High Court | హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ)/మణికొండ: ‘ఐదేండ్ల చిన్నారిని పక్కింటి వ్యక్తి నమ్మకంగా తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. చిన్నారిపై రెండుసార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. చిన్నారి ఎవరికైనా చెప్తుందేమోనని బండరాయితోమోది కిరాతకంగా హత్య చేశా డు. ఇలాంటి మానవ మృగానికి జీవించే హకు ఉండకూడదు. ఇంతటి ఘోరానికి ఒడిగట్టిన ముద్దాయికి ఉరి శిక్ష విధించడమే సరైనది’ అని హైకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది.
కింది కోర్టు విధించిన ఉరిశిక్షను ఖరారు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే ప్రథమం. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో 2017 డిసెంబర్ 12న ఐదేళ్ల చిన్నారిపై లైంగికదాడి, హత్య కేసులో నిందితుడైన మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీ దినేశ్‌కుమార్ దార్నేకు రంగారెడ్డి జిల్లా కోర్టు 2021 ఫిబ్రవరి 9న విధించిన శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది.
ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీ శ్యాం కోషీ, జస్టిస్ సాంబశివరావునాయుడుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. కింది కోర్టు 2023లో విధించిన తీర్పును ఆమోదించాలని సదరు కోర్టు హైకోర్టుకు నివేదించింది. ఈ వినతిని హైకోర్టు ధర్మాసనం ఆమోదించింది. ఇదే సమయంలో కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ దినేశ్‌కుమార్ ధార్నే దాఖలు చేసిన క్రిమినల్ అప్పీల్ పిటిషన్‌ను కొట్టివేసింది.
రంగారెడ్డి జిల్లా నార్సింగి ప్రాంతంలో 2017 డిసెంబర్ 12న జరిగిన ఈ దారుణ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఐదేండ్ల చిన్నారి ఇంటి వద్ద ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నార్సింగి పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ జీవీ రమణగౌడ్ నేతృత్వంలో కేసు దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి విచారణ చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించి దినేశ్‌కుమార్ ధార్నేను గుర్తించా రు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్ రాష్ర్టానికి చెందిన దినేష్‌కుమార్ ధార్నే (23) అల్కాపూర్ టౌన్షిప్ ప్రాంతంలో నివాసముంటూ సెం ట్రింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
పోలీసుల విచారణలో నిందితుడు చేసిన నేరా న్ని ఒప్పుకున్నాడు. చిన్నారికి చాక్లెట్ ఇప్పిస్తానని చెప్పి లైంగికదాడి చేసి హత్య చేసినట్టు ఒప్పుకున్నాడని తెలిపారు. ఇన్స్పెక్టర్ జీవీ రమణగౌడ్ విచారణ జరిపి ఆధారాలన్నింటినీ సేకరించి 90 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేశారు.రంగారెడ్డి ఎంఎస్‌జే కోర్టు ట్రయల్ నిర్వహించి నిందితుడు దినేశ్‌కుమార్ ధార్నేకు 2021 ఫిబ్రవరి 9న శిక్షను ఖరారు చేసింది. నిందితుడు ధర్నే న్యాయస్థానం తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో క్రిమినల్ పిటిషన్‌ను దాఖలు చేశాడని చెప్పారు. తెలంగాణ హైకోర్టు నిందితుడి పిటిషన్‌ను కొట్టివేసి మరణ శిక్షను ధ్రువీకరించింది.