హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం కక్షపూరితంగా నమోదుచేసిన కేసులు సుప్రీంకోర్టులో వీగిపోవడంతో.. బీఆర్ఎస్ ఉద్యమకారుడు, సోషల్‌మీడియా వారియర్ నల్లబాలు అలియాస్ శశిధర్‌గౌడ్ కేసు దేశవ్యాప్తంగా ఒక రెఫరెన్స్‌గా నిలిచింది. తాజాగా ఈ కేసును ప్రస్తావిస్తూ కర్ణాటక హోంశాఖ తమ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేస్తూ ఇటీవల ఒక సర్క్యులర్ జారీచేసింది. సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టినందుకు, కొన్ని పోస్టులను రీట్వీట్ చేసినందుకు, మరికొన్ని షేర్ చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నల్లబాలును అరెస్టు చేసి కక్షసాధింపులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ లీగల్‌సెల్ హైకోర్టు మెట్లు ఎక్కడంతో న్యాయస్థానం ప్రభుత్వ తీరును ఖండిస్తూ.. పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మళ్లీ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో అక్కడ కూడా చుక్కెదురైంది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు ధర్మాసనం ఎండగట్టింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ.. అది జారీచేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని కేసును కొట్టివేసిన సంగతి తెలిసిందే. కాగా, బీఆర్ఎస్ లీగల్ సెల్ సాధించిన ఈ విజయం.. ఇప్పుడు దేశానికి ఒక రెఫరెన్స్‌గా మారింది. ఒక సామాన్య కార్యకర్త కోసం ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడం.. సిద్ధార్థ లూథ్రా వంటి సీనియర్ లాయర్‌ను నియమించుకొని భంగపడటంతో ఈ కేసు.. ఎంతోమంది సోషల్‌మీడియా వారియర్లకు, నిజాలను నిర్భయంగా చెప్పే వారికి ధైర్యాన్ని ఇచ్చింది.
సోషల్ మీడియా పోస్ట్‌లకు సంబంధించి కేసులు నమోదు చేసే విషయంలో కర్ణాటక పోలీస్ విభాగం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై ఫేస్బుక్, ఎక్స్ (ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్ వంటి వేదికలపై పెట్టే పోస్ట్‌ల మీద ఫిర్యాదు రాగానే ప్రాథమిక విచారణ లేకుండా యాంత్రికంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయకూడదని రాష్ట్ర డీజీపీ డాక్టర్ ఎంఏ సలీం స్పష్టమైన మార్గదర్శకాలను జారీచేశారు. గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను సుప్రీంకోర్టు సమర్థించిన నేపథ్యంలో, ఆ నిబంధనలను కర్ణాటకలోనూ అమలు చేయాలని ఆ సర్యులర్‌లో పేర్కొన్నారు. కఠినమైన, విమర్శనాత్మక రాజకీయ పోస్ట్‌ల ఆధారంగా కేసులు నమోదు చేయకూడదని తెలిపారు. అలా చేసేముందు రాజ్యాంగంలోని అధికరణ 19(1)(ఏ) ప్రకారం వాక్ స్వాతంత్య్రాన్ని గౌరవించాలని పేర్కొన్నారు.
1) స్థానిక స్థితి, ధ్రువీకరణ అవసరం: పరువు నష్టం కేసుల్లో ఫిర్యాదుదారుడు బాధిత వ్యక్తా? లేదా? అనేది పోలీసులు తనిఖీ చేయాలి. అన్ని అంశాలను ధ్రువీకరించుకోవాలి. అలాగే, సంబంధం లేని మూడో వ్యక్తి ఇచ్చే ఫిర్యాదులను స్వీకరించకూడదు.
2) ప్రాథమిక విచారణ: ఏదైనా ఫిర్యాదులో తీవ్రమైన నేరం (కాగ్నిజబుల్ అఫెన్స్) జరిగినట్లు కనిపిస్తే, ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందే ప్రాథమిక విచారణ జరిపి, ఆ నేరానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. ఇందుకు పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టాలి.
3) మీడియా పోస్ట్‌లపై: హింస, ద్వేషాన్ని పెంచడం, ఉద్దేశపూర్వక అవమానం, దేశద్రోహం వంటి ఆరోపణలు ఉన్నప్పుడు.. హింసను ప్రేరేపించడం లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం వంటి స్పష్టమైన ఆధారాలు ఉంటే తప్ప కేసు నమోదు చేయకూడదు. ఈ విషయంలో కేదార్‌నాథ్‌సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, శ్రేయ సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల సూత్రాలు పాటించాలి.
4) రాజకీయ విమర్శలు చేస్తే: ప్రభుత్వాలపై లేదా రాజకీయ నాయకులపై చేసే విమర్శలు, ఘాటైన వ్యాఖ్యల విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించకూడదు. రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 19 (1) (ఏ) కింద వాక్ స్వాతంత్య్రాన్ని గౌరవించాలి, కేవలం రాజకీయ ప్రేరేపిత విమర్శలకే కేసులు పెట్టకూడదు. హింసను ప్రేరేపించేలా ఉంటే తప్ప క్రిమినల్ చట్టాలను ఉపయోగించకూడదు.
5) పరువు నష్టం కేసుల్లో: పరువునష్టం అనేది ‘నాన్-కాగ్నిజబుల్’ నేరం. పోలీసులు అటువంటి విషయంలో నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేరు. సంబంధిత మేజిస్ట్రేట్‌ను సంప్రదించమని ఆదేశించాలి. దానికి బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 174(2)కింద నిర్దిష్ట ఆదేశాలు ఉన్నాయి.
6) అరెస్టులపై నియంత్రణ: సుప్రీంకోర్టు గతంలో అర్నేశ్‌కుమార్ కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం, చిన్నచిన్న కారణాలకే నిందితులను అరెస్ట్ చేయకూడదు. అరెస్టు విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ ఆదేశాలు పోలీసు అధికారులందరూ పాటించాలి. నేర ప్రక్రియ ఉంటేనే అమలు చేయాలి.
7) నిపుణుల సలహా తీసుకోవాలి : సున్నితమైన అంశాలు లేదా రాజకీయ ప్రసంగాలకు సంబంధించిన కేసుల్లో కేసు నమోదు చేసే ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి న్యాయ సలహా తీసుకోవడం ఇప్పుడు తప్పనిసరి.
8) తప్పుడు ఫిర్యాదుల తొలగింపు: కేవలం కక్ష సాధింపు కోసం లేదా వేధింపుల కోసం ఇచ్చే ఫిర్యాదులను పరిశీలించి, తగిన ఆధారాలు లేని పక్షంలో సెక్షన్ 176(1) కింద వెంటనే ఆ ఫిర్యాదులను మూసివేయాలి.