హైదరాబాద్ : నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు (Jobs inTelangana ) కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందు వరుసలో ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ( errabelli dayakar rao) అన్నారు.తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం(టీపీయూఎస్) 2023 డైరీని మంగళవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
అంతర్జాతీయ ఎంఎన్సీ కంపెనీల కేంద్రంగా కొనసాగుతున్న ( hyedrabad )హైదరాబాద్ కు దేశం నలుమూలల నుంచి వచ్చే నిరుద్యోగులకు అతిపెద్ద ఉపాధి, ఉద్యోగ కల్పన నగరంగా మారిందన్నారు.ఉద్యోగార్థులకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించడమే కాకుండా వారికి అత్యధిక కనీస వేతనాలు అందిస్తూ, పీఎఫ్,ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత వంటి అనేక వసతులు కల్పిస్తుందని పేర్కొన్నారు.
ప్రభుత్వం వేస్తున్న నోటిఫికేషన్లను ప్రైవేట్ ఉద్యోగులు సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగులుగా మారాలని సూచించారు.ఉద్యోగం రాని వారు ప్రభుత్వం అందించే స్వయం ఉపాధి పథకాల ద్వారా లబ్ది పొందాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, సంఘం జాతీయ అధ్యక్షులు గంధం రాములు, కార్యదర్శి మోహన్ నాయక్, సభ్యులు వెల్పుకొండ వెంకటేశ్, విజయ్ రావు, స్వర్ణక్క తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ
తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్-2023 సంవత్సరం డైరీని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సందీప్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు లతో కలిసి ఆవిష్కరించారు.మంత్రి మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు కష్టపడి పనిచేయడం వల్ల గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు పోతున్నాయన అన్నారు.
తెలంగాణ పంచాయతీ కార్యదర్శులు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పి. మధుసూదన్ రెడ్డి , ఎంఎస్ఎస్ వాణి, మార విజయలక్ష్మి, పండరినాథ్, వెంకటరమణారెడ్డి, రమేశ్, సురేష్, మొగులయ్య, ప్రవీణ్ కుమార్, పరమేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
డాక్టరేట్ గ్రహితకు మంత్రి అభినందనలు
ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో తెలంగాణ రాష్ట్ర నిర్మాణ ఉద్యమం- కరపత్ర సాహిత్యం అనే అంశంపై ఆచార్య సూర్య ధనుంజయ్ పర్యవేక్షణ లో వేల్పుకొండ వెంకటేష్ చేసిన పరిశోధనకు గాను యూనివర్సిటీ పీహెచ్డీ పట్టాను అందించింది. ఈ సందర్భంగా వేల్పుకొండ వెంకటేశ్‌ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మంత్రి ఆకాంక్షించారు.