హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో సర్వే నంబర్ 45కు సంబంధించిన భూముల వివాదంపై దాఖలైన రిట్ పిటిషన్ల విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ వ్యవహారశైలిపై హైకోర్టు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. కోర్టు ఆదేశాలున్నప్పటికీ కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హైడ్రా కమిషనర్‌కు రూ.50 వేల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిలీఫ్ ఫండ్‌కు జమ చేయాలని ఆదేశించింది. ఈ జరిమానా చెల్లించాకే హైడ్రా కమిషనర్ దాఖలు చేసే కౌంటర్ అఫిడవిట్లను స్వీకరించాలని రిజిస్ట్రీకి ఉత్తర్వులు జారీచేసింది.
వివరాల్లోకి వెళ్తే.. యూసుఫ్‌గూడ, వెంగళరావునగర్ పరిధిలోని సర్వే నంబర్ 45లో రెండు ఎకరాల భూమికి ఉన్న ప్రహరీ గోడను హైడ్రా ఏకపక్షంగా కూల్చివేసిందని ఆరోపిస్తూ మహ్మద్ షఫహతుల్లా దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలన్న ఆదేశాలను హైడ్రా అమలు చేయకపోవడంతో ఏప్రిల్ 8న హైకోర్టు చివరి అవకాశం కల్పించింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని, లేనిపక్షంలో హైడ్రా కమిషనర్ వ్యక్తిగతంగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని ఉత్తర్వులు చేసింది.
అయినప్పటికీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో ఇటీవల విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై హైడ్రా తరఫు న్యాయవాది స్పందిస్తూ.. కౌంటర్ దాఖలు చేశామని, అది రిజిస్ట్రీ పరిశీలనలో ఉన్నదని చెప్పారు. దీనిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ రిజిస్ట్రీలో పరిశీలన చేయించడంతో సాంకేతిక కారణాల రీత్యా హైడ్రా కౌంటర్‌ను తిరసరించినట్టు తేలింది. విచారణ రోజున కౌంటర్ దాఖలు చేసినట్టు హైడ్రా తరఫు న్యాయవాది చెప్పినప్పటికీ అది ఎస్ఆర్ దశలోనే తిరసరణకు గురైనట్టు న్యాయమూర్తి గుర్తించారు. దీంతో హైడ్రా కమిషనర్‌కు రూ.50 వేల జరిమానా విధించారు. ఆ జరిమానా చెల్లించాకే హైడ్రా కౌంటర్లను స్వీకరించాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేశారు.