హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): భూసేకరణ పరిహారం చెల్లించాలన్న హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిం ది. తామిచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమ లు చేయలేదని నిలదీసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోగా వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వకపోవడంపై మండిపడింది. కోర్టు అంటే లెక లేదా అని నిప్పులు చెరిగింది. హైకోర్టు ఆదేశాలను అ మలు చేయని కలెక్టర్‌తోపాటు భూసేకరణ అధికారికి బెయిలబుల్ వారంట్ జారీచేసింది. అక్టోబర్ 8న జరిగే విచారణ సమయంలో కలెక్టర్‌ను తమ ముందు హాజరుపర్చేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీ కి ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తర్వులను ఐఏఎస్ స్థాయి అధికారి అమలు చేయలేదంటే ఏమనుకోవాలని వ్యాఖ్యానించింది.
తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చెంది న వేపుల ఎల్లయ్య పరిహారం నిమిత్తం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన హైకోర్టు నాలుగు వారాల్లో ఎల్లయ్యకు రూ.7.86 లక్షలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు అమలు చేయలేదన్న విషయాన్ని జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ 3న జరిగిన విచారణలో గుర్తించారు. గత జూన్‌లో వెలువరించిన ఉత్తర్వులను అ మలు చేయడానికి మరో రెండు వారాల గ డువు కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరగా న్యాయమూర్తి అనుమతిచ్చారు.
పరిహారం చెల్లించాలని లేనిపక్షంలో కలెక్టర్, భూసేకరణ అధికారి వ్యక్తిగతంగా హైకోర్టు హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టంచేశారు. బుధవారం మరోసారి ఆ పిటిషన్ విచారణ కు వచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను కలెక్టర్ అమలు చేయకపోవడంతోపాటు వ్యక్తిగతం గా విచారణకు కూడా హాజరుకాకపోవడం తో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.