టీజీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని అనుమానాలు లేవనెత్తారు. లోపాలను ఎత్తిచూపారు. కోకొల్లలుగా ఆధారాలను సర్కారు ముందుంచారు. అయినా కాంగ్రెస్ సర్కార్ పెడచెవిన పెట్టడంతో ఆందోళనలకు దిగారు. పోరుబాట పట్టారు. వారిపై నిర్దాక్షిణ్యంగా సర్కారు దమనకాండకు దిగింది. నిరుద్యోగులైన అభ్యర్థుల రక్తం కండ్లజూసింది. కానీ అభ్యర్థుల డిమాండ్లను పట్టించుకోనేలేదు. న్యాయస్థానంలో తమ వాదనలు వినిపించారు. చివరికి న్యాయమే గెలిచింది. అంతిమంగా నిరుద్యోగులే గెలిచారు. సర్కారుపై ధర్మపోరాటంలో వారినే విజయం వరించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 మెయిన్స్ రీవాల్యుయేషన్ చేసి అభ్యర్థులకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో పరీక్షలను తిరిగి నిర్వహించాలని హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీచేసింది. దీంతో కీలకమైన గ్రూప్-1 పోస్టుల భర్తీ విషయంలో అభ్యర్థులు లేవనెత్తిన అనుమానాలే నేడు నిజమయ్యాయి. వారు ఎత్తిచూపిన లో పాలు, వినిపించిన వాదనలను న్యాయస్థానం పరిగిణనలోకి తీసుకుని ఉత్తర్వులను జారీచేసింది. గ్రూప్-1 పోస్టుల భర్తీపై తొలుత అభ్యర్థులు అనేక అభ్యంతరాలు వ్యక్తంచేశారు. తుది ఫలితాల్లో తెలుగు మీడియం అభ్యర్థులు 9శాతమే ఉండగా, ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులు ఏకంగా 91% మంది ఉన్నారు. దీంతో తెలుగు మీడియం అభ్యర్థులకు తక్కువ మార్కులేశారని, ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులకు ఎక్కువ మార్కులేశారని ఆనాటి నుంచి గగ్గో లు పెడుతూ వచ్చారు. టాప్ 100, టాప్ 500 ర్యాంకుల్లోనూ తెలుగు మీడియం అభ్యర్థులు తక్కువగానే ఉన్నారు. మూల్యాంకనం అంతా గందరగోళంగా సాగింది. వర్సిటీ ప్రొఫెసర్లతో కాకుండా కొందరు జేఎల్‌ల చేత మూ ల్యాంకనం చేయించారని అభ్యర్థులు ఆరోపించారు. మెయిన్స్ మూల్యాంకనంలో కంటెం ట్, విశ్లేషణ కంటే చక్కటి చేతిరాతకు ఎక్కువ మార్కులేశారని తేలింది. దశాబ్దకాలంగా గ్రూప్-1 పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు, తెలంగాణ ఉద్యమంపై అవగాహన ఉన్న వారితో పోల్చితే 2023లో బీటెక్ పూర్తిచేసిన వారికి ఎక్కు వ మార్కులు రావడంపైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఉమ్మడి ఏపీలో 6 వేల జవాబు పత్రాలను మూల్యాంకనం చేసేందుకు 3 నెలలు పడితే, 20 వేల జవాబు పత్రాలను 3 నెలల్లోనే మూల్యాంకనం చేయ డం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. నాణ్యతా లోపానికి ఇవే నిదర్శనాలంటూ వాదించారు. ఈ వాదనలను సర్కా రు, టీజీపీఎస్సీ నాడు తోసిపుచ్చాయి. కానీ ఇప్పుడు కోర్టు తీర్పుతో అవే నిజమయ్యాయి.
