ప్రైవేట్ భూముల్లోకి హైడ్రా వెళ్లదని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్నరు. కానీ.. నంబర్ 2 మంత్రి ఆదేశిస్తే సీఎం మాటలను కూడా లెక్క చేయబోమని హైడ్రా నిరూపిస్తున్నది. సదరు మంత్రి కన్ను పడిన భూమిని ఆయనకు దక్కేలా చేయడానికి సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించడానికీ వెనుకాడటం లేదు. చివరికి కోర్టులు జోక్యం చేసుకుంటే తప్ప విడిచి పెట్టడం లేదు. ఇందుకు సాక్ష్యంగా ‘నమస్తే తెలంగాణ’లో శనివారం ప్రచురితమైన ఈదులకుంట కథనాన్ని చదివారు కదా?.. దానికి కొనసాగింపుగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లోతుకుంటలో హైడ్రా చేసిన మరో బాగోతాన్ని చదవండి..
లోతుకుంటలో ఉన్న భూమిపై నంబర్ 2 మంత్రి కన్ను పడగా, అందులో 38 శాతం భూమిని వాటాగా ఇప్పించేందుకు హైడ్రా శాయశక్తులా ప్రయత్నించింది. లేని వివాదాలను తెరమీదికి తెచ్చింది. అదంతా ప్రభుత్వ భూమి అంటూ హడావుడి చేసింది. కాదు.. అది ప్రైవేట్ భూమే అని హైకోర్టు తేల్చి చెప్పినా వినలేదు. ఆ భూమిలో ఉన్న రాళ్లను అడ్డుపెట్టుకొని నాటకం ఆడేందుకు ప్రయత్నించింది. దీంతో ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘మీరు చట్టానికి అతీతులని అనుకుంటున్నారా?’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో వెనక్కి తగ్గింది. చివరికి ఈదులకుంటలో మాదిరిగానే ‘మేము మళ్లీ ఆ భూమిలో అడుగుపెట్టం’ అని కోర్టుకు తెలిపింది.
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంట గ్రామం సర్వే నెంబరు 1, 2ల్లోని 40 ఎకరాల భూమి లో ఒక నిర్మాణ సంస్థ పనులు చేస్తున్నది. ఈ నెల 4న ఉదయం హైడ్రా సిబ్బంది అక్కడికి చేరుకొని, పనులను నిలిపివేయించారు. నిర్మాణ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. అయినా హైడ్రా సిబ్బంది అక్కడే తిష్ట వేశారు. ఏకంగా ఐదారు రోజులు వంతులవారీగా అక్కడే 24 గంటలూ కాపలా ఉన్నారు. హైడ్రా అంటే ప్రభుత్వ ఆస్తులను కాపాడేది కాబట్టి 40 ఎకరాలకు కాపలాగా ఉన్నదనుకొంటే పొరబాటే. రెవెన్యూ రికార్డుల్లో ఎక్కడా ఆ భూమి ప్రభుత్వానిది అనిగానీ, నిషేధిత (22ఏ) జాబితాలోగానీ లేదు. పైగా అడుగుతీసి అడుగువేస్తే గొప్పగా ప్రచారం చేసుకొనే హైడ్రా.. లోతుకుంట భూమి విషయంలో గప్‌చుప్‌గా ఉన్నది. ఐదారురోజులు సిబ్బంది అక్కడే ఉండి పనులు నిలిపివేయించినా మీడియాకు సమాచారం ఇవ్వలేదు.
వాస్తవానికి అది ప్రైవేట్ భూమి అని అప్పటికే హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో కొన్నాళ్లు మౌనంగా ఉండి.. ‘బండరాళ్ల’ వంక పెట్టుకొని మరోసారి ఆ భూమిలోకి వెళ్లింది. దీంతో కోర్టు ఈసారి ఘాటు వ్యాఖ్యలతో మొట్టికాయలు వేసింది. మరి.. హైడ్రా ఎవరి కోసం ఇదంతా చేసింది? రోజుల తరబడి ఎందుకు తిష్టవేసింది? ప్రభుత్వ భూమి అయితే రెవెన్యూ అధికారులు ఎందుకు రాలేదు? కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ మరోసారి ఆ భూమిలోకి ఎందుకు వెళ్లింది? ఎవరి మెప్పుకోసం ఇదంతా చేసింది?.. ఈ ప్రశ్నలపై ‘నమస్తే తెలంగాణ’ లోతుగా పరిశీలించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీటిని పరిశీలిస్తే.. తెరవెనుక నంబర్ 2 మంత్రి బాగోతం, 40 ఎకరాల్లో 15 ఎకరాల కమీషన్ కోసం వేసిన మంత్రాంగం, ఇందుకోసం హైడ్రాను అస్త్రంగా వాడిన విధానం వంటివన్నీ తేటతెల్లం అవుతాయి. ‘ప్రైవేటు భూముల్లోకి ఎందుకు పోతున్నారు?’ అంటూ హైకోర్టు పదేపదే హైడ్రాను ఎందుకు తలంటుతున్నదో కూడా తెలుస్తుంది.
