తమిళనాడు ఐఏఎస్‌ల బృందం ప్రశంస
మల్లాపురం పంచాయతీ సందర్శన
యాదగిరిగుట్ట రూరల్, జూన్ 10 : తెలంగాణలోని గ్రామ పంచాయతీ వ్యవస్థలో ఉపయోగిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం (ఐఎఫ్ఎంఎస్) పోర్టల్ పనితీరు బాగున్నదని తమిళనాడుకు చెందిన ఐఏఎస్‌లు ప్రశంసించారు. ఆ రాష్ట్రంలో ఇలాంటి వ్యవస్థను ప్రవేశపెట్టేందు కోసం మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి తమిళనాడు ఆర్థిక శాఖ అదనపు సెక్రటరీ తిరుప్రశాంత్ ఎం వాడ్నేరే, ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ ప్రతిక్ తయల్, ట్రెజరీస్, అకౌంట్స్ విభాగం అదనపు డైరెక్టర్ నిరూప రాణి శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామ పంచాయతీని సందర్శించారు. ముందుగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొన్నారు.
అనంతరం మల్లాపురం గ్రామపంచాయతీకి వెళ్లారు. గతంలో పంచాయతీ వ్యవస్థలో నిధుల మంజూరుకు సంబంధించి ఎలాంటి వ్యవస్థ ఉండేది? ఈ పోర్టల్ తీసుకొచ్చిన తరువాత ఎలా ఉన్నదనే అంశాలను వారు స్థానిక అధికారులను అడిగి తెలుసుకొన్నారు. గ్రామ పంచాయతీకి చెందిన అన్ని నిధులను ఈ పోర్టల్ ద్వారా ఎలా జనరేట్ చేస్తారు? దీనికి సంబంధించి పోర్టల్‌లోకి లాగిన్ కావడానికి ఓటీపీ వచ్చే విధానాన్ని స్థానిక అధికారులు వారికి వివరించారు. ఇందులో నుంచి సిబ్బందికి జీతాలతోపాటు పలు ఫైనాన్స్‌లకు చెందిన నిధులు మంజూరు చేసే వ్యవస్థ గురించి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 2018లో ఈ పోర్టల్ వ్యవస్థను తీసుకొచ్చినట్టు వారు పేర్కొన్నారు. ఈ వ్యవస్థ వచ్చిన తర్వాత పని సులభతరం కావడంతోపాటు పారదర్శకంగా నిధుల మంజూరు జరుగుతున్నదని వారు చెప్పారు. ఈ వ్యవస్థను తమ రాష్ట్రంలోనూ అమలు చేయాలని యోచిస్తున్నామని ఆ బృందం సభ్యులు తెలిపారు. ఇందుకోసం తాము క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నామన్నారు.