సిద్దిపేట, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం హవాయిగూడలోని అసైన్డ్ భూముల వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గాంధీభవన్ పీఆర్వో తనకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి, అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హవాయిగూడ 49 సర్వే నంబర్లో 83 ఎకరాల భూమి ఉన్నది. ఇందులో 31 ఎకరాలు ప్రభుత్వం దళితులకు పంపిణీ చేయగా 1954 నుంచి రికార్డుల్లో రైతుల పేరు మీదనే అసైన్డ్భూమిగా పేర్కొంటూ వస్తున్నారు. రైతులకు పాస్‌బుక్‌లను సైతం ప్రభుత్వం అందజేసింది. మిగిలిన 52 ఎకరాలు పట్టా భూమిగా ఉన్నది. అసైన్డ్ భూమిపై కన్నేసిన ఓ నేత రాత్రికి రాత్రే పట్టాభూమిగా మార్చినట్టు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ భూమిని సాగు చేసుకుంటున్న దళిత, గిరిజన కుటుంబాలను పకనపెట్టి కొత్త పేర్లపై రికార్డులు మారాయి. ఈ భూముల వ్యవహారంలో గాంధీభవన్ పీఆర్వోగా పేరొంటున్న ప్రముఖ కాంగ్రెస్ నాయకుడి ప్రమేయం ఉన్నదంటూ స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొన్నేండ్లుగా భూమిని సాగు చేస్తున్న కొంతమంది దళిత, గిరిజన కుటుంబాలకు ఎకరాకు రూ. 20 వేల చొప్పున చెల్లించి, భూమిని వదులుకుంటున్నట్టు లేఖలు రాయించుకొని పట్టాలు చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 52 ఎకరాల్లో సైతం గాంధీభవన్‌లో పనిచేస్తున్న వ్యక్తి తల్లి పేరుపై సుమారు 25 ఎకరాలు నమోదయ్యాయి. సర్వే నంబర్ 49కు సంబంధించిన అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు, రెవెన్యూ అధికారుల మధ్య ఉన్న సంబంధాల కారణంగానే భూముల రికార్డులు మార్చారనే అనుమానాలు స్థానికంగా బలంగా వినిపిస్తున్నాయి. నిబంధనలను పకన పెట్టి రికార్డుల్లో మార్పులు ఎలా జరిగాయి? ఎవరు అనుమతులు ఇచ్చారు? రాత్రికి రాత్రే భూముల స్వరూపం ఎలా మారింది? అనే ప్రశ్నలు స్థానికంగా తలెత్తుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లకు రెవెన్యూ యంత్రాంగం తలొగ్గిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాత రెవెన్యూ రికార్డులు, ధరణి, భూ భారతి రికార్డుల్లో నమోదైన వివరాలు, ప్రస్తుతం ఉన్న పహాణీలు, మ్యుటేషన్ వివరాలను పరిశీలిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నది. గతంలో ఏ విధంగా భూమి నమోదైంది, ప్రస్తుతం ఏ విధంగా మారిందో అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టాలని దళిత, గిరిజన కుటుంబాలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
హవాయిగూడలో రైతులకిచ్చిన అసైన్డ్ భూములు పట్టాగా మార్పు జరిగినట్టు వస్తున్న సమాచారం తప్పు. సర్వే నంబర్ 49లో 31ఎకరాలు అసైన్డ్ భూమిగా 1954 నుంచి రికార్డుల్లో వస్తున్నది. గతంలో ప్రభుత్వం దళితులకు పంపిణీ చేసినప్పటి నుంచి రైతుల పేరుతోనే పట్టా పాస్‌బుక్‌లను ప్రభుత్వం అందజేసింది. ప్రస్తుతం 31 ఎకరాల భూమి భూభారతిలో రైతుల పేరుతోనే రికార్డులో కన్పిస్తున్నది. తప్పుడు సమాచారంతో రైతులను ఇబ్బందులు పెట్టొద్దు.