హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వశాఖల్లో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించనున్నట్టు రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం వినియోగిస్తున్న చమురు ఇంధన వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడతామని అన్నారు. సీఎం కేసీఆర్ సొంతంగా ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారని, తాను సైతం ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేసినట్టు మంత్రి ప్రకటించారు. టీఎస్ రెడ్కో ఆధ్వర్యంలో శనివారం నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ప్లాజాలో ‘గో ఎలక్ట్రిక్’ పేరుతో ఏర్పాటుచేసిన ఎలక్ట్రిక్ వాహనాల రోడ్‌షో, ఎగ్జిబిషన్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ రోడ్‌షో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈవీ వాహనాల కోసం రాష్ట్రమంతటా హైవేలపై ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పుతున్నట్టు వివరించారు. ఇప్పటికే 136 స్టేషన్లు ఏర్పాటు చేశామని, ఈ సంవత్సరం మరో 600 స్టేషన్లను నెలకొల్పబోతున్నామని పేర్కొన్నారు. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. ప్రజారవాణా వ్యవస్థల్లోనూ ఈవీలను వినియోగించాలని, తెలంగాణ ఈవీ ఉత్పత్తుల ఎగుమతికి తాము సహకరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొల్పిన బీవైడీ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీని మంత్రి జగదీశ్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఎలక్ట్రిక్ ఆటోలు, ద్విచక్రవాహనాలను మంత్రి నడిపి చూశారు. కార్యక్రమంలో ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ సునీల్‌శర్మ, రవాణాశాఖ కమిషనర్ ఎంఆర్ఎం రావు, టీఎస్ రెడ్కో చైర్మన్ సయ్యద్ అబ్దుల్ అలీం, వీసీ-ఎండీ జానయ్య, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సి డీజీ అభయ్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఈడీ అనూప్‌కుమార్, ఈఈఎస్ఎల్ జీఎం సావిత్రిసింగ్, రెడ్కో అధికారులు జీఎస్వీ ప్రసాద్, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.