అబద్ధాన్ని పదేపదే చెప్పి జనాన్ని మాయ చేయవచ్చు. కానీ నిటారుగా కండ్లముందు నిలబడ్డ నిజాన్ని మాత్రం నీరుగార్చలేరు. ప్రపంచంలో అతి పెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరమే దీనికి సాక్ష్యం.
ఒక బరాజ్‌లోని ఒకేఒక (20వ నంబర్) పిల్లరు కుంగితే, ఒకేఒక (7వ) బ్లాకులో సమస్య తలెత్తితే… మొత్తం కాళేశ్వరమే వృథా అయినట్టు కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ప్రచారం చేసింది. ఇప్పుడు కూడా అదే పాట పాడుతున్నది. అసలు నిజం ఏమిటంటే…
మరిక కూలింది ఎక్కడ?
గత మూడు నెలల్లో వానలు విపరీతంగా పడ్డాయి. గోదావరి-ప్రాణహితకు భారీ వరద వచ్చింది. అయినా గోదావరి మీద నిర్మించిన ఏ ఒక్క బరాజ్ కూడా… లక్ష్మి, పార్వతి, సరస్వతి… ఏదీ చెక్కు చెదరలేదు. ఇప్పుడో అప్పుడో బరాజ్‌లు కూలిపోతాయని కాంగ్రెస్ నేతలు నోరు నొప్పిపుట్టేదాకా అరిచారు. కానీ జూలై 22వ తేదీన మేడిగడ్డ వద్ద ప్రవాహం ఏకంగా 10 లక్షల క్యూసెక్కులుగా, అంటే 103.55 మీటర్లుగా నమోదైంది. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఎగరేశారు. దాదాపు నెల రోజల పాటు రోజుకు సగటున 5 లక్షల క్యూసెక్కుల స్థాయిలో ప్రవాహం కొనసాగింది. చివరికి ఇప్పుడు, నిన్న శనివారం కూడా అక్కడ 5.93 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. అయినా బరాజ్ చెక్కు చెదరలేదు. ఇదీ నిజం.
మరిక 93 వేల కోట్లు మింగిందెవరు?
‘కాళేశ్వరం కట్టినం అన్నరు. లక్ష కోట్లు మింగిండ్రు’ ఇదీ మొన్నటికి మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రిరేవంత్రెడ్డి అన్నమాట. అర్థంకాని విచిత్రం ఏమిటంటే, రేవంత్ అట్లా మాట్లాడితే, ఇరిగేషన్ మంత్రిఉత్తమ్కుమార్ మాత్రం కాళేశ్వరం సిస్టంను వాడుకుంటామని ప్రకటించారు. ప్రకటించడమే కాదు. ప్రస్తుతం వాడుతున్నారు కూడా! అసలు కాళేశ్వరానికి అయిన ఖర్చు లక్ష కోట్లు కాదు; 93 వేల కోట్లు. మరి 93 వేల కోట్లనూ ఎవరో మింగితే ఉత్తమ్ చెప్పిన ‘కాళేశ్వరం సిస్టం’ ఎక్కణ్నుంచి ఎట్లా వచ్చింది?
కాంగ్రెస్ సగంలో వదిలేసిన ఎల్లంపల్లి, మిడ్‌మానేరు రిజర్వాయర్లు, ప్రస్తుతం నిర్మాణం పూర్తయి వినియోగంలో ఉన్న 13 పంపు హౌస్‌లు, అనంతగిరి సాగర్, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, బాహుబలి మోటర్లు, సబ్స్టేషన్లు, సర్జ్‌పూల్‌లు, పంప్‌హౌస్‌లు, కాల్వలు ఇవన్నీ కేసీఆర్ తేకపోతే ఎవరు తెచ్చినట్టు? గాల్లోంచి ఊడి పడ్డాయా? రేవంత్, ఉత్తమ్ అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని ఏమైనా రుద్దారా?
60 ఏండ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో ఈ నిర్మాణాలేవీ లేవు. కాళేశ్వరంతో మొత్తం 147 టీఎంసీల నీటి నిల్వకు కేసీఆర్ ప్లాన్ చేస్తే, అందులో 141 టీఎంసీల నీటి నిల్వకు నిర్మాణాలను ఆయన పూర్తి చేశారు. ఆయన కట్టిన సాగరాలు, జలాశయాల్లోనే ఈ రోజున రేవంత్ ప్రభుత్వం 80.21టీఎంసీల నీటిని నిల్వ చేసి ఉంచింది. ఇదీ నిజం..
సవాల్ సీదా… జవాబ్ దో!
