హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ ) : నిజం నిప్పులాంటిది. నిజాన్ని నిలువెత్తులో పాతర వేయాలనుకోవడం అవివేకం. నిజాన్ని దాచిపెట్టి కోర్టుల ద్వారా ఉత్తర్వులు పొందాలనే ప్రయత్నం చేసిన పిటిషనర్‌కు అక్షరాలా కోటి రూపాయలు జరిమానా విధిస్తున్నాం.. అని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక సంచలన తీర్పును వెలువరించారు. కోట్ల రూపాయల విలువైన భూమిని కాజేయాలనే తలంపుతో హైదరాబాద్‌కు చెందిన వెంకట్రామిరెడ్డి కోర్టుకు నిజం చెప్పకుండా చేసిన తప్పునకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. జరిమానా మొత్తాన్ని ఏప్రిల్ 10వ తేదీలోగా హెకోర్టు న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని పిటిషనర్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. ఒకవేళ జరిమానా మొత్తాన్ని చెల్లించకపోతే పిటిషనర్ వెంకట్రామిరెడ్డిని తమ ముందుంచాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. హైదరాబాద్ జిల్లా బండ్లగూడ మండలం కందికల్ గ్రామం సర్వే నం. 310/1, 310/2లో తనకున్న 9.11 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేసేందుకు అధికారులు నిరాకరిస్తున్నారంటూ వెంకట్రామిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ నగేశ్ భీమపాక మంగళవారం విచారణ చేపట్టారు.
ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ సర్వే నం. 23, 310/1, 310/2లో భూ వివాదం ప్రభుత్వానికి ఇతర ప్రైవేట్ వ్యక్తులకు మధ్య ఉన్నదని తెలిపారు. ఈ భూమి తనదేనంటూ పిటిషనర్ తండ్రికి విక్రయించారని చెబుతున్న ఆర్ వెంకటేశం సివిల్ కోర్టులో కేసు వేస్తే ప్రభుత్వానికి అనుకూలంగా 1998లో తీర్పు వచ్చిందని చెప్పారు. వెంకటేశం తండ్రి మరణించడంతో ఆయన కొడుకు ఆ కేసును కొనసాగిస్తున్నారని తెలిపారు. పిటిషనర్ వెంకట్రామిరెడ్డి ప్రతివాదుల పేరు మార్చడం ద్వారా వేర్వేరు ధర్మాసనాల వద్ద వ్యాజ్యాలు దాఖలు చేస్తూ అనుకూల ఉత్తర్వులు పొందేందుకు చట్ట వ్యతిరేక చర్యలకు తెరతీశారని చెప్పారు. న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. పట్టాదార్ పాస్ పుస్తకం కోసం 2022 డిసెంబరులో పిటిషన్ వేసి తర్వాత ఏడాది మార్చిలో ఉపసంహరించుకున్నారని చెప్పారు. రెవెన్యూ రికార్డుల్లో సవరణకు 2023 ఫిబ్రవరిలో పిటిషన్ దాఖలు చేసి ఆ తర్వాత ఏడాది ఉపసంహరించుకున్నారని తెలిపారు. ఈ విధంగా ఫోరం షాపింగ్ (వ్యూహాత్మకంగా కోర్టుల్లో అనుకూలమైన ఉత్తర్వులు పొందే ప్రయత్నం) కుట్రలను అడ్డుకోవాలని కోరారు. గత ఏడాది వాస్తవాలను తొకిపెట్టి స్టేటస్ కో ఉత్తర్వులు, కింది కోర్టులో శాశ్వత ఇంజంక్షన్ ఆర్డర్ పొంది తిరిగి పోలీసుల రక్షణ కోసం పిటిషన్లు వేశారని తెలిపారు.
ఈ వివాదం వెంకటేశం-ప్రభుత్వం మధ్యనే ఉందని, పిటిషనర్‌కు సంబంధం లేదని చెప్పారు. వాదనల తర్వాత పిటిషనర్ తీరుపై న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేసినపుడు వివాదానికి సంబంధించిన సమగ్ర వివరాలు ఎందుకు సమర్పించలేదని మండిపడ్డారు. తనకు అనుకూలంగా ఉత్తర్వులను పొందడానికి వాస్తవాలను తొకిపెట్టారని తేల్చారు. ఇందుకోసం ప్రతివాదులతోపాటు హైకోర్టునూ తప్పుదోవ పట్టించారని అన్నారు. ఇలాంటి పనికిమాలిన కేసు వల్ల కోర్టులపై అనవసర పనిభారం పడుతున్నదని చెప్పారు. కోర్టులపైన, జడ్జీలపై పని ఒత్తిడి పెరుగుతున్నదని తెలిపారు. న్యాయం కోసం కోర్టులకు వచ్చే వాళ్లకు న్యాయం జాప్యం అవుతుందని అన్నారు. నిజాలు దాచిపెట్టి న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలను చూస్తూ ఉండబోమని హెచ్చరించారు. న్యాయపరిపాలన కలుషితం కాకుం డా చూస్తామన్నారు. నిజం దాచి కేసులు వేసిన పిటిషనర్‌కు కోటి రూపాయల జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మొత్తాన్ని హెకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఏప్రిల్ 10 లోగా చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించారు.