రవీంద్రభారతి, ఏప్రిల్ 19 : అస్తిత్వ రక్షణే తెలంగాణకు భవిష్యత్తు అని, తెలంగాణ బతకాలంటే.. తెలంగాణ భాష, యాస, సంస్కృతి కొనసాగాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఆదివారం రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ హాల్లో ‘తెలంగాణ అస్తిత్వ వేదిక’ ఆవిర్భావ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి వక్తలుగా అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వైస్ చాన్సలర్ ఘంటా చక్రపాణి, సీనియర్ పాత్రికేయులు అల్లం నారాయణ, దేవులపల్లి అమర్, శ్రీనివాస్‌రెడ్డి, టంకశాల అశోక్, ప్రముఖులు పాశం నరేశ్, చంద్రశేఖర్, పిట్టల రవీందర్, మాడభూషి శ్రీధర్, చెరుకు సుధాకర్, వనం జ్వాలానరసింహారావు, బుచ్చన్న తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బీఆర్ఏఓయూ వీసీ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. తెలంగాణ అస్తిత్వం అంటే కేవలం తాడిచెట్టు, బతుకమ్మ, జమ్మిచెట్టు మాత్రమే కాదని, తెలంగాణ విశిష్ట స్వభావాన్ని, సంస్కృతిని కాపాడుకోవడమని అన్నారు.
తెలంగాణ ఏర్పడి 12ఏండ్లు కావస్తున్నా.. ఇప్పటికీ ఇక్కడి అస్తిత్వాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయన్నారు. మైనింగ్ పేరుతో దోపిడీ, సుందరీకరణ పేరుతో చారిత్రక కట్టడాల కూల్చివేతలు జరుగుతున్నాయన్నారు. సీనియర్ పాత్రికేయుడు అల్లం నారాయణ మాట్లాడుతూ.. తెలంగాణలో ఐటీని అభివృద్ధిపరిచింది తానేనంటూ చంద్రబాబు ప్రచారం చేసుకోవడం సరికాదన్నారు. తెలంగాణ ఏర్పడి పుష్కరకాలం అవుతున్నా ఆంధ్రాపాలకులు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి ఇంకా కుట్రలు పన్నుతున్నారన్నారు. పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య.. తెలంగాణ ఏర్పాటు తీరును ఇండియా, పాకిస్థాన్ విభజనతో పోల్చడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. తెలంగాణ అస్తిత్వ వేదిక కో ఆర్డినేటర్ శ్రీధరరావు దేశ్‌పాండే మాట్లాడుతూ.. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణపై విషయం చిమ్మడం సరికాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ అస్తిత్వం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రముఖ పాత్రికేయుడు ఎస్ వెంకటనారాయణకు జీవితకాల సాఫల్య పురస్కారం అందజేసి ఘనంగా సత్కరించారు.