Kavitha | నిజామాబాద్ : తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఫ్యూచర్ రెండు కూడా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆరేనని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చి చెప్పారు. తానే తెలంగాణ ఫ్యూచర్ అని చెప్పుకుంటున్న సీఎం రేవంత్‌పై ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘నేను స్టేట్ ఫ్యూచర్ అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారు. రేవంత్ రెడ్డి రాసి పెట్టుకోండి.. తెలంగాణ హిస్టరీ కేసీఆర్. తెలంగాణ ఫ్యూచర్ కూడా కేసీఆరే’ మీరు ఏ రకంగానూ సరితూగరు’ అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా ఆదివారం నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. తమకు తెలంగాణ అంటే టాస్క్ అని, ఇతరులకు తెలంగాణ అంటే రాజకీయం అని తెలిపారు. కేసీఆర్ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని, నిద్రలో కూడా కేసీఆర్ కేసీఆర్ అంటున్నారని విమర్శించారు. రైతుబంధు ఇవ్వను కానీ రఫ్‌గా మాట్లాడుతా, రుణమాఫీ చెయ్యను కానీ బాగా రుబాబుగా మాట్లాడతా.. సాగునీరు ఇవ్వను కానీ సోది ముచ్చట్లు అన్నీ చెబుతా, ఉద్యోగాలు ఇవ్వను కానీ ఉట్టి మాటలు చెబుతా.. కల్యాణలక్ష్మీ కింద తులం బంగారం ఇవ్వను.. కానీ తుఫెల్ మాటలు చెబుతాను అని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని ఎద్దేవా చేశారు. గౌరవ మర్యాదలు అనేటివి కొనుక్కుంటే వచ్చేవి కావని.. మన నడవడిక, మాటతీరు, పని పేరు బట్టి ఉంటుందని చెప్పారు.
కేసీఆర్ మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారో అని ప్రజలు టీవీలను ఆన్ చేస్తారని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు టీవీని మ్యూట్ చేసే పరిస్థితి ఏర్పడిందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడితే ముందుగానే సెన్సార్ బోర్డు వద్దకు వెళ్లి ఏ సర్టిఫికెట్ తీసుకొని వినాల్సిన దౌర్భాగ్యం ఏర్పడిందని విమర్శించారు. ఈ పవిత్ర రంజాన్ మాసంలో అబద్ధాలు చెప్పి తిట్లు తిని పాపాన్ని మూట కట్టుకోవద్దని రేవంత్‌కు సూచించారు. రంజాన్ తోఫాలు ఎందుకు నిలిపివేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రంజాన్ సమయంలో మసీదుల సుందరీకరణ కోసం బీఆర్ఎస్ హయాంలో ఒక్కో మసీదుకు రూ.లక్ష ఇచ్చే వాళ్లమని, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మసీదుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. ముస్లింల వైపున ఏ పార్టీ నిలుస్తుందో దీన్ని బట్టి తేటతెల్లమైందని తెలిపారు. ముస్లింలకు ఇచ్చిన హామీలు అన్నింటిని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, తక్షణమే హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఇఫ్తార్ విందులో జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేశ్ గుప్తా, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు, మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్, మాజీ మేయర్ నీతుకిరణ్, మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా, మాజీ రెడ్కో చైర్మన్ అలీం, బాన్సువాడ వైస్ చైర్మన్ జుబేర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శిర్పరాజు, సుజిత్ సింగ్ ఠాకూర్, మాజీ నూడ చైర్మన్ ప్రభాకర్, మాజీ టీఎఎస్పీఎస్ డైరెక్టర్ సుమిత్రానంద్, మైనార్టీ నేతలు నవీద్ ఇక్బాల్ , ఇమ్రాన్, మతీన్, జాగృతి నాయకులు అవంతి రావు, రెహాన్ తదితరులు పాల్గొన్నారు.