గ్రూప్ -1లో అనేక తప్పులు, తప్పిదాలు వెలుగుచూశాయి. జీవో-29ని రద్దుచేయాలం టూ అభ్యర్థులు భారీ ఉద్యమానికి పూనుకున్నారు. ప్రిలిమ్స్ ఫైనల్”కీ’పై సుప్రీం తలుపుతట్టారు. ఫైనల్ ‘కీ’లో తప్పులున్నాయని, అభ్యంతరాలను టీజీపీఎస్సీ పట్టించుకోవడం లేదని, న్యాయం చేయాలని కోరుతూ నిరుద్యోగులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశా రు. మెయిన్స్ వాయిదా వేయాలని సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు. ఆ తర్వాత మళ్లీ జీవో-29, వికలాంగ కోటా రోస్టర్‌పై సుప్రీంకోర్టుకు వెళ్లారు. గ్రూప్-1పై హైకోర్టులో 15 కేసులు వేసి, పోరాటంచేశారు.
గ్రూప్-1లో అవకతవకలపై గళమెత్తిన వారిపై, తప్పులు ఎత్తిచూపిన వారిపై, ప్రశ్నించిన వారిపై ప్రభుత్వం దమనకాండకు దిగింది. అధికార మత్తులో దారుణంగా అణచివేసింది. నిరుద్యోగుల నెత్తురు కండ్లచూసింది. జీవో-29ని రద్దుచేయాలని, గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలకు మధ్య వ్యవధి ని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు గతంలో టీజీపీఎస్సీని ముట్టడించారు. ప్రిలిమ్స్ ఫలితాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను అమలు చేయాలని, మార్కుల వివరాలను వెల్లడించాలని, ప్రామాణిక పుస్తకాలపై స్పష్టత ఇవ్వాలని నిరుద్యోగులు పోరుబాట పట్టారు. అయితే నిరుద్యోగుల పోరాటాన్ని సర్కారు దారుణంగా అణచివేసింది.
ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిరుద్యోగులు అనేకమార్లు అశోక్‌నగర్‌లో ఆందోళనలు నిర్వహించారు. అలాంటి వారిపై ప్రభుత్వం అక్ర మ కేసులు ప్రయోగించింది. పోటీ పరీక్షల శిక్షకుడు అశోక్‌పై బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెట్టారు. కోర్టు నోటీసులు జారీచేశారు. రూ.కోటి పరువునష్టం దావా వేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు. బీఆర్ఎస్ నేత రాకేశ్రెడ్డిపైనా పరువునష్టం దావా వేశారు.
హైకోర్టు తీర్పుతో నిరుద్యోగులు మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. జాబ్ క్యాలెండర్ అమలు, 2 లక్షల ఉద్యోగాలు, జీవో-29 రద్దు కోసం ఉద్యమమే చేపట్టాలని నిర్ణయించారు. కాంగ్రెస్ మోసాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. జీవో-29ని రద్దుచేసి, మళ్లీ ప్రిలిమ్స్ నిర్వహించాలని, తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకోవాలని కోరుతున్నారు. భవిష్యత్తులో తెలుగు మీడియం పేపర్లను తెలంగాణ ప్రొఫెసర్లతోనే మూల్యాంకనం చేయించాలని కోరుతూ పోరుబాట పట్టనున్నారు. తెలంగాణ అంశాలపై అవగాహన ఉన్నవారే న్యాయం చేయగలరని అభ్యర్థులు చెప్తున్నారు.
గ్రూప్ -1 మెయిన్స్ జవాబుపత్రాల రీ వాల్యుయేషన్‌ను అభ్యర్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రీ వాల్యుయేషన్ వద్దని, తిరిగి మెయిన్స్ నిర్వహించాలని అభ్యర్థులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. రీ వాల్యుయేషన్‌పై తమకు నమ్మకం లేదని, న్యాయం జరగదని, మళ్లీ అన్యాయమే జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. అవకతవకలు జరిగాయని కోర్టు చెప్పిన నేపథ్యంలో ప్రతిభావంతులకు న్యా యం జరగదని అంటున్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరుద్యోగ అభ్యర్థులు అశోక్‌నగర్‌లో సమావేశమయ్యారు. రీ ఎగ్జామ్‌ను నిర్వహించాల్సిందేనని వారంతా డిమాండ్ చేశారు. రీ వాల్యుయేషన్ ఫలితం ఉండదని, రీ ఎగ్జామ్ నిర్వహించడమే ఉత్తమమని పోటీ పరీక్షల శిక్షకుడు ప్రసన్న హరికృష్ణ అభిప్రాయపడ్డారు.