గింతకంటే మంచి సీఎం సారు ఏడున్నడు చెప్పుండ్రి.. పొలంల పంట నుంచి పిల్లల సదువు దాకా.. అన్నింటికీ భరోసా సారుదే.. లగ్గం చేసేదాకా నాకు మస్తు భయమైంది.. పెండ్లి చేసినంక పైసలు రాంగనే ఎవల పైసలు ఆళ్లకు ఇచ్చేసిన.. కామారెడ్డిలో ఒక ఆడపిల్ల తల్లి ఆనందమిది.
పేద తల్లిదండ్రులు పడే వేదన ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ను విచలితం చేసింది. ఫలితంగా 2014 అక్టోబర్ 2 మహాత్ముడి జయంతి రోజున పురుడు పోసుకొన్న కల్యాణలక్ష్మి/షాదీముబారక్ పథకం 11.62 లక్షలమంది ఆడపిల్లల పెండ్లిళ్లకు భరోసానిచ్చింది. 8 ఏండ్లలో ఏకంగా రూ.పది వేల కోట్ల మైలురాయిని దాటి తెలంగాణ సంక్షేమ రథం కొత్త రికార్డును సృష్టించింది.
సాయం మరువలేనిది
మాది నిరుపేద కుటుంబం. నాకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. నా భర్త సాయన్న 2015లో రోడ్డు ప్రమాదంలో చనిపోయిండు. 2020లో పెద్ద బిడ్డ
నందినికి పెండ్లి చేసిన. చేతిల చిల్లి గవ్వ లేకుండే. పెండ్లి కోసం చుట్టాల దగ్గర అప్పు చేసిన. తీసుకున్న బాకీ ఎట్ల కట్టాలో అర్థం కాలే. ఇంతలో మా వార్డు కౌన్సిలర్ రమ్య మా ఇంటికి వచ్చి కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసుకొమ్మని చెప్పింది. దరఖాస్తు చేసిన 15 రోజులకు రూ.లక్ష నూట పదహార్లు సాయం అందింది. అప్పులు కట్టిన. నాకు వితంతు పింఛను వస్తున్నది. ఇప్పుడు
ఏ బాధా లేదు. మాలాంటి పేదలకు కేసీఆర్ సారు దేవుడి లాంటి వారు.
– ఆరె అనసూయ, నిర్మల్
హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్ పథకం మరో రికార్డును సృష్టించింది. ఆడపిల్ల వివాహభారం తల్లిదండ్రులపై పడకుండా ప్రభుత్వం సాయం అందిస్తున్న ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 11.6 లక్షల మందికిపైగా లబ్ధిపొందారు. గడిచిన 8 ఏండ్లలో రూ.10వేల కోట్ల ఆర్థికసాయాన్ని అందజేసిన ఘనతనూ ఈ పథకం దక్కించుకుంది. స్వరాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన సంక్షేమ పథకాల్లో అత్యంత కీలకమైనది కల్యాణలక్ష్మి. పేదింటి ఆడపిల్ల పెండ్లి తల్లిదండ్రులకు గుండెలపై కుంపటి కావద్దని భావించిన సీఎం కేసీఆర్.. కల్యాణలక్ష్మి/షాదీముబారక్ అనే విప్లవాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. 2014 అక్టోబర్ 2 నుంచి ప్రారంభమైన ఈ పథకం.. ప్రభుత్వ ఆశయాన్ని సాకారం చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతున్నది. తొలుత పథకం కింద ఎస్సీ, ఎస్టీల యువతుల వివాహానికి రూ.51,000 ఆర్థిక సాయాన్ని అందజేయగా.. అటు తరువాత దానిని బీసీలకు సైతం విస్తరింపజేశారు. మూడేండ్ల తరువాత 2017లో పథకం కింద అందిస్తున్న ఆర్థికసాయాన్ని రూ.51,000 నుంచి 75,116కు పెంచారు. 2018 మార్చి19 నుంచి ఆ మొత్తాన్ని మరోసారి రూ.1,00116లకు పెంచి దిగ్విజయంగా అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 11,62,917 మంది ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ మేనమామగా ఆర్థిక సహాయం అందించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు నిరుపేద తల్లిదండ్రులకు ఎంతో అండగా నిలుస్తున్నాయి. పథకం కింద ఒకే కుటుంబం నుంచి ఒకరికి మించి లబ్ధి పొందిన వారుండటం విశేషం. అదేవిధంగా కల్యాణలక్ష్మి/ షాదీముబారక్ ద్వారా లబ్ధి పొందిన ఆడబిడ్డల్లో అత్యధికశాతం మంది.. ఆ తర్వాత కేసీఆర్ కిట్లను అందుకుంటుండటం మరో విశేషం.