ఇదీ ఆ భూమి కథ
లోతుకుంటలోని 56.24 ఎకరాలను 1933లో నిజాం ప్రభుత్వం బహిరంగ వేలం వేయగా, లతీఫ్ ఉన్నిసా బేగం కొనుగోలు చేసినట్లు జమాబందీలో రికార్డయింది. ఆమె 1955లో తన భర్త మహ్మద్ అజ్మతుల్లా పేరు మీద రిజిస్టర్డ్ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ చేశారు. అదే సంవత్సరం ఆయన ఈ భూమిని సేఠ్ కిషన్‌రామ్ అలియాస్ సేఠ్ కిషన్రామ్గౌలికి విక్రయించారు. 1980లో కిషన్‌రామ్ పేరు మీద చౌఫస్లా కూడా జారీ అయ్యింది. పట్టాదారు పాస్‌బుక్ కూడా వచ్చినట్టు రికార్డుల్లో ఉన్నది. 1978లో సనత్‌నగర్ నుంచి మౌలాలి వరకు బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ కోసం చేపట్టిన భూసేకరణలో ఈ భూమి నుంచి 5.10 ఎకరాలను తీసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భూ సేకరణ చట్టం ప్రకారం సేఠ్ కిషన్రామ్కు రూ.8.87 లక్షల పరిహారం చెల్లించారు. ఆ తర్వాత ప్రభుత్వం మరోసారి ఇదే భూమి నుంచి పీఎస్సీ గ్రావిటీ కోసం (అల్వాల్ నుంచి మౌలాలి వరకు) 630 చదరపు గజాలు సేకరించి, కిషన్రామ్కు పరిహారం అందించింది.
తెరవెనుక ‘హైడ్రా’మా
లోతుకుంట భూములపై కోర్టులో వాదనలు కొనసాగుతున్న సమయంలోనే నంబర్-2 మంత్రి కన్ను ఈ భూములపై పడింది. 2024లో జరిగిన ఉప ఎన్నికలో ప్రచారం చేసేందుకు వచ్చిన సమయంలో వందెకరాల భూమిపై ఆరా తీసినట్టు సమాచారం. స్థానిక ప్రజా ప్రతినిధి ఒకరు వివాదాన్ని మంత్రికి వివరించారని తెలిసింది. అప్పటి నుంచే ఈ భూమి చుట్టూ హైడ్రామా మొదలైందని చెప్తున్నారు. ఒక ప్రజా ప్రతినిధి ఆదేశం మేరకు స్థానిక అధికారులు తరచూ ఆ భూమి వద్దకు వెళ్లి, సంబంధిత వ్యక్తులను కలిశారని, నంబర్-2 మంత్రి దగ్గరికి వెళ్లాలని సూచించారని పేర్కొన్నారు.
ట్విస్ట్-1: 40 శాతానికి డిమాండ్
మొదట్లో ఆ వ్యక్తులు అంగీకరించలేదని, అధికారులు ఒత్తిడి చేయడంతో మినిస్టర్-2 దగ్గరికి వెళ్లినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అది ప్రభుత్వ భూమి అని మంత్రి చెప్పగా, వివాదం కోర్టులో ఉన్నదని భూమి సంబంధిత వ్యక్తులు బదులిచ్చినట్టు తెలిసింది. దీంతో ‘లేదు.. లేదు.. ప్రభుత్వానిదే, మొత్తం స్వాధీనం చేసుకుంటాం’ అని మంత్రి గద్దించి మాట్లాడినట్టు చెప్తున్నారు. ఆ సమయంలో అక్కడ ఒక అధికారి కూడా ఉన్నట్టు సమాచారం. ఆయన వారిని పక్కకు తీసుకెళ్లి ‘ఏదో ఒకటి సెటిల్ చేసుకోండి’ అంటూ సలహా ఇచ్చారని ప్రచారం జరుగుతున్నది. కొంతసేపు నాటకీయ పరిణామాల అనంతరం.. భూమిలో 40 శాతం వాటా.. అంటే 16 ఎకరాలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు తెలిసింది. చివరికి 15 ఎకరాలైనా (38 శాతం) ఇవ్వాలని అల్టిమేటం జారీ చేసినట్టు సమాచారం. కానీ సదరు వ్యక్తులు మాత్రం తాము ఏదీ ఇచ్చేదిలేదని అధికారితో తేల్చి చెప్పినట్టు తెలిసింది.
