Sandeep Kumar | హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): భూసేకరణకు సంబంధించిన వ్యవహారంలో ఒక పిటిషనర్‌కు పరిహారం చెల్లించాలన్న హైకోర్టు ఉత్తర్వులను అమలుచేయని సిరిసిల్ల కలెక్టర్ సందీప్‌కుమార్‌పై హైకోర్టు నిప్పులు చెరిగింది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోగా పిటిషనర్‌పైనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని కింది అధికారులకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ అప్పీలు పిటిషన్ దాఖలు చేసి దానిపై ఎలాంటి ఉత్తర్వులు పొందకపోయినప్పటికీ, అంతకుముందు కోర్టు జారీచేసిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని నిలదీసింది. ఒకపక ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్.. బేషరతుగా తప్పు జరిగిందని ఒప్పుకుంటుంటే.. మరోవైపు కలెక్టర్ తన న్యాయవాదిని నియమించుకొని తప్పు ఏమీ కాలేదు అన్నట్టుగా వాదనలు వినిపించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తంచేసింది.
హైకోర్టు ఆర్డర్ చట్ట వ్యతిరేకం అంటూ బాధితురాలిపై క్రిమినల్ కేసు నమోదు చేయించిన జిల్లా కలెక్టర్ తీరును ఎండగట్టింది. తనకున్న అధికారాన్ని ఉపయోగించి బాధితురాలిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించడాన్ని తీవ్రంగా పరిగణించింది. న్యాయ వివాదాలు కోర్టులో ఉన్న సమయంలో ఒక ఐఏఎస్ అధికారి పిటిషనర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎలా ఆదేశాలు జారీచేస్తారని ప్రశ్నించింది. మీలాంటి వాళ్లను జైళ్లకు పంపాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. తొలుత ఉదయం జరిగిన విచారణకు కలెక్టర్ హాజరుకాకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కలెక్టర్ మధ్యాహ్నం హాజరయ్యారు.
మిడ్ మానేరు నిర్మాణ సమయంలో ఇల్లు కోల్పోయిన తనకు ఆర్అండ్ఆర్ చట్టం ప్రకారం పునరావాసం కల్పించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా అనుపురం గ్రామానికి చెందిన వనపట్ల కవిత అనే నిర్వాసితురాలు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ అనంతరం కవితకు పునరావాసం కల్పించాలని హైకోర్టు 2023లో తీర్పు చెప్పింది. కోర్టు తీర్పు మేరకు తనకు పునరావాసం కల్పించాలని కవిత జిల్లా కలెక్టర్‌ను కోరారు. కోర్టును తప్పుదోవ పట్టించి చట్ట వ్యతిరేకంగా ఆర్డర్ తీసుకొచ్చారన్న అభియోగంతో కవితపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కలెక్టర్ వేములవాడ ఆర్డీవోకు లిఖితపూర్వక ఆదేశాలు జారీచేశారు. కలెక్టర్ ఆదేశాలతో కవితపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును కొట్టేయాలని కవిత హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా, న్యాయమూర్తి అనిల్‌కుమార్ బుధవారం విచారణ చేపట్టారు.
కోర్టు తీర్పును ధికరించడమే కాకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడి కేసు నమోదు చేయడంపై కలెక్టర్ సందీప్‌కుమార్ మీద న్యాయమూర్తి మండిపడ్డారు. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరించాలని చెప్పినా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కలెక్టర్ హజరుకాకపోతే ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని వ్యక్తిగతంగా హాజరు కావాలని ఉత్తర్వులివ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మధ్యాహ్నం జరిగిన విచారణకు కలెక్టర్ స్వయంగా హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ స్పందిస్తూ కోర్టు ఉత్తర్వులు ఉండగా పిటిషనర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించడం పొరపాటేనని అంగీకరించారు. ఇదే సమయంలో కలెక్టర్ వ్యక్తిగతంగా సురేశ్రామ్ అనే న్యాయవాదిని నియమించుకొని వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు దానికి ఉన్నతాధికారులను విచారణకు పిలిపించడం సరికాదన్నారు.
కలెక్టర్ చర్య సమర్థనీయమేనని చెప్పారు. పిటిషనర్ కవితపై విచారణ జరిపామని, తప్పుడు సమాచారంతో కోర్టు ఉత్తర్వులు పొందారని, అందుకే కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించామని వివరించారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి మీరు కోర్టు రికార్డులు పరిశీలించకుండా కోర్టులో దాఖలైన పిటిషన్లు, కౌంటర్లు పరిశీలించకుండా కలెక్టర్ చెప్పిన విషయాలపై వాదనలు చేయడం సరికాదని హితవు చెప్పారు. ఒక పకన ప్రభుత్వం తప్పు జరిగిందని అంగీకరిస్తుంటే.. మరోవైపు మీరు కోర్టు తప్పు చేసింది అన్నట్టుగా ఎలా వాదిస్తారని ప్రశ్నించారు.
పిటిషనర్‌పై క్రిమినల్ కేస్ నమోదు చేయాలని ఎందుకు ఆదేశించారో వివరణ కోరడానికి కలెక్టర్‌ను పిలిస్తే దానిని కోర్టు ధికరణగా పరిగణించడంపై మండిపడ్డారు. ఇదే తీరును కొనసాగిస్తే జైలుకు పంపాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇలాంటి అధికారి రేపు చీఫ్ సెక్రటరీ అయితే పరిస్థితి ఏమవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఎన్నాళ్లు జైల్లో పెట్టాలి అని వ్యాఖ్యానించారు. ఆదేశాలు జారీచేసే సమయానికి కోర్టు సమయం ముగియడంతో న్యాయమూర్తి బెంచ్ దిగి వెళ్ళిపోయారు. ఆ సమయంలో కోర్టు అధికారులు కలెక్టర్‌ను కోర్టులోనే ఉండాలని చెప్పారు. దీంతో సుమారు రెండు గంటలపాటు కలెక్టర్ కోర్టు హాల్లో నిల్చొనే ఉన్నారు.