కాళేశ్వరం ప్రాజెక్టు ఓ తెల్లఏనుగు. ఎంత ఖర్చు పెట్టినా దానికి సరిపోవడం లేదు. ఆయకట్టు ప్రాంతం పెరగకపోగా రాష్ట్ర వనరులను అది కరిగిస్తున్నది.ఇదీ టీపీసీసీ అధ్యక్షుడిగా, ఖమ్మం జనగర్జన సభలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్య.
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయిని కాదు. తెలంగాణకు ఒక కళంకం. కేసీఆర్ లక్షల కోట్లు అవినీతికి పాల్పడ్డారు. ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి, ఫిబ్రవరి17న అసెంబ్లీలో చేసిన వ్యాఖ్య.రైతులు, సాగునీటి నిపుణులు వేస్తున్న ప్రశ్న ఏమిటంటే…కేసీఆర్ లక్షల (!) కోట్లు దోచుకుంటే అంతకుముందు లేని ఈ నిర్మాణాలన్నీ ఎలా అవతరించాయి? వాటిని రేవంత్ ప్రభుత్వం ఎట్లా వాడుతున్నది? ఒకవేళ కాళేశ్వరం తెల్ల ఏనుగైతే, దానిలో భాగమైన నిర్మాణాలను వాడకుండా ఈ వానకాలం, వచ్చే యాసంగిలో రేవంత్ సర్కారు రైతులకు నీళ్లు ఇవ్వగలదా?
మేడిగడ్డ కుంగింది.. కాళేశ్వరం కథ ఒడిసింది.. ప్రాజెక్టు పనికిరాదు.. లక్ష కోట్లు వృథా.. రీడిజైన్ మొదలు ప్రతిపక్షంలో ఉండగా, ఇప్పుడూ కాంగ్రెస్, కొందరు కుహనా మేధావులు చేస్తున్న వాదనలివి. ప్రాజెక్టు పనితీరుపై వీసమెత్తు అవగాహన లేకుండా చేస్తున్న అడ్డగోలు మాటలివి. మరి అదే నిజమైతే ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మ వరకు జలగర్జనలెక్కడివి? గోదావరి జలాలు పరుగున కొండపోచమ్మ సిగకెట్ల చేరినయ్? మేడిగడ్డ బరాజ్‌లో మొత్తం 85 గేట్లు. కుంగింది 2 పిల్లర్లు. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లో నీటి లీకేజీలున్నా వాటిని అధికారులు నిరోధించారు.
అయినా కాళేశ్వరం ప్రాజెక్టు పనిరాకుండా పోలేదు. ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మ వరకు పంపులు జలగర్జన చేస్తున్నాయి. సొరంగాలు ఈది, కాలువల్లోకి జారి, కొండలను ఎగబాకుతున్న గోదావరి జలాలను కాళేశ్వరం ప్రాజెక్టు ఎదురెక్కిస్తూనే ఉన్నది. మరి లక్ష కోట్ల అవినీతి ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? ఈ ప్రచారంలో వాస్తవమేమిటి? అనే అంశాలపై తెలంగాణ సమాజం ముందు ఖుల్లంఖుల్లంగా తెలిపేందుకు ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): నీళ్లు లేకనే తెలంగాణ బీడైంది. రైతు ఆత్మహత్యలకు నెలవైంది. బతుకు పొక్కిలైంది. ఆ నీళ్ల కోసమే దశాబ్దాల పాటు తండ్లాడి.. వాటిని ఒడిసిపట్టాలని ఆరాటపడింది. ఆ పోరాటంలోంచి పుట్టిందే కాళేశ్వరం. 2016లో రూ.81,911 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 2023 వరకు మొత్తంగా ఖర్చు చేసింది రూ.93,872 కోట్లు. అందులోనూ ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు కోసం 2016 వరకు ఖర్చుచేసిన నిధులు రూ.10,146.64 కోట్లు. ఈ నిధులను మినహాయిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నికరంగా ఖర్చుచేసింది రూ.83,725.36 కోట్లు. మరి ప్రాజెక్టు నిర్మాణంలో రూ.లక్ష కోట్ల అవినీతి ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? అంటే అది పచ్చి అబద్ధం అని తేలిపోతున్నది. ప్రాజెక్టుపై రాజకీయ దుష్ప్రచారం తప్ప మరేమీ లేదని తేటతెల్లమవుతున్నది. కాంగ్రెస్ నేతల మాటల్లో డొల్లతనాన్ని ఈ గణాంకాలే బయటపెడుతున్నాయి.
వినియోగంలోనే 80,377.36 కోట్ల నీటిపంపిణీ వ్యవస్థ
కాళేశ్వరం ప్రాజెక్టును 7 లింకులుగా విభజించారు. అందులో మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు నీటి తరలింపు వ్యవస్థనంతటినీ లింక్1గా నిర్ణయించారు. ఇందులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లతోపాటు వాటికి సంబంధించిన 3 పంప్‌హౌజ్‌లు ఉన్నాయి. లింక్1 పంప్హౌజ్లన్నీ ఎప్పుడంటే అప్పుడు వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల్లో సాధారణంగా అన్ని బరాజ్‌ల్లో కనిపించే సీపేజీ సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా ఇప్పటికే గ్రౌటింగ్ చేసి నీటి నిల్వకు సిద్ధం చేశారు.
ఇక సమస్యల్లా ఒక్క మేడిగడ్డ బరాజ్లోనే. అది కూడా 7వ బ్లాక్‌లోని 20, 21వ పిల్లర్లు మాత్రమే. అక్కడ కూడా అండర్మైనింగ్ జరిగి పిల్లర్ కింది ఇసుక కొట్టుకుపోవటం వల్ల కుంగింది. అక్కడ ఆ సమస్య మినహా బరాజ్‌లో మిగతా 6 బ్లాక్‌లలో ఎలాంటి సమస్య లేదు. గేట్లన్నీ సమర్థంగానే పనిచేస్తున్నాయి. ఇటీవల భారీ వరద వచ్చినా మేడిగడ్డ బరాజ్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. ప్రస్తుతం మేడిగడ్డ మినహా కాళేశ్వరం ప్రాజెక్టులోని ఏ లింకులోనూ సమస్యలేవు. అన్నీ విజయవంతంగా పనిచేస్తున్నాయి. అందుకు ప్రస్తుతం ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మసాగర్ వరకు నీటిఎత్తిపోతలే సజీవసాక్ష్యం. ఈ లెక్కన మేడిగడ్డ బరాజ్‌కు వెచ్చించిన రూ.3,348 కోట్లు మినహా రూ.80,377.36 కోట్లు వినియోగంలోనే ఉన్నాయి.
ఏనాడూ ఎల్లంపల్లి పూర్తిగా నింపలె
ఎల్లంపల్లి ప్రాజెక్టును తామే నిర్మించామని కాంగ్రెస్ సర్కారు చెప్తున్న గొప్పలన్నీ ఒట్టిమాటలే. ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసినా దానిని వినియోగంలోకి తీసుకురాలేదన్నది అంతే వాస్తవం. ఎల్లంపల్లి ప్రాజెక్టును జలయజ్ఞంలో భాగంగా 2004లో రూ.3,177 కోట్లతో చేపట్టారు. తెలంగాణ వచ్చేనాటికి ప్రాజెక్టుపై రూ.3,347.27 కోట్లు ఖర్చుపెట్టారు. అయితే మొత్తంగా 20.16 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో చేపట్టిన ఈ రిజర్వాయర్‌లో తెలంగాణ ఏర్పడేనాటికి ఏనాడూ 5 టీఎంసీలకు మించి జలాలను నిల్వ చేయలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కారణం భూసేకరణ పూర్తి చేయకపోవటం, ముంపు బాధితులకు పునరావాసం కల్పించకపోవడమే.
ప్రాజెక్టు కోసం మొత్తంగా 27,387ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా, 18,778 ఎకరాలను మాత్రమే సేకరించింది. ఇక పునరావాసం కల్పన కోసం 13,296 ఇండ్లను నిర్మించాల్సి ఉండగా, 1,448 ఇండ్లను మాత్రమే పూర్తిచేసింది. అదీగాక ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటినిల్వ వల్ల లక్షెట్టిపేట బ్రిడ్జి మునిగిపోయి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. అక్కడ హైలెవల్ బ్రిడ్జి నిర్మించాల్సి ఉన్నా అది పూర్తి చేయలేదు. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మరో రూ.2,052.73 కోట్లను వాటి కోసం వెచ్చించింది. బరాజ్‌ను 2016లో పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చింది.
కమీషన్ల కోసం కట్టిందెవరు?
కమీషన్ల కోసమే ప్రాజెక్టును కట్టారని కాంగ్రెస్ నేతల ఆరోపణల్లో నిజమెంత? అని పరిశీలిస్తే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా 12.20 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు 2007లో రూ.17,875 కోట్లతో ప్రతిపాదించారు. మరో 4.20లక్షల ఎకరాల ఆయకట్టును ప్రాజెక్టులో చేర్చి మొత్తంగా 16.40 లక్షల ఎకరాలకు సాగునీటిని అందివ్వాలని నిర్ణయించి మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.38,500 కోట్లకు పెంచారు. ప్రాజెక్టు పెరిగిన ఆయకట్టు 34 శాతం కాగా, ప్రాజెక్టు వ్యయాన్ని ఏకంగా 115 శాతానికి పెంచారు. ఆ తర్వాత 2010లో డీపీఆర్ సమర్పించేనాటికి ప్రాజెక్టు వ్యయాన్ని రూ.45,000 కోట్లకు.. అంటే దాదాపు 15 శాతం పెంచారు. ఆ లెక్కన వేసుకున్నా అదే ప్రాజెక్టును యథాతథంగా ఇప్పటి రేట్ల ప్రకారం చేపట్టినా దాదాపు రూ.లక్షల కోట్లకు చేరుతుంది.
ఇదిలాఉంటే ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తంగా 85 వేల ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, 2012 నాటికి 2,685 ఎకరాలు మాత్రమే సేకరించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అంతేగాకుండా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుల్లోని అన్ని ప్యాకేజీల పనులకు సర్వే పర్సెంటేజీను తొలుత 0.43 నుంచి 0.50 శాతంగా నిర్ణయించారు. తరువాత 2 నుంచి 3.50 శాతానికి పెంచారు. మొత్తంగా సర్వేకు 172.12 కోట్లు మాత్రమే. కానీ ఒప్పందాలు చేసుకునే నాటికే ఆ ఖర్చును ఏకంగా రూ.1,211.23 కోట్లకు పెంచారు. ఎక్కడైనా లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో ముందుగా హెడ్‌వర్క్స్ పూర్తిచేస్తారు.
అంటే నీటి ఎత్తిపోతలకు సంబంధించిన పంప్‌హౌజ్‌లు, బరాజ్‌లు, రిజర్వాయర్లు తదితర పనులు అన్నమాట. ఆ తర్వాత నీటి పంపిణీ వ్యవస్థ కాల్వలు, ఉప కాల్వలు, పిల్ల కాల్వలను క్రమానుగతంగా చేపడతారు. కానీ నాటి కాంగ్రెస్ సర్కారు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో అతి కీలకమైన హెడ్‌వర్క్స్‌ను వదిలి కేవలం కాల్వలను మాత్రమే తవ్వి వదిలిపెట్టింది. మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల కింద రూ.వేల కోట్లు దండుకుని హెడ్‌వర్క్స్‌ను గాలికి వదిలిపెట్టింది. తెలంగాణ ఏర్పడేనాటికే దాదాపు పీసీసీ ప్రాజెక్టుపై మొత్తంగా రూ.11 వేల కోట్లకుపైగా పనులు చేశారంటే కమీషన్ల కోసం కేవలం కాల్వల పనులు చేసిందెవరనేది తేలిపోతున్నది.
మిడ్మానేరునూ పూర్తిచేయలె
వరద రావడం తగ్గిపోతున్నా ఎస్సారెస్పీపై 1990లో వరదకాల్వకు శ్రీకారం చుట్టారు. మొత్తంగా 22 టీఎంసీలతో 2,20,000 ఎకరాలకు సాగునీరివ్వాలని ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో మొదటగా ఎస్సారెస్పీ వద్ద ముప్కాల్ నుంచి హెడ్‌రెగ్యులేటర్ ద్వారా వరదను 43.30 కిలోమీటర్ల గ్రావిటీ ద్వారా కోనరావుపేట పెద్దవాగుకు తరగలించాలి. పెద్దవాగుపై కోరుట్ల వద్ద రిజర్వాయర్ నిర్మించాలి. అక్కడి నుంచి 66.45 కిలోమీటర్ల దూరంలో మనువాడ సమీపంలోని మిడ్‌మానేరుకు తరలించాలి.
అక్కడ రిజర్వాయర్ నిర్మించాలి. ఆ తర్వాత మిడ్‌మానేరు నుంచి ఎత్తిపోతల ద్వారా 63.34 కిలోమీటర్ల దూరంలో గౌరవెల్లి గ్రామసమీపాన సర్వీస్ రిజర్వాయర్‌కు తరలించాలి. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా 125 కిలోమీటర్ల దూరంలో ఆలేరుకు తరలించాలి. నాటి పాలకులు వరదకాల్వ తవ్వారు. అన్నీ మరిచారు. ఎగువ నుంచి వరద వస్తే తప్ప ప్రాజెక్టు మనుగడ లేదు. తెలంగాణ ఏర్పడేనాటికి మధ్యమానేరు, తోటపల్లి, గౌరవెల్లి రిజర్వాయర్లకు శంకుస్థాపన చేసినా పనులు పూర్తికాలేదు.
తెలంగాణ ఏర్పడేనాటికి 44 ఏండ్లలో 28.48 శాతం మేరకు నీటి నిల్వసామర్థ్యం తగ్గిపోయింది.
మరోవైపు మహారాష్ట్ర బాబ్లీ, ఇతర ప్రాజెక్టులు నిర్మించి గోదావరిని దిగ్బంధించటంతో వరద మార్గం మూసుకుపోయింది. దీంతో వరదకాల్వ ప్రాజెక్టే ప్రశ్నార్థకంగా మారిన దుస్థితి. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుతో వరద కాల్వను అనుసంధానించటంతో అదిప్పుడు జీవధారగా మారింది. ఎస్సారెస్పీకి నీటిని తరలించేందుకు కూడా ఇదే ప్రధానంగా నిలుస్తున్నది. ఎస్సారెస్పీ నుంచి మధ్యమానేరు వరకు వరదకాల్వ మొత్తం 122 కిలోమీటర్ల పొడవునా జీవనదిలా మారింది. వరద ఆధారంగా రూపొందించిన మిడ్‌మానేరుకు కూడా నేడు కాళేశ్వరం ప్రాజెక్టే జీవధారగా నిలిచింది.
రూ.కోట్ల విలువైన అదనపు పనులు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగానే నిర్మించిన రిజర్వాయర్లు, పంప్‌హౌజ్‌లు, కాల్వలే కాదు ఇంకా రూ.వేల కోట్లు వెచ్చించి నిర్మించిన అదనపు నిర్మాణాలు ఉన్నాయి. అవన్నీ వినియోగించుకునే అవకాశం ఉన్నది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టులను నింపే అవకాశం కలిగింది. అందుకోసం ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి నిర్మాణాలను చేపట్టింది. వరదకాల్వపై దాదాపు 34 తూములను (ఓటీ) నిర్మించింది.
వరదకాల్వ, కాకతీయ కెనాల్‌ను అనుసంధానం చేసింది. ఎల్ఎండీ నుంచి కాకుండా నేరుగా కాళేశ్వరం ఎత్తిపోతల జలాలను అందించే వెసులుబాటును ఏర్పాటు చేసింది. ఎస్సారెస్పీకి నీటిని ఎత్తిపోసే ఏర్పాట్లు చేసింది. అందుకు పంప్‌హౌజ్‌లను నిర్మించింది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగానే అనేక అదనపు నిర్మాణాలు, ఓటీలు, చెరువుల విస్తీర్ణం పెంచడం వంటి పనులను కూడా రూ.కోట్లు ఖర్చుపెట్టి పూర్తిచేసింది. నేడు అ వనరులన్నీ వినియోగంలోనే ఉన్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ సైతం ఆ వనరులను వినియోగిస్తామని బాహాటంగానే ప్రకటించింది. మరి అలాంటప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? అనేది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సమాజానికి చెప్పాలి.
Kcr
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం ఇలా..
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిపాదిత వ్యయం : రూ.81,911 కోట్లు
కాళేశ్వరం మొత్తం ఖర్చు : రూ. 93,872 కోట్లు
అందులో 2016 వరకు పీసీఎస్ఎస్ కోసం ఖర్చు : రూ. 10,146.64 కోట్లు
అంటే ప్రాజెక్టుపై నికరంగా చేసిన ఖర్చు : రూ. 83,725.36 కోట్లు
(మేడిగడ్డ బరాజ్ కోసం వెచ్చించిన రూ.3,348 కోట్లు మినహాయిస్తే ఇప్పటికీ 80,377.36 కోట్ల విలువైన ఆస్తులు వినియోగంలోనే ఉన్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు సైతం వాటిని వినియోగించుకుంటామని వెల్లడించింది)
1) లింక్ 1 (3 బరాజ్‌లు, లిఫ్ట్‌లు) రూ.17,941 కోట్లు
2) లింక్ 2 (ఎల్లంపల్లి-మిడ్‌మానేరు) రూ.16,325.01 కోట్ల్లు
3) లింక్ 3 (ఎంఎంఆర్- అప్పర్‌మానేరు) రూ.1,258.00 కోట్లు
4) లింక్ 4 (ఎంఎంఆర్-కొండపోచమ్మ) రూ.27,654.47 కోట్లు
5) లింక్ 5 (అనికట్-చిట్యాల వరకు) రూ.2,202.45 కోట్లు
6) లింక్ 6(మల్లన్నసాగర్-సింగూరు) రూ.1,216.42 కోట్లు
7) లింక్ 7 (ఎస్సారెస్పీ- భూంపల్లి) రూ.4,068.38 కోట్లు
లక్ష్మీ (మేడిగడ్డ) బరాజ్
నీటి నిల్వ సామర్థ్యం: 16.17 టీఎంసీలు85 రేడియల్ గేట్లు
నిర్మాణ వ్యయం: రూ.3,348 కోట్లు ఇది పదేండ్ల క్రితం లేదు.. దీనిని కేసీఆర్ కట్టించారు.
ప్రస్తుత పరిస్థితి: బరాజ్‌లో మొత్తంగా 85పిల్లర్లు. 7 బ్లాక్‌లు. 1.63కిమీ పొడవు. ఇందులో 7వ బ్లాక్‌లోని 20,21 పిల్లర్లు కుంగిపోయాయి. మిగాతా అన్ని గేట్లు, బ్లాక్‌లు సురక్షితంగానే ఉన్నాయి.
లక్ష్మీ పంప్‌హౌజ్ (మేడిగడ్డ)
నిర్మాణ వ్యయం: రూ.4,721 కోట్లు
ప్రస్తుత పరిస్థితి:40 మెగావాట్ల సామర్థ్యమున్న 11 మోటర్లతో అన్నివిధాలుగా సిద్ధంగా ఉంది. ఎప్పుడంటే అప్పుడు పంపింగ్ చేసుకోవచ్చు.
సరస్వతి (అన్నారం) పంప్‌హౌజ్
నిర్మాణ వ్యయం: రూ.3,004 కోట్లు
ప్రస్తుత పరిస్థితి:40 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 8 మోటర్ల్లు ఉన్నాయి. ఎప్పుడంటే అప్పుడు వినియోగించుకునేందుకు ఇది సిద్ధంగా ఉంది.
సరస్వతి (అన్నారం) బరాజ్
నీటి నిల్వ సామర్థ్యం: 10.87 టీఎంసీలు66 గేట్లు, బరాజ్ పొడవు 1.27 కి.మీ.
నిర్మాణ వ్యయం: రూ.2,327 కోట్లు
ఇది పదేండ్ల క్రితం లేదు.. దీనిని కేసీఆర్ సర్కారు నిర్మించింది.
ప్రస్తుత పరిస్థితి: బరాజ్‌లో రెండు చోట్ల సీపేజీలను గుర్తించారు. వాటిని కూడా గ్రౌటింగ్ చేశారు.
ప్రస్తుతం నీటిని నిల్వ చేసి మరోసారి పరీక్షించాల్సి ఉంది.
పార్వతి (సుందిళ్ల) బరాజ్
నీటి నిల్వ సామర్థ్యం: 8.83 టీఎంసీలు బరాజ్ పొడవు 1.45 కి.మీ, 74 రేడియల్ గేట్లు
నిర్మాణ వ్యయం: రూ.1,672 కోట్లు
ఇది పదేండ్ల క్రితం లేదు.. దీనిని కేసీఆర్ సర్కారు నిర్మించింది.
ప్రస్తుత పరిస్థితి: బరాజ్‌లో సీపేజీలు ఉండగా వాటిని కూడా గ్రౌటింగ్ చేశారు. ప్రస్తుతం నీటి నిల్వకు సిద్ధంగా ఉంది.
Parvathi Pump House
పార్వతి (సుందిళ్ల) పంప్‌హౌజ్
నిర్మాణ వ్యయం: రూ.2,869 కోట్లు
ప్రస్తుత పరిస్థితి:40 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 9 మోటర్లు ఉన్నాయి. ఎప్పుడంటే అప్పుడు పంపులను ప్రారంభించి ఎల్లంపల్లి బరాజ్‌లోకి నీటిని ఎత్తిపోసుకోవచ్చు.
ఎల్లంపల్లి బరాజ్
నీటి నిల్వ సామర్థ్యం: 20.18 టీఎంసీలు
నిర్మాణ వ్యయం: రూ.5,400 కోట్లు
ప్రస్తుతం నీటి నిల్వ: 20.18 టీఎంసీలు
ప్రస్తుత పరిస్థితి: దీనిని 2004లో కాంగ్రెస్ ప్రారంభించినా 5టీఎంసీలకు మించి నిల్వ చేయలేదు. రాష్ట్ర ఏర్పాటు తరువాత కేసీఆర్ దీనిని పూర్తిచేశారు. 2016నుంచే ఎఫ్ఆర్ఎల్వరకు నీటి నిల్వను ప్రారంభించారు.
నంది పంప్‌హౌజ్ (ప్యాకేజీ 6)
ప్రాజెక్టులో తొలి భూగర్భ పంప్‌హౌజ్. ఇక్కడ 127.6 మెగావాట్ల సామర్థ్యమున్న 7 మోటర్లతో 128 మీటర్ల నుంచి 233 మీటర్ల ఎత్తులో ఉన్న నంది రిజర్వాయర్‌లో నీటిని ఎత్తిపోస్తారు.
నిర్మాణ వ్యయం: రూ.5,405 కోట్లు
ప్రస్తుత పరిస్థితి: సిద్ధంగా ఉంది. నిన్నమొన్నటివరకు కూడా నీటిని ఇక్కడి నుంచి పంపింగ్ చేశారు. మిడ్‌మానేరుకు ఈ సీజన్లో ఇప్పటికే దాదాపు 12టీఎంసీలకు పైగా జలాలను తరలించారు.
నంది రిజర్వాయర్ (ప్యాకేజీ 7)
నిర్మాణ వ్యయం: రూ.1,738 కోట్లు
ధర్మారం మండలం నందిమేడారంలో ఉన్నది. రామడుగు మండలం గాయత్రి (లక్ష్మీపూర్) పంప్‌హౌజ్‌కు నీటి తరలింపు కోసం ఇక్కడి పాత చెరువునే రిజర్వాయర్‌గా కేసీఆర్ హయాంలోనే విస్తరించారు. పూర్తిగా వినియోగంలోనే ఉన్నది.
ప్రస్తుతం నీటి నిల్వ: 0.50 టీఎంసీలు నంది పంప్‌హౌజ్ (ప్యాకేజీ 6)ప్రాజెక్టులో తొలి భూగర్భ పంప్‌హౌజ్. ఇక్కడ127.6 మెగావాట్ల సామర్థ్యమున్న 7 మోటర్లతో128 మీటర్ల నుంచి 233 మీటర్ల ఎత్తులో ఉన్న
నంది రిజర్వాయర్‌లో నీటిని ఎత్తిపోస్తారు.
నిర్మాణ వ్యయం: రూ.5,405 కోట్లు
ప్రస్తుత పరిస్థితి: సిద్ధంగా ఉంది. నిన్నమొన్నటివరకు కూడా నీటిని ఇక్కడి నుంచి పంపింగ్ చేశారు. మిడ్‌మానేరుకు ఈ సీజన్లో ఇప్పటికే దాదాపు 12టీఎంసీలకు పైగా జలాలను తరలించారు.
గాయత్రి పంప్‌హౌజ్ (ప్యాకేజీ 8)
ఇది కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లో భూగర్భంలో కేసీఆర్ హయాంలోనే నిర్మించారు.
నిర్మాణ వ్యయం: రూ.5,397 కోట్లు
ప్రస్తుత పరిస్థితి: ఇక్కడ 139 మెగావాట్ల సామర్థ్యమున్న పంపులు సిద్ధం ఉన్నాయి. శ్రీరాజరాజేశ్వర జలాశయానికి ఎప్పుడంటే అప్పుడు జలాలను తరలించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సీజన్లో ఇప్పటికే 12టీఎంసీలకు పైగా జలాలను ఇటీవల వర్షాలు కురిసే సమయం వరకు తరలించారు.
మలక్‌పేట రిజర్వాయర్, పంప్‌హౌజ్‌లు (ప్యాకేజీ 9)
నీటి నిల్వ సామర్థ్యం: 3 టీఎంసీలు
నిర్మాణ వ్యయం: రూ.513 కోట్లు
ప్రస్తుతం నీటి నిల్వ: 1 టీఎంసీ
ప్రస్తుత పరిస్థితి: ఇదీ కేసీఆర్ హయాంలోనే పూర్తయింది. మిడ్‌మానేరు నుంచి ఎప్పుడంటే అప్పుడు జలాలను రిజర్వాయర్‌కు తరలించవచ్చు. ఇటీవలనే వెట్న్ విజయవంతంగా పూర్తయింది.
అనంతసాగర్, తిప్పాపూర్ సర్జ్‌పూల్, పంప్‌హౌజ్ (ప్యాకేజీ 10)
నీటి నిల్వ సామర్థ్యం: 3.5 టీఎంసీలు
నిర్మాణ వ్యయం: రూ.3,135 కోట్లు
ప్రస్తుతం నీటి నిల్వ: 2.93 టీఎంసీలు
ప్రస్తుత పరిస్థితి: ఇదీ కేసీఆర్ హయాంలోనే నిర్మించారు. ప్రస్తుతం మిడ్‌మానేరు నుంచి
రిజర్వాయర్‌లోకి పంపింగ్ విజయవంతంగా కొనసాగుతున్నది.
అన్నపూర్ణ-రంగనాయకసాగర్ (చంద్లాపూర్ పంప్‌హౌజ్) (ప్యాకేజీ 11)
నీటి నిల్వ సామర్థ్యం: 3.5 టీఎంసీలు
నిర్మాణ వ్యయం: రూ.3,373 కోట్లు
ప్రస్తుత పరిస్థితి: ఇదీ కేసీఆర్ నిర్మించారు. చంద్లాపూర్ వద్ద నిర్మించిన పంపుహౌజ్‌లో 134 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 4 మోటర్ల్లు ఉన్నాయి. ప్రస్తుతం రంగనాయకసాగర్ రిజర్వాయర్‌లోకి ఇక్కడి నుంచి నుంచి జలాల ఎత్తిపోతలు అంతరాయం లేకుండా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తున్నది.
రంగనాయకసాగర్ (ప్యాకేజీ 12)నీటి నిల్వ సామర్థ్యం: 3 టీఎంసీలు
నిర్మాణ వ్యయం: రూ.497 కోట్లు
ప్రస్తుతం నీటి నిల్వ: 2.62టీఎంసీలు
ప్రస్తుత పరిస్థితి: ఇదీ పదేండ్ల క్రితం లేదు. కేసీఆర్ హయాంలోనే నిర్మించారు.
ఈ సీజన్లోనూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీటిని నిల్వ చేస్తున్నది.
రంగనాయకసాగర్ టు మల్లన్నసాగర్ (తుక్కాపూర్ పంప్‌హౌజ్)
నిర్మాణ వ్యయం: రూ.3,553.92 కోట్లు
ప్రస్తుత పరిస్థితి: 43 మెగావాట్ల సామర్థ్యంతో 8 మోటర్ల్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా జలాలను ఎత్తి శ్రీకొమురవెల్లి మల్లన్నసాగర్‌లోకి పంపింగ్ చేస్తున్నారు
కొండపోచమ్మ సాగర్
నీటి నిల్వ సామర్థ్యం: 15 టీఎంసీలు
నిర్మాణ వ్యయం: రూ.1,718 కోట్లు
ప్రస్తుతం నీటి నిల్వ: 10.09 టీఎంసీలు
ప్రస్తుత పరిస్థితి: ఇదీ కేసీఆర్ నిర్మించారు. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం ఇప్పటివరకు 8టీఎంసీల జలాలను నింపగా, ఈ ఏడాది 11టీఎంసీల వరకు నింపాలని నిర్ణయించారు. ఈ సీజన్లో ఇప్పటికే నీటినిల్వను ప్రారంభించారు. ప్రస్తుతం 10.09టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
మల్లన్నసాగర్ టు కొండపోచమ్మసాగర్ మర్కూక్ పంప్‌హౌజ్, కెనాల్ నెట్వర్క్
నిర్మాణ వ్యయం: రూ.2,646.77 కోట్లు
ప్రస్తుత పరిస్థితి: ఇదీ కేసీఆర్ సర్కారు నిర్మించింది. ప్రస్తుతం వినియోగంలోనే ఉన్నది. ఈ సీజన్లో ఇప్పటికే 6టీఎంసీలను తరలించారు.
మల్లన్నసాగర్-ముల్కపల్లి-బస్వాపూర్ కెనాల్ నెట్వర్క్, సొరంగాలు
నిర్మాణ వ్యయం: రూ.1,339 కోట్లు
ఇదీ కేసీఆర్ హయాంలోనే నిర్మించారు.
ప్రస్తుత పరిస్థితి: నీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఓటీ 2 ద్వారా యాదాద్రి టెంపుల్ సమీపంలోని గండి చెరువును గతేడాది పూర్తిగా నింపారు.
బస్వాపూర్ రిజర్వాయర్
నీటి నిల్వ సామర్థ్యం: 11.39 టీఎంసీలు
నిర్మాణ వ్యయం: రూ.1,565 కోట్లు ఇదీ కేసీఆర్ హయాంలోనే నిర్మించారు.
ప్రస్తుత పరిస్థితి: ఇప్పటికే జలాల తరలింపు వెట్ రన్ పూర్తయింది. సర్వం సిద్ధంగా ఉంది. నిర్వాసితులకు దాదాపు రూ. 400కోట్ల పరిహారం చెల్లిస్తే నీటి నిల్వను ఎప్పుడంటే అప్పుడు ప్రారంభించవచ్చు.
ప్రస్తుతం నీటి నిల్వ: 0.31 టీఎంసీలు మల్లన్నసాగర్ టు దౌల్తాబాద్ కెనాల్ నెట్వర్క్
నిర్మాణ వ్యయం: రూ.520.50 కోట్లు
ప్రస్తుత పరిస్థితి: కాలువల ద్వారా నీటి తరలింపు కొనసాగుతున్నది.
మల్లన్నసాగర్నీటినిల్వ సామర్థ్యం: 50 టీఎంసీలు
నిర్మాణ వ్యయం: రూ.7,372.92 కోట్లు ఇదీ పదేండ్ల క్రితం లేదు. కేసీఆర్ హయాంలోనే నిర్మించారు.
ప్రస్తుత పరిస్థితి: ఈ సీజన్లోనూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నీటిని పంపింగ్ చేస్తున్నది. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం ఇప్పటివరకు 15టీఎంసీలు నింపగా, ఈ ఏడాది 20టీఎంసీల వరకు నింపాలని నిర్ణయించారు.
ప్రస్తుతం నీటి నిల్వ: 17.85 టీఎంసీలు
(మ్యాకం రవికుమార్)