స్పెషల్ టాస్క్బ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : గోపన్‌పల్లి భూదందా గుట్టు వీడకుండా అధికారులు అండగా నిలుస్తున్నారు. సమాచార హక్కుచట్టం దరఖాస్తులనూ బేఖాతరు చేస్తూ కాపలా కాస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి పరిధిలో ఎకరా రూ.100 కోట్ల విలువైన సర్కారు భూమిని ఫలహారంగా పంచుకునేందుకు సర్కారు పెద్దలు అండ్ కో పెద్ద పన్నాగమే పన్నారు. తొలి విడతలో భాగంగా సుప్రీంకోర్టు ఉత్తర్వులను సాకుగా చూపి రూ.9 వేల కోట్ల విలువైన 91 ఎకరాలకు స్కెచ్ అమలు చేశారు. ఇందులో భాగ్యనగర్ టీఎన్జీవో హైకోర్టును ఆశ్రయించడంతో 17.04 ఎకరాలపై కలెక్టర్ జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. బసవతారకననగర్ బస్తీలో ఉన్న 8 ఎకరాలను ఓ ప్రైవేటు వ్యక్తికి ధారాదత్తం చేసినట్టు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. మిగతా 64.36 ఎకరాల పరిస్థితి ఏమిటి? ఇంత విస్తీర్ణానికి గాను ఎవరెవరి పేరిట ఎన్వోసీలు ఇచ్చారనేది మాత్రం బయటపెట్టడం లేదు. చివరకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినప్పటికీ తహసీల్దార్ మొదలు.. కలెక్టర్ వరకు 15 రోజులుగా అంతా గోప్యతను పాటిస్తున్నారు. ఏదో ఒక సాకుతో సమాధానాలే ఇవ్వడం లేదు.
గోపన్‌పల్లి గ్రామ పరిధిలో 36, 37 సర్వేనంబర్లలోని 189.11 ఎకరాల ప్రభుత్వ భూమి ఇప్పుడో హాట్‌కేక్. దానిని కట్ చేసి ముక్కలుగా పంచుకునేందుకు అంతా రంగం సిద్ధంకాగా, ‘నమస్తే తెలంగాణ’ కథనాలతో ప్రస్తుతానికి బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో ఆ భూములను పెద్దలకు పంచి పెట్టేందుకు రంగారెడ్డి జిల్లా అధికారులు అవలంబించిన విధానమేమిటి? జారీచేసిన ఉత్తర్వులేమిటి? అనే పూర్తి వివరాలు ఇంకా బయటి ప్రపంచానికి తెలియడం లేదు. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ ఈ నెల ఒకటో తేదీన సమాచార హక్కు చట్టం కింద రాజేంద్రనగర్ ఆర్డీవో కార్యాలయంతోపాటు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లోనూ దరఖాస్తు చేసింది. కానీ ఇప్పటివరకు ఒక్క కాగితం కూడా ఇవ్వలేదు. తాను వివరాల కోసం తహసీల్దార్ కార్యాలయానికి ఆదేశాలు పంపానని రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకట్‌రెడ్డి సమాధానం ఇస్తున్నారు. కలెక్టరేట్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌కు దరఖాస్తు చేయగా ఆయన గోపన్‌పల్లి భూముల ప్రొసీడింగులు జారీ అయిన ఇ-సెక్షన్లో వివరాలు ఇవ్వాలని లిఖితపూర్వకంగా పురమాయించారు. అక్కడికి వెళితే ఈ వివరాలన్నీ కలెక్టర్ వద్దే ఉన్నందున ఆయన అనుమతి ఇస్తే తప్ప తాము ఇవ్వలేమంటూ చేతులెత్తేస్తున్నారు.
ఎన్వోసీలు ఎవరి పేరిట ఇచ్చారన్న విషయాలను అధికారులు బయటికి రానీయడం లేదు. ఇప్పటివరకు కేవలం రెండు ఉత్తర్వులు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. అందులో కలెక్టర్ రిజిస్ట్రేషన్ శాఖకు రాసినవి ఉన్నాయి. సర్వేనంబర్ 36లో 17.04 ఎకరాల్లో ప్లాట్లు ఉన్నందున నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులపై భాగ్యనగర్ టీఎన్జీవో హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు వాటిని సస్పెండ్ చేసింది. సర్వేనంబర్ 37లో బసవతారకనగర్ బస్తీలో ఉన్న ఎనిమిది ఎకరాల భూమిని కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ నారాయణరెడ్డి రిజిస్ట్రేషన్ శాఖకు లేఖ రాశారు. అదీ కేవలం 1984లో జరిగిన ఒక సేల్‌డీడ్ ఆధారంగా ఆమంచర్ల మల్లికార్జునరావు పేరిట ఎన్వోసీ ఇచ్చారు. ఇవి మినహా మిగతా విస్తీర్ణానికి సంబంధించి మాత్రం ఎన్వోసీలను తొక్కిపెట్టారు.
రెండు సర్వేనంబర్లలోని 91 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి 1954-55 ఖాస్రా పహాణీలో కొందరి పేర్లు వచ్చాయనేది సుప్రీంకోర్టు ముందు ప్రైవేటు వ్యక్తులు ఉంచిన వాదన. అసలు రికార్డుల్లో వారి పేర్లు లేవని కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి జిల్లా అధికారులే తేల్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి పేర్లు ఉన్నాయనేది ఇప్పుడు అధికారులు ఇస్తున్న ఉత్తర్వుల్లోని సారాంశం. కాకపోతే ఖాస్రా పహాణీలో పేర్లు ఉన్న వారి వారసులు ఇప్పుడు వాదిస్తే అందులో కొంత వాస్తవం కనిపించేది. కానీ దాని మాటున అధికారులు ఎన్వోసీలు జారీచేస్తున్న పేర్లు.. అందుకుగాను తంటాలు పడి సృష్టిస్తున్న డాక్యుమెంట్ల లింకులను పరిశీలిస్తే చట్టాలు, నిబంధనలే సిగ్గుపడేలా ఉన్నాయి. ‘నమస్తే తెలంగాణ’ కథనాల్లో గోపన్‌పల్లి వ్యవహారంలో అధికారులు వేసిన అడుగుల్లోని తప్పిదాలను ఎత్తిచూపారు. అవన్నీ సరిచేసుకునేందుకు మాకు పనికొస్తాయి’ అని ఓ నిర్మాణ సంస్థ యజమాని పేర్కొనడం గమనార్హం. అంటే ‘పిక్చర్ అబీ బాకీ హై’.. ఈ భూముల వ్యవహారంలో అధికారులు మరిన్ని కొత్త అడుగులు వేయబోతున్నారనేది సుస్పష్టం.