ట్విస్ట్-2: హైడ్రా రంగప్రవేశం
2025 మార్చి 13న హైడ్రా కమిషనర్ రంగనాథ్ లోతుకుంటలో పర్యటించారు. అక్కడ ఉన్న వంద ఎకరాల ప్రభుత్వ భూమిని సంరక్షించాలంటూ స్థానికులు ఫిర్యాదు చేయగా, రంగనాథ్ వచ్చి పరిశీలించినట్టు హైడ్రా పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆ భూమిలో ఎలాంటి పనులు జరగకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారని పేర్కొన్నది. ఆ వంద ఎకరాల్లో ఈ 40 ఎకరాలు కూడా ఉన్నది.
ట్విస్ట్ -3: ప్రైవేట్ భూమిగా తేల్చిన కోర్టు
ఈ భూమిపై 2022లో దాఖలైన పిటిషన్లపై 2025 అక్టోబర్‌లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం వేసిన అప్పీల్‌ను తిరస్కరించింది. ఆ భూమి ప్రైవేట్ వ్యక్తులదే అని స్పష్టం చేసింది. ఆ తర్వాత హైకోర్టులో ఈ భూమిపై పెండింగ్‌లో ఉన్న పలు ధిక్కరణ కేసులను కూడా న్యాయస్థానం ఈ ఏడాది జనవరిలో ముగించింది. ఇకపై ఆ భూముల్లో జోక్యం చేసుకోబోమని ప్రభుత్వ న్యాయవాది నుంచి హామీ కూడా తీసుకున్నది. దీంతో ఆ భూమి ప్రైవేట్ వ్యక్తులదే అని తేలిపోయింది. ఈ తీర్పుపై ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లలేదు. దీనిని బట్టి ప్రభుత్వం కూడా ఒప్పుకున్నట్టయ్యింది.
ట్విస్ట్ -4: రాళ్లను పట్టుకున్న హైడ్రా
న్యాయ వివాదాలన్నీ పరిష్కారం కావడంతో 2026 జనవరిలో శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ అక్కడ నిర్మాణ పనులు మొదలుపెట్టింది. దాదాపు నాలుగైదు నెలల పాటు హైడ్రాగానీ, ఇతర శాఖల అధికారులు గానీ అటువైపు కన్నెత్తి చూడలేదు. అకస్మాత్తుగా ఈ ఏడాది మే 31వ తేదీన హైడ్రా రంగంలోకి దిగింది. సిబ్బంది వెళ్లి పనులను నిలిపివేయించారు. కారణం అడగగా.. ఆ 40 ఎకరాల్లో రెండు భారీ చారిత్రక బండరాళ్లు ఉన్నాయని, వాటిని సంరక్షించాలని ‘సేవ్ ది రాక్స్’ సొసైటీ ఫిర్యాదు చేసిందని, ఈ మేరకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. జూన్ 10వ తేదీ సాయంత్రం వరకు హైడ్రా అధికారులు అక్కడే తిష్టవేసి పనులు జరగకుండా నిలువరించారు.
ట్విస్ట్ -5: అంతా గప్‌చుప్
పుప్పాలగూడలో చారిత్రక గుట్టలు ఉన్న 280 ఎకరాల భూమి చుట్టూ హైడ్రా కంచె వేసింది. ఆ భూమిని కాపాడామంటూ ఈ నెల 5న ఘనంగా ప్రకటించుకున్నది. లోతుకుంటలోనూ ‘చారిత్రక రాళ్లు’ పేరుతో 40 ఎకరా ల్లో పనులు నిలిపివేశారు. ఈ లెక్కన అక్కడ కూడా చారిత్రక రాళ్లను కాపాడినట్టే కదా? దాదాపు 10 రోజులపాటు అక్కడే తిష్టవేసి వాటిని సంరక్షించినట్టే కదా? అయినా ఆ విషయాన్ని ఎక్కడా మీడియాకు తెలియనీయలేదు.
ట్విస్ట్ -6: ‘మీరు సూపర్ కాప్’ అనుకుంటున్నారా?
హైడ్రా సిబ్బంది పనులను నిలిపివేయించిన మరుసటిరోజే శాంతా శ్రీరామ్ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని ఈ నెల 16న విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం హైడ్రా తీరును తీవ్ర స్థాయిలో ఎండగట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయిన కేసులకు సంబంధించిన ప్రైవేట్ భూముల్లో హైడ్రా జోక్యం చేసుకోవడానికి వీలు లేదని స్పష్టం చేసింది. గత వివాదాల్లో హైడ్రా ప్రతివాదిగా లేదనే కారణంతో ప్రతీ ప్రైవేట్ భూమిలో తలదూర్చకూడదని పేర్కొన్నది. హైడ్రా కార్యాలయాలు, ఆఫీసర్లు ప్రభుత్వంలో ఒక భాగం మాత్రమేనని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతున్నామనే ఉత్సాహం హైడ్రా అధికారులకు ఉంటే ఉండొచ్చని, అలాగని చట్టానికి అతీతంగా వ్యవహరిస్తామంటే కుదరదని తేల్చి చెప్పింది. హైడ్రా తనకుతాను సూపర్‌కాప్‌గా ఫీలవుతున్నట్టు ఉన్నదని ఆక్షేపించింది. చట్టానికి, కోర్టు తీర్పులకు అతీతులు కారని స్పష్టం చేసింది. చట్టాన్ని అతిక్రమిస్తే కోర్టులు చూస్తూ ఊరుకోవని హెచ్చరించింది. హైడ్రా తొందరపాటుతో ప్రైవేట్ భూమిలోకి ప్రవేశించి తప్పు చేసిందని వ్యాఖ్యానించింది. మరోసారి జోక్యం చేసుకోబోమని హామీ ఇవ్వాలనడంతో, హైడ్రా ఈ మేరకు హామీ ఇచ్చింది. హైడ్రా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకే పరిమితం కావాలని స్పష్టం చేసింది.
ఈ ప్రశ్నలకు బదులేది?
ప్రపంచానికి తెలిసిన కథ
సేఠ్ కిషన్‌రామ్ వారసులు 40 ఎకరాల భూమికి సంబంధించి 2006లో శాంతాశ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో డెవలప్మెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఆ సంస్థ 2007లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు లే అవుట్కోసం దరఖాస్తు చేసుకున్నది. మల్కాజిగిరి మండల తహసీల్దార్ ఈ సర్వేనెంబర్లలో ప్రభుత్వ భూమి లేదంటూ ఎన్వోసీ ఇచ్చారు. ఈ మేరకు
కంటోన్మెంట్ బోర్డు 2008లో 40 ఎకరాలకు లేఅవుట్‌ను మంజూరు చేసింది.
డెవలప్మెంట్ ఛార్జీల కింద రూ.53.25 లక్షలు తీసుకున్నది. దీంతోపాటు అదే ప్రాంతంలోని రక్షణ శాఖకు చెందిన జీఎల్ఆర్ 244, 245, 246 ప్లాట్ల భూమి కబ్జాకు గురి కాకుండా ఉండేందుకు చుట్టూ ప్రహరీ నిర్మించి ఇవ్వాలని షరతు విధించగా, నిర్మాణ సంస్థ గోడ కట్టి ఇచ్చింది. 2013లో తిరుమలగిరి తాసిల్దార్ ఈ 40 ఎకరాల భూమి లోతుకుంట పరిధిలోనిది కాదని.. తమ పరిధిలోకి వచ్చే 243 సర్వేనెంబరులోని ప్రభుత్వ భూమి అంటూ నోటీసులు జారీ చేశారు. యాజమాన్య హక్కు (టైటిల్) వివాదం కావడంతో నిర్మాణ సంస్థ ముందుగా ఆర్డీవో కోర్టుకు వెళ్లింది. అది ప్రభుత్వ భూమిగా తేల్చడంతో, 2016లో హైకోర్టును ఆశ్రయించింది. 2021 మార్చిలో హైకోర్టు తుది తీర్పు ఇస్తూ.. భూమిని తిరిగి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని, మరోసారి ఈ భూమి విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండకూడదని ఏకసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.
నిర్మాణ సంస్థకు రూ.లక్ష చెల్లించాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం 2021 ఆగస్టులో డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించగా, ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై నాలుగు వారాలు స్టే విధించింది. వివాదాన్ని సివిల్ కోర్టులో తేల్చుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2022లో ప్రభుత్వం సివిల్ కోర్టును ఆశ్రయించగా, సూట్‌ను కోర్టు తిరస్కరించింది. ప్రభుత్వం తిరిగి హైకోర్టుకు అప్పీల్ చేసింది. కేసు ఏండ్ల తరబడి అక్కడే కొనసాగింది. 2025 మార్చి 13న హైడ్రా కమిషనర్ రంగనాథ్ లోతుకుంటలో పర్యటించారు. అక్కడ వంద ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నదని, దానిని సంరక్షించాలంటూ స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పర్యటించినట్టు హైడ్రా పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆ భూమిలో ఎలాంటి పనులు జరగకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్ హైడ్రా అధికారులను ఆదేశించారని ఆ ప్రకటనలో పేర్కొన్నది. ఆ వంద ఎకరాల్లో ఈ 40 ఎకరాలు కూడా ఉన్నది.
