హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వానికి, రాజ్యాంగ ధర్మాసనాలైన కోర్టులకు హైడ్రా అతీతమా? ప్రభుత్వానికి సమాంతరంగా హైడ్రా పాలన సాగిస్తున్నదా? కోర్టుల కంటే తామే అధికమని హైడ్రా అనుకుంటున్నదా? అని రాష్ట్ర హైకోర్టు నిప్పులు చెరిగింది. కోర్టు ఉత్తర్వులను తుంగలోకి తొకి, న్యాయ వివాదంలో ఉన్న భూముల్లోకి రాత్రికి రాత్రి వెళ్లి బోర్డులు ఏర్పాటు చేయడంపై హైడ్రాను నిలదీసింది. మేడ్చల్-మలాజిగిరి జిల్లాలోని సూరారం గ్రామంలో తమ ఆస్తిని హైడ్రా స్వాధీనం చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ జితేంద్ర అనే వ్యక్తి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కోర్టు వివాదాల్లో ఉన్న స్థలాల్లో.. ఇది ప్రభుత్వ స్థలమంటూ కంచె వేయడం, ఆపై హైడ్రా బోర్డులు ఏర్పాటుచేస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను కూడా పట్టించుకోకపోవడంపై స్పందిస్తూ.. హైడ్రా ఏమైనా కోర్టులకు అతీతంగా పనిచేస్తున్నదా? అని మండిపడింది. ‘కోర్టు స్టేటస్ కో (యథాతథస్థితి) ఉత్తర్వులు జారీచేసిన భూమిలోకి వెళ్లడమంటే కచ్చితంగా న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించడమే’ అని స్పష్టంచేసింది. అకడ ఏర్పాటుచేసిన బోర్డును తక్షణమే తొలగించాలని హైడ్రాను ఆదేశించింది.
బోర్డులు తొలగించండి
దీనిపై స్పందించిన హైకోర్టు.. ఇదే హైకోర్టు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను హైడ్రా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టు వివాదంలో ఉన్న భూములను స్వాధీనం చేసుకొనే అధికారం హైడ్రాకు ఎవరిచ్చారు? అని ప్రశ్నించింది. స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలంటూ రెవెన్యూ, మున్సిపల్ శాఖలు అనుమతులు ఇచ్చినట్టు రికార్డులు ఎకడ ఉన్నాయో చెప్పాలని హైడ్రాను నిలదీసింది. కోర్టు వివాదాల్లోని న్యాయ వివాదాస్పద స్థలాల రక్షణకు తీసుకొనే చొరవ, ప్రత్యేక శ్రద్ధ.. నీటివనరులు, రోడ్లు వంటి వాటిని కాపాడేందుకు ఎందుకు చూపడం లేదని నిలదీసింది. ఒకవేళ కోర్టు వివాదంలోని భూములను రక్షించాలనుకొంటే కోర్టు అనుమతి తీసుకోవాలనే విషయం తెలియదా? అని హైడ్రాను ప్రశ్నిస్తూ ఉకిరిబికిరి చేసింది.
కోర్టు అనుమతి లేకుండా యాజమాన్య హకులను ఎలా నిర్ధారిస్తారనే న్యాయపరమైన అంశాన్ని లేవనెత్తింది. ఆ స్థలంలో ఉన్నవారిని ఖాళీ చేయించి ఎలా స్వాధీనం చేసుకుంటారో చెప్పండి? అని నిలదీసింది. ‘సమాంతర ప్రభుత్వం నిర్వహిస్తూ కోర్టులకు అతీతమని భావిస్తున్నారా.. ఇలాగైతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి’ అని హెచ్చరించింది. న్యాయాధికార పరిధిని అతిక్రమించేలా హైడ్రా చర్యలున్నాయని పేరొన్నది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చర్యలను ఆమోదించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. కోర్టు ఉత్తర్వులున్నా కంచె ఏర్పాటు చేయడం, తమ స్థలాలేనని బోర్డులు ఏర్పాటు చేయడం కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనే అని పేరొన్నది. 48 గంటల్లో బోర్డును తొలగించాలని హైడ్రాను ఆదేశించింది. కంచెను కొనసాగించవచ్చని స్పష్టంచేసింది. తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వుల్లో పేరొన్నది. కౌంటర్లు దాఖలు చేయాలని హైడ్రాను ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 10కి వాయిదా వేసింది.
హైకోర్టు ఉత్తర్వులు బేఖాతరు
తొలుత పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఎలాంటి నోటీస్ జారీ చేయకుండానే హైడ్రా అధికారులు సర్వే నంబర్ 105లోని రెండు ప్లాట్లను స్వాధీనం చేసుకొని, కంచె వేశారని తెలిపారు. ఆ స్థలాల వద్ద పబ్లిక్ బోర్డులు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. హైకోర్టు గతంలోనే శాశ్వత ఇంజంక్షన్ ఉత్తర్వులు జారీచేసినా, హైడ్రా అధికారులు బేఖాతరు చేశారని తెలిపారు. హైడ్రా అధికారులు ఈనెల 6న కనీస సమాచారం ఇవ్వకుండా స్థలాల వద్దకు వచ్చి ఫెన్సింగ్, బోర్డులు ఏర్పాటుచేశారని వెల్లడించారు. కోర్టు ఉత్తర్వులు, చట్టపరమైన ప్రక్రియలను ఉల్లంఘించారని మండిపడ్డారు. దీనిపై హైడ్రా న్యాయవాది స్పందిస్తూ, ఈ లేఅవుట్ 1978లో ఏర్పాటైందని, మొత్తం 102 ప్లాట్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. రెండు స్థలాలు పారు, ప్రజావసరాలకు చెందినవని పేర్కొన్నారు. రెగ్యులరైజేషన్‌కు పిటిషనర్లు దరఖాస్తు చేసుకున్నా, ఆ భూమి పారు కోసం నిర్దేశించినందున దరఖాస్తును పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. రక్షణ చర్యగా ఫెన్సింగ్ చేసినట్టు వివరణ ఇచ్చారు.