Congress Govt | హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): ముఖ్యంగా వ్యవసాయ రంగానికి గుండెకాయ లాంటి నీటిపారుదల శాఖ, కాంగ్రెస్ సర్కార్ పట్టింపులేని తనంతో నిర్వీర్యమవుతున్నది. నీటి వనరుల గుర్తింపు, ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు వాటిని సంరక్షిస్తూ ఒడిసిపట్టిన నీటిని పొలాలకు మళ్లించి పంటల పెరుగుదలకు తోడ్పడాల్సిన ‘ఇరిగేషన్ శాఖ’ ఇప్పుడు ఖాళీల భారంతో కొట్టుమిట్టాడుతున్నది. బీడు భూములను సస్యశ్యామలం చేయడం, తగిన వర్షపాతం లేక ఎండిపోతున్న పంటలను పరిరక్షించడం, వ్యవసాయ క్షేత్రాల్లో సరైన నీటి నిర్వహణతో అధిక దిగుబడులు వచ్చేలా పాటుపడాల్సిన ఆ శాఖ కాస్తా సిబ్బంది లేక అస్తవ్యస్తంగా మారింది. తెలంగాణలో ప్రధానమైన వ్యవసాయ రంగానికి అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటే.. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సాగును గాలికి వదిలేసిన కాంగ్రెస్ సర్కార్, అందులో భాగంగానే నీటిపారుదల శాఖను బలహీనం చేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ శాఖలో వందల సంఖ్యలో పోస్టులు ఖాళీ ఉన్నా భర్తీపై దృష్టి పెట్టకపోవడమే ఇందుకు నిదర్శనంగా నిలిచింది.
ఏడాది పాలనలోనే కాంగ్రెస్ సర్కారు అడ్డగోలు నిర్ణయాలతో ఇరిగేషన్‌శాఖ అస్తవ్యస్తమైంది. ఓవైపు సీనియర్ ఇంజినీర్లు విరమణ పొందారు. గతంలో ఉన్న కన్సల్టెంట్లను తొలగించారు. మరోవైపు పూర్తిస్థాయి అధికారులను నియమించకుండా ప్రభుత్వం ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్నది. సీనియర్లను కాదని జూనియర్లకు, అనుయాయులకు బాధ్యతలు అప్పగిస్తుండటంతో సాగునీటి పారుదల శాఖ పరిపాలన పూర్తిగా గాడితప్పింది. ఇక కొత్త ప్రాజెక్టుల సంగతేమోగాని, బీఆర్ఎస్ హయాంలో మొదలై తుదిదశకు చేరిన పనులు సైతం ఇప్పుడు పర్యవేక్షణ లేక పడకేశాయి. మరోవైపు పొరుగు రాష్ర్టాలు గోదావరి, కృష్ణా జలాలను చెరబట్టేందుకు అడుగులు వేస్తుంటే ఆ దిశగా కన్నెత్తి చూసేవారే లేకుండా పోయారంటే సాగునీటి పారుదలశాఖ దుస్థితి ఎలా తయారైందో తెలుసుకోవచ్చు.
నీటిపారుదల శాకలో ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ), చీఫ్ ఇంజినీర్ (సీఈ), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్, టెక్నికల్, నాన్ టెక్నికల్, సూపరింటెండెంట్, రికార్డ్ అసిస్టెంట్ తదితర విభాగాలకు సంబంధించి మొత్తం 5334 పోస్టులు మంజూరు ఉండగా ప్రస్తుతం 4389 మంది మాత్రమే ఉన్నారు. ఏడాదిలో మరో 231కి పైగా ఖాళీలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రెండు ఈఎన్సీ (జనరల్, ఓఅండ్ఎం) పోస్టులు ఖాళీ ఉన్నాయి. 22 సీఈ పోస్టుల్లో 11మంది ఉద్యోగ విరమణ పొందారు. 59 మందికి పైగా ఎస్ఈలు, అనేక సర్కిళ్లలో ఈఈ పోస్టులు ఖాళీ అయ్యాయి. మరోవైపు శాఖలో కొత్తగా రెండు నెలల క్రితమే 687 మంది ఏఈలు నియామకమయ్యారు. కింది నుంచి పైస్థాయి వరకు ప్రమోషన్లు కల్పించేందుకు పెద్దగా ఇబ్బందులు కూడా లేవు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని 3 నెలల క్రితం ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు ఉన్నతాధికారులు సినీయార్టీ జాబితాను సిద్ధం చేసి నివేదించారు. కానీ రెండు నెలలుగా ప్రభుత్వం మాత్రం ఎటూ తేల్చడం లేదు. గతంలోనే కమిటీలు వేసి నివేదించినా తాజాగా మళ్లీ మరోసారి కమిటీ వేసింది. దీనిపై ఇంజినీర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది కాలయాపనకే తప్ప మరేమీ కాదని ఇంజినీర్లు నిప్పులు చెరుగుతున్నారు.
నాగర్‌కర్నూల్ సర్కిల్-1 ఎస్ఈ (సూపరింటెండెంట్ ఇంజినీర్)గా విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఈ విజయభాస్కర్‌రెడ్డికే నాగర్‌కర్నూల్ సీఈగా తొలుత అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఆ పోస్టుతో అనుబంధంగా తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ ఎండీగానూ ఆయననే నియమించింది. వనపర్తి సీఈ విరమణ పొందగా ఆ బాధ్యతను కూడా విజయభాస్కర్‌రెడ్డికే కట్టబెట్టింది. కాళేశ్వరం కమిషన్‌లో టెక్నికల్ సీఈగానూ విజయభాస్కర్రెడ్డినే నియమించింది. ఇటీవల ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) ఈఎన్సీగానూ సదరు విజయభాస్కర్‌రెడ్డికే అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇలా ప్రభుత్వం ఒక్కరికే 5 చోట్ల అదనపు బాధ్యతలు అప్పగించడం వెనుక మర్మమేమిటో మరి!
ప్రమోషన్లు కల్పించకుండా ఖాళీ అయిన చోట్ల ఎక్కడికక్కడ ఇన్చార్జిలుగా నచ్చిన ఇంజినీర్లను ఇష్టారీతిన ప్రభుత్వం నియమిస్తుండడంతో సాగు నీటిపారుదల శాఖ పాలన మొత్తం గాడితప్పుతున్నదని సీనియర్ ఇంజినీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదనపు బాధ్యతల వల్ల కీలకస్థానాల్లో ఉన్న ఇంజినీర్లు సమావేశాలకు, ప్రధాన కార్యాలయాలకే పరిమితవ్వాల్సిన దుస్థితి నెలకొన్నదని, దీంతో క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించేవారే లేకుండా పోయారని చెప్తున్నారు. ఏ ఒక్కదానిపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేని పరిస్థితి నెలకొన్నది. ప్రస్తుతం కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేస్తుండగా, ఎక్కడ ఏ మేరకు, ఎప్పుడు, ఎవరు విడుదల చేస్తున్నారో తెలియని దుస్థితి ఉన్నది. ఇక ఇంజినీర్ల మధ్య ఆహ్లాదకర వాతావరణం లేకుండా పోవడంతో పాటు గ్రూపులుగా విడిపోయిన దుస్థితి నెలకొన్నది. సర్కారు అనాలోచిత, అడ్డదిడ్డమైన చర్యలతో సీనియర్ వర్సెస్ జూనియర్ అన్నచందంగా తయారైంది. ఉన్నతస్థానాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారికి దిగువనున్న సీనియర్ ఇంజినీర్లు సహకరించని పరిస్థితి నెలకొనగా, పరోక్షంగా సహాయ నిరాకరణ పాటిస్తున్నారని పలువురు బాహాటంగానే వాపోతున్నారు. మరోవైపు అదనపు బాధ్యతలతో తీవ్ర పనిభారంతో సతమతమవుతున్నారని అధికారులు వాపోతున్నారు. వర్షాలు తగ్గిన క్రమంలో, పనులు చేసేందుకు ఇదే అనువైన సమయమని, అయితే అదనపు బాధ్యతలతో ఏ పనిపైనా దృష్టిసారించలేపోతున్నామని వివరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి, కమిటీల పేరిట కాలయాపన చేయకుండా సత్వరమే ప్రమోషన్లు కల్పించి, పూర్తిస్థాయి అధికారులను నియమించి నీటిపారుదలశాఖను గాడిన పడేయాలని డిమాండ్ చేస్తున్నారు.