హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జనాభాకు తగ్గట్టుగా చెట్ల పెంపకం, పారులు, పచ్చదనం అభివృద్ధి జరగడం లేదని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కర్ణాటకలో చెట్ల పరిరక్షణకు ప్రత్యేకంగా చట్టం ఉన్నదని పేర్కొంటూ.. అలాంటి చట్టం తెలంగాణలో ఉన్నదా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
లేకుంటే కర్ణాటక తరహాలో రాష్ట్రంలో కూడా చట్టాన్ని తీసుకురావాలని సూచించింది. రాష్ట్రంలో పారులకు కేటాయించిన స్థలాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్ కుమార్ ధర్మాసనం మంగళవారం విచారణ జరిపి ఈ సూచన చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.