హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): ఉన్నత విద్యలో తెలంగాణ ఉన్నత విద్యామండలి దేశంలోని అన్ని రాష్ర్టాలకు రోల్‌మాడల్‌గా నిలుస్తున్నదని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (నీపా) డైరెక్టర్ ప్రొఫెసర్ ప్రదీప్‌కుమార్ మిశ్రా ప్రశంసించారు. తెలంగాణ ఉన్నత విద్యామండలిని స్ఫూర్తిగా తీసుకొని, మిగతా రాష్ర్టాల ఉన్నత విద్యామండళ్లు బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఉన్నత విద్యలో సంస్కరణలు చేపట్టడంలో రాష్ట్రం ముందు వరుసలో ఉన్నదని కితాబిచ్చారు. సెంటర్ ఫర్ పాలసీ రిసెర్చ్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్, తెలంగాణ ఉన్నత విద్యామండలి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆలిండియా హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్స్ చైర్మన్ల రెండు రోజుల సదస్సు శుక్రవారంతో ముగిసింది. బేగంపేటలోని హోటల్ టూరిజం ప్లాజాలో జరిగిన ఈ సదస్సులో పాల్గొన్న ప్రదీప్‌కుమార్ మిశ్రా.. దేశంలో అన్ని రాష్ర్టాల ఉన్నత విద్యామండళ్లకు దిశానిర్దేశం చేయడంతో పాటు, వారి అభిప్రాయాలు సేకరించడం, అనుమానాలను నివృత్తి చేయడం, సలహాలు, సూచలనతో కూడిన న్యూస్ లెటర్‌ను తీసుకొచ్చే బాధ్యతలను తెలంగాణ ఉన్నత విద్యామండలికి అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సదస్సులో ఏకగ్రీవ తీర్మానం చేశారు. కర్ణాటక ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ తిమేగౌడ, తెలంగాణ ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, రాజస్థాన్, కేరళ ప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారు.
బిల్లు పెండింగ్‌లో ఉండటం బాధాకరం: ప్రొఫెసర్ లింబాద్రి
వర్సిటీల్లో అధ్యాపకుల కొరత విద్యార్థులకు నష్టం కలిగిస్తున్నదని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్‌లో 1960 నుంచి టీచర్ రిక్రూట్మెంట్ బోర్డు పనిచేస్తున్నదని, ఇటీవలే అస్సాం కూడా అధ్యాపకుల నియామకాలకు బోర్డును ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వ చర్యల ఫలితంగా ఉన్నత విద్యలో మహిళలు, బాలికల ప్రవేశాలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. దోస్త్ ద్వారా 1,080 డిగ్రీ కాలేజీల్లో ఆన్లైన్ అడ్మిషన్లు చేపడుతున్నామని, నకిలీ సర్టిఫికెట్లకు అడ్డుకట్టవేసేందుకు స్టూడెంట్ అకడమిక్ వెరిఫికేషన్ సర్వీసెస్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు. 1.200 గురుకులాల ఏర్పాటు, 6 వేల మందికి రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్స్ అందజేసినట్టు వెల్లడించారు. బ్రిటిష్ కౌన్సిల్‌తో భాగస్వామ్యం, ఉస్మానియా, కాకతీయ వర్సిటీలు వేల్స్, బంగోర్ వర్సిటీలతో ఎంఓయూలు కుదుర్చుకోవడం వంటి విజయాలను ఆయన ప్రస్తావించారు.