హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న అంతర్గత పోరు ఢిల్లీ నడిబొడ్డున పరాకాష్టకు చేరింది. ఒకవైపు మంత్రి కొండా సురేఖను క్యాబినెట్ నుంచి తప్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేగంగా పావులు కదపగా, మరోవైపు, సురేఖ నేరుగా సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యంగా తిరుగుబాటు బాంబు పేల్చా రు. మంగళవారం రాత్రి 8:00 గంటలు: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి గంటకుపైగా ఏకాంతంగా సమావేశమయ్యారు. పరకాల నియోజకవర్గంలో సురేఖ కుమార్తె సుస్మితాపటేల్ చేసిన వ్యాఖ్యలు పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టను తీవ్రంగా దిగజార్చాయంటూ పీసీసీ క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన నివేదికను రేవంత్‌రెడ్డి ఏఐసీసీ ముందుంచారు. సురేఖతోపాటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై వేటు వేయాల్సిందేనని పట్టుబట్టారు. మంత్రివర్గంలో మహిళ, సామాజిక సమతుల్యత దెబ్బతినకుండా సురేఖ స్థానంలో మరో మహిళా నేతను క్యాబినెట్లోకి తీసుకొనేలా త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారని సమాచారం.
బుధవారం మధ్యాహ్నం 1:00 గంట: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు. సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో తన వాదనను బలంగా ఖర్గేకు వినిపించారు. కుమార్తె సుస్మిత మాట్లాడాల్సి వచ్చిన రాజకీయ పరిస్థితులను ఖర్గేకు వివరించడంతోపాటు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీకి లిఖితపూర్వకంగా పంపిన లేఖలు, మెయిల్స్ వివరాలను అధిష్ఠానం దృష్టికి తెచ్చారు. తాను అవినీతిరహితంగా పనిచేస్తుంటే, కొందరు కుట్రపూరితంగా తనను బలిపశువును చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తాను మంత్రిగా కొనసాగేందుకు అనుమతించాలని కోరారు.
మధ్యాహ్నం 3:30 గంటలు: ఖర్గేతో భేటీ ముగిసిన అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియా ముందుకొచ్చారు. తనపై క్రమశిక్షణాచర్యలు తీసుకొనే సాహసం చేసేముందు, స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డిపైనే చర్యలు తీసుకోవాలని ఆమె అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు. మహిళలు స్వతంత్రంగా ఎదుగాలని రాహుల్‌గాంధీ నిత్యం చెప్తుంటే, వివాహమై విడిగా ఉంటున్న తన కుమార్తె మాట్లాడిన దానికి తల్లిగా తనను ఎలా బాధ్యురాలిని చేస్తారని నిలదీశారు. పదేండ్లపాటు తానే సీఎంగా ఉంటానని రేవంత్‌రెడ్డి ప్రకటించుకోవడం క్రమశిక్షణ ఉల్లంఘన కాదా? అని ప్రశ్నించారు. పార్టీలో రెడ్లకు ఒక న్యాయం, బీసీ మహిళనైన తనకు మరో న్యాయమా? అని మండిపడ్డారు. తాను ఏఐసీసీ సభ్యురాలినని, తనపై నిర్ణయం తీసుకోవాల్సింది ఏఐసీసీయే తప్ప స్థానిక నేతలు కాదని, సీఎం రేవంత్‌రెడ్డి ఒత్తిడి తెచ్చినా తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
సాయంత్రం 5:30 గంటలు: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షీనటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ భేటీ అయ్యారు. రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ నివేదిక, గ్రౌండ్ రియాలిటీతోపాటు కొండా సురేఖ బహిరంగ విమర్శల పర్యవసానాలపై ఈ ముగ్గురు నేతలు లోతుగా చర్చించారు. సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తే బీసీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందా? లేక సురేఖ దూకుడును ఉపేక్షిస్తే సీఎం నాయకత్వానికి విఘాతం కలుగుతుందా? అన్న అంశంపై పార్టీ పెద్దలు తీవ్ర మల్లగుల్లాలు పడ్డారు.
రాత్రి 7:30 గంటలు: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార సమావేశమయ్యారు. ప్రభుత్వంలో మంత్రుల పనితీరు, పాలనా వ్యవహారాలతోపాటు మంత్రి సురేఖ బహిరంగ తిరుగుబాటుపై ఈ భేటీలో రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారని తెలిసింది. ప్రభుత్వ ప్రతిష్టను కాపాడేందుకు కఠిన నిర్ణయాలు అనివార్యమని చర్చించినట్టు తెలిసింది.
రాత్రి 9:30 గంటలు: రేవంత్‌రెడ్డితో భేటీ ముగిసిన వెంటనే మల్లికార్జున ఖర్గేతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార, సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వంలో ఎలాంటి సంక్షోభం తలెత్తకుండా మంత్రివర్గ విస్తరణ సమయంలోనే శాఖల మార్పు లేదా ప్రక్షాళన ద్వారా సమస్యను పరిషరించవచ్చా? అన్న కోణంలో ఖర్గే సీనియర్ మంత్రుల నుంచి లోతైన ఫీడ్ బ్యాక్ తీసుకొంటున్నారు. రాహుల్‌గాంధీతోనూ చర్చించిన తర్వాతే సురేఖ వ్యవహారంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉండటంతో, హస్తిన వీధుల్లో మొదలైన ఈ హైడ్రామా తెలంగాణ క్యాబినెట్ భవిష్యత్తును పూర్తి సస్పెన్స్‌లోకి నెట్టేసింది.