హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు కోసం చేపడుతున్న భూసేకరణకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఆ భూసేకరణ కోసం జారీచేసిన డిక్లరేషన్ నోటీసు అమలును నిలిపివేసింది. ఈ మేరకు తాజాగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు అమల్లో ఉండగానే భూసేకరణకు డిక్లరేషన్, గెజిట్ నోటిఫికేషన్లు జారీచేశారంటూ ప్రద్యుమ్న ప్రవీణ్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కే శరత్ బుధవారం విచారణ చేపట్టారు.
గతంలో ఇదే అంశంపై జారీచేసిన డిక్లరేషన్, గెజిట్ నోటిఫికేషన్లను హైకోర్టు నిలిపివేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు. ఈ వ్య వహారంపై కౌంటర్ దాఖలుకు గడువు ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు. దీంతో ఇదే అంశంపై గతంలో జారీచేసిన స్టేటస్కో (యథాతథ స్థితి) ఉత్తర్వులను కొనసాగించాలని హైకోర్టు స్పష్టం చేసింది.