కంది, ఏప్రిల్ 2 : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని ముగ్గురు చిన్నారులను కడతేర్చింది కన్నతల్లి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడలో గతనెల 27న చోటుచేసుకోగా పోలీసులు బుధవారం ఈ కేసు గుట్టువిప్పారు. బీరంగూడ రాఘవేంద్ర కాలనీలో నివాసముంటున్న రజిత ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా, ఆమె భర్త చెన్నయ్య డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. మొదటి నుంచి రజితకు చెన్నయ్య అంటే ఇష్టం ఉండేది కాదు. ఆరునెలల క్రితం టెన్త్ బ్యాచ్‌మేట్స్ గెట్ టు గెదర్ పార్టీలో రజితకు శివకుమార్‌తో స్నేహం ఏర్పడింది. రోజూ చాటింగ్‌లు, వీడియోకాల్స్ ద్వారా మాట్లాడుకునే వారు. పెండ్లి కాని శివకుమార్‌ను ఎలాగైనా పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నది. పిల్లలు లేకుండా ఒంటరిగా వస్తే పెండ్లి చేసుకుంటానని శివ హామీ ఇచ్చాడు. దీంతో పిల్లలను అడ్డు తొలిగించుకోవాలనుకున్నది రజిత. మార్చి 27న రాత్రి భర్త లేని సమయంలో పెద్ద కొడుకు సాయికృష్ణ , కూతురు మధుప్రియ, చిన్న కొడుకు గౌతమ్‌లను టవల్‌తో ఊపిరాడకుండా చేసి చంపినట్టు విచారణలో తేలింది. రజిత, శివకుమార్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.