MP Raghunandan Rao | హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): న్యాయవ్యవస్థపై మీడియా సమావేశంలో బీజేపీ మెదక్ ఎంపీ ఎం రఘునందన్‌రావు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆయనకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేసింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో? వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సమాజంలో న్యాయవ్యవస్థ గౌరవ, ప్రతిష్ఠలను దెబ్బతీసే ప్రయత్నాలు చేసేలా రఘునందన్ వ్యాఖ్యలు ఉన్నాయని హైకోర్టు న్యాయమూర్తి లేఖ రాశారు. ఆ లేఖను హైకోర్టు సుమోటోగా తీసుకొని క్రిమినల్ కోర్టు ధికరణ పిటిషన్‌గా పరిగణనలోకి తీసుకున్నది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం గురువా రం విచారణ జరిపి రఘునందన్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.
ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వ్యవహారంలో ఆగస్టులో ఎంపీ రఘునందనరావు మీడియా సమావేశం నిర్వహించి న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని న్యాయమూర్తి లేఖలో పేర్కొన్నారు. ఎన్ కన్వెన్షన్ తరఫున హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు కాగా కూల్చివేతపై స్టే ఇస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంపై ఎంపీ అనుచిత ఆరోపణలు చేశారని న్యాయమూర్తి ప్రస్తావించారు. జడ్జీలు కండ్లకు గంతలు తీసి చుట్టూ జరుగుతున్నవాటిని గమనించి ఉత్తర్వులు జారీ చేయాలన్నారని లేఖలో వివరించారు. న్యాయమూర్తి లేఖను హైకోర్టు క్రిమినల్ కోర్టు ధిక్కరణ పిటిషన్‌గా పరిగణనలోకి తీసుకుని రఘునందన్‌రావుకు నోటీసులు జారీ చేసింది. మీడియా భేటీల్లో ఇష్టం వచ్చినట్టు ఎలా మాట్లాడతారని నిలదీసింది.. దీనిపై వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. విచారణ నాలుగు వారాలు వాయిదా వేసింది.