High Court | హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): ఉద్యోగంలో చేరడం కోసం డీఎస్సీ 2008 అభ్యర్థులు ఏండ్ల తరబడి నిరీక్షిస్తున్నా రు, కోర్టు కూడా నియామకాలు చేపట్టాలని ఆదేశించింది, అయినప్పటికీ అధికారుల్లో కదలిక లేకపోవడం శోచనీయమని హైకోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా కూడా అర్హులకు ఉద్యోగ కల్పన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులను గౌరవించరా అని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈవీ నర్సింహారెడ్డిని నిలదీసింది. మనుషులు అన్నాక చిన్నచిన్న తప్పులు చే యడం పరిపాటని, అలాంటి వాటిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పింది. కోర్టుధికరణ కింద మీపై ఎందుకు చర్యలు చేపట్టరాదో చెప్పాలని నిలదీసింది. ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీ చేస్తే మీ భవిష్యత్తుకు ఇబ్బందేకదా అని వ్యాఖ్యానించింది.
2008 డీఎస్సీకి సంబంధించి 1382 పోస్టుల భర్తీ వ్యవహారంపై జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ ఈ తిరుమలాదేవితో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. తొలుత ప్రభుత్వ న్యాయవాది మాట్లాడుతూ.. డీఎస్సీ 2008కి సంబంధించి 1382 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేయడానికి ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకున్నామని, నియామకం చేపడతామని చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. కోర్టు ఉత్తర్వులను అమలు చేయనిపక్షంలో ఉన్నతాధికారిని విచారణకు హాజరుకావాలని ఆదేశించాం కదా? ఎందుకు హాజరుకాలేదు? అని ప్రశ్నించింది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాల్సివస్తుందని హెచ్చరించింది.
అనంతరం ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తి మేరకు విచారణను మధ్యాహ్నానికి వా యిదా వేసింది. మధ్యాహ్నం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈవీ నర్సింహారెడ్డి విచారణ కు హాజరయ్యారు. నియామక ప్రక్రి య మొ దలుపెట్టామని, మూడు రోజుల్లో పూర్తిచేస్తామని చెప్పారు. తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేశారు.