హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఫార్ములా ఈ రేసింగ్ ఒప్పందంలో అక్రమాలు జరిగాయంటూ ఏసీబీ నమోదు చేసిన క్రిమినల్ కేసులో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, శాసనసభ్యుడు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)కు హైకోర్టులో ఊరట లభించింది. ఆ కేసులో కేటీఆర్‌ను అరెస్టు చేయరాదని ఏసీబీకి మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 30వ తేదీ వరకు అరెస్టు చేయరాదని పేరొంది. అయితే ఈ కేసు దర్యాప్తును కొనసాగించవచ్చని ఏసీబీకి స్పష్టం చేసింది. దర్యాప్తునకు కేటీఆర్ సహకరించాలని, తన వద్ద ఉన్న పత్రాలను ఏసీబీకి అందజేయాలని ఆదేశించింది. ఎఫ్ఐఆర్లో కొన్ని ప్రాథమిక అంశాలు లోపించాయని గుర్తించింది. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను పరిశీలించాల్సి ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో కోర్టుకున్న విచక్షణాధికారంతో సీఆర్పీసీ 482 కింద మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు స్పష్టం చేసింది. ప్రతివాదులైన ఏసీబీ, పురపాలకశాఖ ప్రధానకార్యదర్శి ఎం దానకిశోర్‌కు నోటీసులు జారీచేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. తనపై ఏసీబీ పోలీసులు నమోదు చేసిన క్రిమినల్ కేసును కొట్టేయాలని కోరుతూ కేటీఆర్ శుక్రవారం అత్యవసర లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేపట్టారు. 2గంటలకుపైగా ఏకబిగిన ఇరుపక్షాల వాదనలు జరిగాయి. అనంతరం మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి.
రాజకీయ.వ్యక్తిగత కక్ష సాధింపు
కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది సీఏ సుందరం వాదనలు వినిపిస్తూ.. కేటీఆర్‌పై కేసు నమోదు చేయడం రాజకీయ విభేదాలతోపాటు వ్యక్తిగత కక్షసాధింపు చర్యగా అభివర్ణించారు. కేటీఆర్‌పై కేసు నమోదు చేయడానికి ఎలాంటి కారణాలు లేవన్నారు. ఎఫ్ఐఆర్ను పరిశీలిస్తే అవినీతి జరిగినట్టు ఎకడా ఆధారాలు ఉండవని తెలిపారు. పిటిషనర్ ఆర్థిక ప్రయోజనం పొందినట్టు ఎలాంటి ఆరోపణలు లేవని తెలిపారు. ఫార్ములా రేస్ నిమి త్తం ప్రభుత్వం, ఫార్ములా ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈఓ), ఏస్ నెక్స్‌జెన్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఒప్పందం కుదిరిందని వివరించారు. ఇందు లో 10వ సీజన్‌కు ప్రమోటర్ వెళ్లిపోవడంతో ప్రభుత్వమే చెల్లింపులు జరిపి రేస్ నిర్వహణకు ఆమోదం తెలిపిందని, 2023 బకాయిలను చెల్లించిందని వివరించారు. కొత్తగా చేసుకున్న ఒప్పందాన్ని ప్రభు త్వం అమలు చేయక ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో అర్బిట్రేషన్ను ఎదురోవాల్సి వస్తున్నదని తెలిపారు.
ఆలస్యంగా ఎందుకు కేసు పెట్టారు?
ఈ కేసులో ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరిగినట్టు చెప్తున్నారని, అలా జరిగి ఉంటే ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని న్యాయవాది సుందరం తెలిపారు. ఈసీ స్పందించకపోయినా ప్రభుత్వం కక్షసాధింపు చర్యల్లో భాగంగా కేసు నమోదు చేసిందని చెప్పారు. ఈసీ ప్రొసీజర్ అమలు చేయలేదన్న ఆరోపణ మీద 14 నెలలు ఆలస్యంగా ప్రభుత్వం కేసు నమోదు చేసిందని చెప్పారు. ఇది సుప్రీంకోర్టు తీర్పులకు, మార్గదర్శకాలకు వ్యతిరేకమన్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 3(1)(ఏ) కింద కేసు నమోదు చేయడానికి నిధుల దుర్వినియోగం ఎకడ జరిగిందని ప్రశ్నించారు, నిజంగానే అవినీతి జరిగితే ప్రమోటర్స్‌ను ఎందుకు నిందితులుగా చేయలేదని నిలదీశారు.
ప్రభుత్వ విధాన నిర్ణయం
ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వమని, అధికార యంత్రాంగం అన్నీ చూసిన తరువాత మం త్రిగా కేటీఆర్ ఆమోదం తెలిపారని చెప్పా రు. ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయంలో తప్పు జరిగితే దానిపై ప్రభుత్వమే తిరిగి నిర్ణ యం తీసుకోవాలని వివరించారు. ఇకడ నిర్వాహకులను నిందితులుగా ఎందుకు చేర్చలేదో హైకోర్టు లోతుగా పరిశీలించాలని కోరా రు. ఈ ఒక కోణం పరిశీలించినా కేసు కుట్రపూరితమని స్పష్టం అవుతుందని తెలిపారు. ఇది కేవలం సివిల్ వివాదమని, ఎఫ్ఐఆర్ను కొట్టివేయాల్సిన కేసు అని, ప్రత్యర్థులు కౌంట రు దాఖలు చేశాక విచారణ చేపట్టి నిర్ణయం తీసుకోవాలని, ఎఫ్ఐఆర్పై తదుపరి ప్రొసీడింగ్స్‌ను నిలిపివేస్తూ స్టే ఇవ్వాలని కోరారు.
ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్ఐఆర్ చెల్లదు
ఫార్ములా ఈ రేసింగ్‌కు జరిగిన ఒప్పందంలో నగదు చెల్లింపుల షరతులపై కోర్టు అడ్వకేట్ జనరల్ (ఏజీ)నిప్రశ్నించింది. అభియోగాలకు చూపిన కారణాలు ఏమిటో చెప్పాలని నిలదీసింది. పిటిషనర్‌కు డబ్బులు ముట్టనప్పుడు అవినీతి నిరోధక చట్టం ఎలా వర్తిస్తుందని ప్రశ్నించింది. క్రిమినల్ నెగ్లిజెన్సీ ఉందని ఎలా చెప్తారని అడిగింది. వీటిపై ఏజీ ఏ సుదర్శన్‌రెడ్డి నుంచి నేరుగా జవాబులు రాలేదు. అవన్నీ ఏసీబీ దర్యాప్తులో తేలుతాయని, ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని మాత్రం కోరారు. దీనిపై కేటీఆర్ న్యాయవాది సుందరం కల్పించుకుంటూ.. ఈ నెల 18న ఏసీబీకి ఫిర్యాదు అందితే దానిపై ఆగమేఘాల మీద ఆ మరుసటి రోజే ఈ నెల 19న ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని చెప్పారు. భజన్‌లాల్, లలిత్కుమారి కేసుల్లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుల ప్రకారం ఫిర్యాదు ఆలస్యంగా అందితే దానిపై దర్యాప్తు అధికారి ప్రాథమిక విచారణ చేశాకే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని గుర్తుచేశారు. దీనిపై ఏజీ స్పందిస్తూ, గతంలోనే ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం గుర్తించిందని, కేటీఆర్‌పై దర్యాప్తునకు గవర్నర్ నుంచి అనుమతి తీసుకున్నట్టు వివరించారు. గవర్నర్ ఈ నెల 17న అనుమతి ఇచ్చారని, ఆ మరుసటి రోజు పురపాలక శాఖ ప్రధా న కార్యదర్శి ఎం దానకిషోర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారని తెలిపారు.
లోపాలుంటే అది ప్రభుత్వానివే..
ప్రభుత్వం ఒకసారి ఒప్పందం చేసుకున్నాక రెండోసారి నిర్వాహకులతో మరో ఒప్పందం చేసుకుందని సుందరం వివరించారు. ఇందులో లోటుపాట్లు ఉంటే అది ప్రభుత్వపరమైనవే తప్ప పిటిషనర్‌వి కాబోవని అన్నారు. రెండోసారి ఒప్పందం చేసుకున్నప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉందని ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. తొలి ఒప్పందం మేరకే రెండో ఒప్పందం అమలు అయ్యింది కాబట్టి ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగలేదని చెప్పారు. ఈసీ విషయాలను ప్రభుత్వం చెప్పడం ఏమిటని ప్రశ్నించారు.
14 నెలలు ఆలస్యంగా కేసు చెల్లదు
ప్రాథమిక విచారణ కూడా లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని సుందరం అన్నారు. కేవలం ప్రత్యర్థి పార్టీ నేతగా ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తున్న కారణంగానే కేటీఆర్‌పై లేనిపోని అభియోగాలతో కేసు నమోదు చేశారని చెప్పారు. పీసీ యాక్ట్‌లోని 13(1)ఏ ప్రకారం చట్టసభ ప్రతినిధి నిధుల దుర్వినియోగం అభియోగాలు ఉంటేనే కేసు నమోదు చేయాలని తెలిపారు. స్పాన్సర్లు వెళ్లిపోయారని, నిర్వహకులూ వెళ్లిపోయేలా ప్రభుత్వం చేసిందని, ఇకడ డబ్బులు తీసుకున్న నిర్వాహకులపై కేసు పెట్టకుండా నాటి మున్సిపల్ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు చేయడం చట్ట వ్యతిరేకమని అన్నారు.
మోసం చేశారనే అభియోగాలకు ఆధారాలు లేవు
మోసపూరితంగా ప్రభుత్వ ఆస్తిని దు ర్వినియోగం చేశారనే ఆరోపణలకు ఆధారాలు లేవని సుందరం చెప్పారు. కాబట్టి అవినీతి నిరోధక చట్టం, 1988లోని సెక్షన్ 13(1)(ఏ), సెక్షన్ 13(2) పిటిషనర్ కేటీఆర్‌కు వర్తించవని అన్నారు. ఐపీసీలోని 120-బి, 409 సెక్షన్ల కింద కేసు నమోదు వెనుక కుట్ర ఉన్నదని చెప్పారు. ఇలాంటి తీవ్ర నేరాభియోగాలతో కేసు నమోదు చేస్తే 41 (ఏ) నోటీసు ఇచ్చి పిటిషనర్‌ను విచారణ చేయాల్సిన అవసరం లేకుండా కుట్రపూరితంగా చేశారని తెలిపారు. రాజకీయ కుట్రతో పిటిషనర్‌ను జై ల్లో పెట్టాలనే కుయుక్తి ఉందని అన్నారు.
‘అభియోగాలకు చూపిన కారణాలు ఏమిటో చెప్పాలి. పిటిషనర్‌కు డబ్బులు ముట్టనప్పుడు అవినీతి నిరోధక చట్టం ఎలా వర్తిస్తుంది? క్రిమినల్ నెగ్లిజెన్సీ ఉందని ఎలా చెప్తారు? ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను పరిశీలించాల్సి ఉంది. కోర్టుకున్న విచక్షణాధికారంతో సీఆర్పీసీ 482 కింద మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. కేటీఆర్‌ను ఈ నెల 30 వరకూ అరెస్టు చేయవద్దు’
– హైకోర్టు
పిటిషనర్ (కేటీఆర్)పై సెక్షన్ 13(1)(ఏ) కింద కేసు పెట్టడానికి కారణాలేవి. చెల్లింపులకు సంబంధించిన నిబంధనలు ఒప్పందంలో ఎకడ ఉన్నాయి? ఫార్ములా ఈ రేసింగ్ ఒప్పందంలో అక్రమాలు జరిగితే అందుకు ఆధారాలు ఏవి? నగదు చెల్లింపులు పిటిషనర్‌కు చేయలేదు కదా?
-అడ్వకేట్ జనరల్‌కు హైకోర్టు ప్రశ్నలు