022 మార్చి నాటికి ఏకంగా రూ.4.83 లక్షల కోట్లు పెరిగింది. వీటిలో అత్యధికం డబుల్ ఇంజిన్ రాష్ర్టాలుగా చెప్పుకొంటున్న బీజేపీ రాష్ర్టాల్లోనే ఉండటం గమనార్హం. ముఖ్యంగా బీజేపీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన రాష్ర్టాల్లో మరీ ఆలస్యమవుతున్నాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. భూ సేకరణలో ఆలస్యం, నైపుణ్యంగల కార్మికులు లభించకపోవడం, నిర్మాణ సామగ్రి సరఫరాదారుల గుత్తాధిపత్యం వంటి కారణాలతో ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని కేంద్రం చెప్తున్నది.
కాళేశ్వరం అద్భుతం.. ఆదర్శం
ప్రాజెక్టులను నిర్దేశిత కాలంలో పూర్తిచేయడంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఇందుకు కాళేశ్వరం ప్రాజెక్టే తిరుగులేని ఉదాహరణ. ఇంత పెద్ద ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తిచేయడాన్ని చూసి ప్రపంచమే అబ్బురపడిందనడంలో అతిశయోక్తి లేదు. స్వరాష్ట్రంలో 2016 మే 2న ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టును 2019 జూన్ 21న జాతికి అంకితం చేయడం తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం.
ఈ ఏడాది జూలై నాటికి జాతీయ ప్రాజెక్టు పోలవరం ప్రధాన పనుల పురోగతి ఇలా..