Telangana | హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామక ప్రక్రియపై యథాతథ స్థితి కొనసాగించాలని మంగళవారం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. యథాతథస్థితి ఉత్తర్వులు ఫిబ్రవరి 8వ తేదీ వరకు అమల్లో ఉంటాయని ప్రకటించింది. ఈ ఉత్తర్వులతో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నియమితులైన కోదండరాం, అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. కోర్టులో పిటిషన్ విచారణలో ఉండగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్‌ను ఎమ్మెల్సీగా గవర్నర్ నియమించడం పట్ల ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. పిటిషన్లు విచారణలో ఉండగా నియామక ప్రక్రియను ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించింది. తదుపరి విచారణ వరకు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు ప్రకటించింది.
పిటిషన్లు విచారణలో ఉండగా కోదండరాం, అలీఖాన్ అభ్యర్థిత్వాలను గవర్నర్ ