హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో 2011 మార్చి 10న జరిగిన మిలియన్ మార్చ్ కార్యక్రమం సందర్భంగా తమపై నమోదైన కేసులను కొట్టేయాలంటూ మాజీ సీఎం కే చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రులు, కే తారకరామారావు, హరీశ్‌రావు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును వాయిదా వేస్తున్నట్టు శుక్రవారం జస్టిస్ కే సుజన ప్రకటించారు.
హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై మిలియన్ మార్చ్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు తమపై నమోదైన కేసులను కొట్టేయాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాల తరఫున న్యాయవాది టీవీ రమణరావు వాదనలు వినిపించారు. ప్రభుత్వం పక్షాన పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు ప్రతివాదన చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): జాతీయ రహదారుల నిర్మాణం కోసం చేపట్టే భూసేకరణలో బాధితులకు చట్టం ప్రకారం పునరావాస, పునర్నిర్మాణ పథకం (ఆర్ఆర్ ప్యాకేజీ) అమలు చేయాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. కరీంనగర్వరంగల్ మధ్య 563వ జాతీయ రహదారి కోసం చేపట్టిన భూసేకరణ వల్ల నష్టపోయే నిర్వాసితులు ఆర్డీవోకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ఆదరఖాస్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కరీంనగర్-వరంగల్ మధ్య ఎన్‌హెచ్ 563 కోసం చేపట్టిన భూసేకరణలో ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేయలేదంటూ హనుమకొండ జిల్లా ఎలకుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన సాబీర్ సహా 12 మంది 2023లో పిటిషన్లు వేశారు. వీటిని సింగిల్ జడ్జి కొట్టేశారు. సెక్షన్ 3జీ(5) కింద పిటిషనర్లు అధికారుల నుంచి పరిషారం కోరవచ్చునని తేల్చారు.