హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): మహిళల రక్షణ, భద్రత విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మానవ అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై శుక్రవారం హైదరాబాద్‌లోని తాజ్ డెకన్లో నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సదస్సులో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా శిశు, సంక్షేమ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాపై అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు యువత బ్రాండ్ అంబాసిడర్లుగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళలు అపదలో ఉన్నామని భావిస్తే డయల్ 100, మహిళా హెల్ప్‌లైన్ 181, మహిళా కమిషన్ వాట్సప్ నంబర్లకు, చైల్డ్‌లైన్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ నవీన్‌రావు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మిరెడ్డి, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్యా దేవరాజన్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తదితరులు పాల్గొన్నారు.