హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : తమ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో కొన్ని అమలు చేయలేకపోయామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అంగీకరించారు. నిధులు లేవని, అందుకే చేయలేకపోయామని స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభు త్వం వెయ్యి రోజుల పాలనపై బుధవారం మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మ ణ్, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్‌తో కలిసి సచివాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. వెయ్యి రోజుల్లో తమ ప్రభు త్వం ప్రజా సంక్షేమం కోసం కృషి చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల అమలుపై బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పొగడటం గమనార్హం. బీఆర్ఎస్ ప్రభుత్వం మంచి పథకాలను అమలు చేసిందని, తాము కూడా ఆ పథకాలను కొనసాగిస్తున్నామని తెలిపారు.
కల్యాణలక్ష్మి వంటి పథకాలను తాము కూడా ఎలాంటి భేషజాలు లేకుండా అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిపైనా తొలుత ప్రశంసలు కురిపించారు. భూములకు ధరణితో పూర్తి భద్రత లభించిందని అన్నారు. ఆ తర్వాత సర్దుకొని ధరణి కాదు.. భూభారతి అన్నారు. ఇక 22ఏ నిషేధిత భూముల వివాదంపైనా మంత్రి స్పందించారు. ఇప్పటికే వాటికి సంబంధించిన ఇబ్బందులను తొలగిస్తున్నట్లు తెలిపారు. 22ఏ భూములపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్‌ను మంత్రి స్వీకరించారు.
అసెంబ్లీలోనే తేల్చుకుందామని, ఆధారాలతో రావాలని, తాను కూడా సమాధానం చెప్తానని స్పష్టం చేశారు. ఇక మీడియా సమావేశం తర్వాత విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. అయితే ఇప్పటికే ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పార్లమెంట్‌కు వెళ్లి సోనియాగాంధీని కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తారా అంటూ విలేకరులు ప్రశ్నించగా.. అది వేరు.. ఇది వేరు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. భద్రాచలం రామయ్య దేవాలయానికి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1000 కోట్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని మంత్రి తెలిపారు. అయితే దీనిపై కాంగ్రెస్ సర్కార్ ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు ఇస్తామని ప్రకటించి ఏడాదిన్నర అవుతుందని, ఇప్పటికీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించగా.. ఇస్తామంటూ వెళ్లిపోయారు.