హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో-9లోని నాలుగు మార్గదర్శకాల అమలుపై గతంలో విధించిన మధ్యంతర స్టేను హైకోర్టు మంగళవారం మరోసారి పొడిగించింది. ఇంజినీరింగ్ కళాశాలల ఫీజుల వసూలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జూన్ 6న జీవో-9 జారీచేసింది. తదుపరి విచారణ జూలై 6న (సోమవారం) చేపడుతామని పేరొంటూ, అప్పటివరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. జీవో-9ని సవాల్ చేస్తూ 100కుపైగా ఇంజినీరింగ్ కళాశాలలు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది ఎస్ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కౌంటర్ అఫిడవిట్‌ను సిద్ధం చేస్తున్నామని, దానిని పిటిషనర్లకు అందజేయడానికి జూలై 6 వరకు గడువు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు.
దీనిపై కాలేజీల తరఫున సీనియర్ న్యాయవాదులు ఎల్ రవిచందర్, ఎస్ శ్రీరామ్, అవినాశ్ దేశాయ్, తరుణ్ జీ రెడ్డి వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడానికి ఇప్పటికే చాలా సమయం తీసుకుందని పేరొన్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎప్పటిలోగా విడుదల చేస్తుందో, లేక విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోవాలా అనే విషయంలో కళాశాలలకు ఎలాంటి స్పష్టత లేదని తెలిపారు. ఈ పరిస్థితుల్లో గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొనసాగించాలని కోరారు. అలాగే ఫీజుల నిర్ధారణ అంశం కూడా అత్యంత కీలకమని, దానిపై కూడా విచారణ చేపట్టాలని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇరు పక్షాల వాదనలు పరిశీలించిన న్యాయమూర్తి, ప్రభుత్వం జూలై 6లోగా కౌంటర్ దాఖలు చేయాలని, అనంతరం అవసరమైతే కాలేజీలు రిప్లయ్ కౌంటర్ సమర్పించాలని ఆదేశించారు. అదేరోజు ఫీజుల నిర్ధారణకు సంబంధించిన పిటిషన్లపై కూడా విచారణ చేపతామని పేరొంటూ, అప్పటివరకు జీవో-9లోని నాలుగు మార్గదర్శకాల అమలుపై విధించిన మధ్యంతర స్టే కొనసాగుతుందని స్పష్టంచేశారు.