Inter Board | హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): మిక్స్డ్ ఆక్యుపెన్సీ జంజాటం.. ఇంటర్‌బోర్డు గుర్తింపునివ్వకపోవడం వంటి సమస్యలతో 340కి పైగా కాలేజీల్లోని విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం కానుంది. గుర్తింపు లేని కాలేజీల్లో చదివితే పరీక్షలు రాసే అవకాశాన్ని కోల్పోనుండటంతో వారి పరిస్థితి అగమ్యగోచరం కానుంది. ఆయా కాలేజీలు ఇప్పటివరకు ఇంటర్‌బోర్డు గుర్తింపును దక్కించుకోలేదు. కానీ కాలేజీల్లో అడ్మిషన్లు నిర్వహించి, విద్యార్థులను చేర్చుకుని, క్లాసులు కూడా నిర్వహిస్తున్నాయి.
వాస్తవికంగా ఇంటర్‌బోర్డు గుర్తింపు జారీ అయిన తర్వాతే ఆన్లైన్ లాగిన్ ఐడీ ఇస్తారు. విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో నమోదుచేస్తేనే వార్షిక పరీక్షల ఫీజు చెల్లించే వీలుంటుంది. ఫీజు చెల్లిస్తేనే పరీక్షలకు హాజరుకావొచ్చు. కానీ ఈ విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడిచినా కాలేజీ అఫిలియేషన్‌లో పురోగతి లేకపోడం ఆందోళనకరంగా మారింది. సంబంధిత కాలేజీ అగ్నిమాపకశాఖ నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ)ను ఇంటర్‌బోర్డుకు సమర్పిస్తేనే అధికారులు అనుబంధ గుర్తింపు జారీచేస్తారు.
ఎన్వోసీ పొందలేక, పలు కాలేజీలు ఈ ఏడాది ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపును పొందలేకపోయాయి. కాగా గత కేసీఆర్ సర్కారు జీవో- 29 అమలును నిలుపుదల చేసి (అబయన్స్‌లో ఉంచి) అనుబంధ గుర్తింపునకు అవకాశానిచ్చింది. 2021 నుంచి 24 వరకు మినహాయింపునిచ్చింది. అయితే 2023 -24 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మినహాయింపునివ్వమని అప్పట్లోనే ఆయా జీవోలో పేర్కొన్నారు. అయినా కాలేజీల యాజమాన్యాలు దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. సెప్టెంబర్ సమీపిస్తున్నా ఇంతవరకు అఫిలియేషన్‌ను దక్కించుకోలేదు. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేదు. ఇదే అంశంపై ఇంటర్‌బోర్డు డైరెక్టర్ శృతి ఓజాను వివరణ కోరేందుకు ఫోన్లో సంప్రదించగా ఆమె స్పందించలేదు.
బషీర్‌బాగ్ లా కాలేజీ.. ఓయూకు అనుబంధంగా నడుస్తున్న ప్రముఖ కాలేజీ. ఇంతటి ప్రముఖమైన కాలేజీ ఈ విద్యాసంవత్సరంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపును దక్కించుకోలేదు. ఈ కాలేజీతో పాటు ఖమ్మంలోని మానేరు కాలేజీ సైతం గుర్తింపు పొందలేదు. దీంతో ఈ రెండు కాలేజీలను మొదటి విడత లాసెట్ వెబ్ఆప్షన్ల జాబితాలో అధికారులు పొందుపరచలేదు. చివరి నిమిషంలో కొన్ని కాలేజీలు గుర్తింపును దక్కించుకోవడంతో లాసెట్ వెబ్ఆప్షన్ల గడువును 30 వరకు పొడగించినట్టు లాసెట్ అడ్మిషన్స్ కన్వీనర్ ప్రొఫెసర్ రమేశ్‌బాబు తెలిపారు. 1న సీట్లును కేటాయిస్తామని, 2 నుంచి 6 వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు.