హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకో ర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ పర్వతరావు (90)కు తెలంగాణ హైకోర్టు ఘనంగా నివాళులర్పించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే అధ్యక్షతన సోమవారం హైకోర్టులోని న్యాయమూర్తులంతా ప్రత్యేకంగా సమావేశమై జస్టిస్ పర్వతరావు సేవలను కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి పీ వెంకట్రామిరెడ్డి, హైకో ర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ సీ కోదండరాం (జస్టిస్ పర్వతరావు అల్లుడు), అదనపు సొలిటర్ జనరల్ నర్సింహశర్మ, అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి, బార్‌కౌన్సిల్ చైర్మన్ ఏ నర్సింహారెడ్డి, హైకోర్టు బార్ అసోసియేషన్ చైర్మన్ ఏ రవీందర్‌రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీ నాగేశ్వర్రావు, రిటైర్డు న్యాయమూర్తుల సంఘం అధ్యక్షుడు జస్టిస్ జీ యతిరాజులు, న్యాయవాధికారులు, రిజిస్ట్రార్లు, సీనియర్ న్యాయవాదులు, జస్టిస్ పర్వతరావు కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
గండికొట్టి నీటిని తరలించే ప్రయత్నాలను వీడండి ; మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి
నాగర్‌కర్నూల్, డిసెంబర్ 30: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి డిండి ప్రాజెక్టుకు నీటిని తరలించే ప్రయత్నాలను మానుకోవాలని, ఇందుకోసం తీసుకొచ్చిన జీవో 159ను వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు స్వార్థరాజకీయాలను మానుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలోని ఏదుల రిజర్వాయర్ సమీపంలో గండి కొట్టి డిండి ప్రాజెక్టు ద్వారా నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు నీటిని తరలించేందుకు తెచ్చిన జీవోను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.