హైదరాబాద్, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ) : మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులను అందుబాటులోకి తీసుకురావాలన్న తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రయత్నాలు సఫలీకృతమవుతున్నాయి. 2026-27 విద్యాసంవత్సరంలో బోర్డు తీసుకొచ్చిన ‘అకౌంటెన్సీ కోర్సు’ హాట్కేక్ను తలపిస్తున్నది. అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్ సబ్జెక్టులతో కూడిన ఈ కోర్సుపై పలు కాలేజీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే 250కి పైగా కాలేజీలు ఈ కోర్సును ప్రవేశపెట్టేందుకు ఇంటర్‌బోర్డు అనుమతి కోరాయి. మరికొన్ని కాలేజీలు ఇదేబాటలో సాగుతున్నాయి. ఇంకా దరఖాస్తుకు గడువు ఉండటంతో మరిన్ని కాలేజీలు ఆసక్తిచూపుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇంటర్లో ఇప్పటివరకు సివిక్స్, కామర్స్, ఎకనామిక్స్(సీఈసీ), మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్(ఎంఈసీ) గ్రూప్‌లు అందుబాటులో ఉండగా.. గణితం, సివిక్స్ స్థానంలో కొత్తగా అకౌంటెన్సీ సబ్జెక్టును చేర్చారు.
అకౌంటెన్సీ కోర్సుపై ఆసక్తి చూపిన కాలేజీల్లో తెలంగాణ మాడల్ స్కూల్స్ అధికంగా ఉన్నాయి. మాడల్ స్కూళ్లలో ఇంటర్ గ్రూప్‌లు సైతం నిర్వహిస్తుండగా, 194 మాడల్ స్కూళ్లు అకౌంటెన్సీ కోర్సును ప్రవేశపెట్టేందుకు ఇంటర్‌బోర్డు అనుమతి కోరాయి. ఆయా కాలేజీలకు అనుమతి సైతం ఇచ్చింది. దీంతో మాడల్ స్కూళ్లలోనే 7,760 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.
కొంతకాలంగా ఇంటర్ వొకేషనల్ కోర్సుల్లో అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్ కోర్సు నిర్వహిస్తున్నారు. దీనికి అంతగా డిమాండ్ లేకపోవడంతో ఇంటర్‌బోర్డు ఏసీఈ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. భవిష్యత్తులో ప్రొఫెషనల్ కోర్సులు, ఫైనాన్స్ రంగంలో కెరీర్‌ను ఎంచుకునే వారికి ఈ గ్రూప్ పునాది కానున్నది.