దరఖాస్తుదారుల్లో 90శాతం మందికి
కల్యాణలక్ష్మి పథకం ద్వారా లబ్ధిపొందిన వారిలో అత్యధికులు బీసీలే. పథకాన్ని ప్రారంభించిన మూడేండ్ల తర్వాత నుంచి ఈబీసీలకూ దానిని వర్తింపజేస్తూ వస్తున్నారు. దరఖాస్తు చేసుకున్నవారిలో 90శాతం మందికి కల్యాణలక్ష్మి/షాదీముబారక్ ద్వారా నిధులు అందుతుండటం మరో ఆసక్తికర అంశం. ఇప్పటివరకు ఈ పథకానికి 13,18,983 దరఖాస్తులు రాగా, అందులో 11,62,917 మందికి ఆర్థికసాయాన్ని అందజేశారు. వీరిలో బీసీలే 5,12,002 మంది (46.20 శాతం) ఉండటం విశేషం. ఈ పథకానికి సంబంధించి 2022-23 బడ్జెట్లో 1,850 కోట్లను కేటాయించడంతోపాటు నిధులను మొదటి త్రైమాసికంలోనే ప్రభుత్వం విడుదల చేసింది. అందులో సగానికిపైగా నిధులను ఇప్పటికే లబ్ధిదారులకు అందజేశారు. ఇక కల్యాణలక్ష్మి/షాదీముబారక్‌కు వచ్చే దరఖాస్తుల సంఖ్య సైతం ప్రతి సంవత్సరం పెరుగుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తికి మరో త్రైమాసికం మిగిలి ఉండగానే.. కల్యాణలక్ష్మి పథకానికి ఇప్పటివరకు 97వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.
512 మంది దివ్యాంగ ఆడబిడ్డలకు 6 కోట్లు
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం దివ్యాంగ ఆడబిడ్డలకూ ఎంతో ఆసరాగా నిలుస్తున్నది. పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద అందజేసే ఆర్థిక సహాయానికి 25 శాతం అదనంగా వీరికి ప్రభుత్వం బహూకరిస్తున్నది. సాధారణంగా ఈ పథకం కింద ఆడబిడ్డల పెండ్లికి రూ.1,00,016 అందిస్తుండగా, దివ్యాంగ ఆడబిడ్డలకు రూ.1,25,016 అందజేస్తున్నది. పథకం కింద ఇప్పటివరకు 512 మంది దివ్యాంగులకు రూ.6.40 కోట్లను అందజేసింది.
కేసీఆర్ సార్ ఆప్తుడయ్యారు
నా సోదరి, ఆమె భర్త కొన్నేండ్ల క్రితం మృతిచెందారు. వాళ్ల కుమార్తె శిరీషను మేమే చేరదీశాం. ఆమెకు ఎలా పెండ్లి చేయాలా అని మదనపడ్డాం.
అప్పులు చేసి పెండ్లి చేసినం. కల్యాణలక్ష్మి ద్వారా వచ్చిన సాయంతో తిరిగి అప్పు తీర్చి నం. శిరీషకు సీఎం కేసీఆర్ తండ్రిలా సాయం చేశారు.
కల్యాణలక్ష్మి సాయం రాకపోతే చాలా ఇబ్బందిపడేవాళ్లం.
-ఆముదాల మదనమ్మ, రుద్రంపూర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఇద్దరు బిడ్డలకూ కల్యాణలక్ష్మి సాయం వచ్చింది
నాకు నలుగురు ఆడపిల్లలు. ఇద్దరి పెండ్లి చేసినంక ఏడేండ్ల కింద నా భర్త చనిపోయిండు. కూలి పనులు చేస్తూ పిల్లలను సాకిన. మిగతా ఇద్దరు బిడ్డల పెండ్లి చేయలేక ఇబ్బందులు పడ్డా. చేతిలో చిల్లిగవ్వ లేక, ఏమి చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో కేసీఆర్ సార్ ఇచ్చిన కల్యాణలక్ష్మి ఆదుకొన్నది. పెండ్లి అయిన నెల రోజులకే మాకు రూ.లక్ష నూటపదహార్లు వచ్చినయ్. ఆ డబ్బుతో చేసిన అప్పు తీర్చిన. కేసీఆర్ సార్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.
– వేముల ఎల్లమ్మ,దామరచర్ల, నల్లగొండ జిల్లా
ముగ్గురు బిడ్డల పెండ్లిళ్లకు తోడ్పాటు
మాకు 8 మంది ఆడపిల్లలు, కుమారుడు ఉన్నాడు. అయిజ ఎస్సీ కాలనీలోని చిన్న ఇంట్లో ఉంటున్నాం. 48 ఏండ్లుగా మట్టిపని చేస్తూ బతుకుతున్నం. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. అప్పోసప్పోచేసి నలుగురు ఆడబిడ్డల పెండ్లి చేసినం. కల్యాణలక్ష్మి పథకం సాయంతోటి ముగ్గురికి పెండ్లి చేసినం. సీఎం కేసీఆర్ సర్కార్ మళ్లా రావాలి. నా మరో బిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి అందించాలి.
– ప్రమీల, అయిజ, జోగులాంబ గద్వాల
ఏ జన్మల రుణమో..
నేను, నా భర్త కూలీ పనిచేస్తం. మాకు అయిదుగురు బిడ్డలు, ఒక్క కొడుకు. బాకీ తెచ్చి పెద్ద బిడ్డ పెండ్లి చేసినం. అప్పుడు కల్యాణలక్ష్మి లే కుండె. రెండో బిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి కింద రూ.50వేలు వచ్చినయ్. ఈ ఏడాది మూడో బిడ్డ జమున పెండ్లికి రూ.లక్షా నూటపదహారు వచ్చినయ్. కూలీ చేసుకుని బతికే మాకు పొట్టకే గోసయితంది. ఇగ పెండ్లికి పైసలు ఎక్కడి నుంచి వస్తయి. మాలాంటోళ్లు రంది పడకుండా టీఆర్ఎస్ సర్కారు కల్యాణలక్ష్మి తెచ్చింది. ఇద్దరు బిడ్డలకు సాయం వచ్చింది. ఏ జన్మల రుణమో ఇది. మా పెద్దన్న కేసీఆర్‌కు రుణపడి ఉంట.
-బానోతు లీలా, బడితండా, రుద్రంగి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా