హైదరాబాద్, సెప్టెంబర్12 (నమస్తే తెలంగాణ): ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి, ఆ శాఖ అధికారులు త్వరలోనే భేటీ కావాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు ఇప్పటికే ఆ రాష్ట్ర అధికారులను సంప్రదించినట్టు సమాచారం. సమక్కసాగర్ బరాజ్‌ను 83 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో నిర్మించిన విషయం తెలిసిందే. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నుంచి బరాజ్‌కు అన్ని అనుమతులు మంజూరయ్యాయి.
అంతర్రాష్ట్ర విభాగం నుంచి రావాల్సిన అనుమతులు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. పొరుగున ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ)ని ఇస్తేనే అంతర్రాష్ట్ర విభాగం అనుమతులు వచ్చే అవకాశం ఉన్నది. ఎన్వోసీ కోసం దీర్ఘకాలంగా తెలంగాణ అధికారులు ప్రయత్నిస్తున్నారు.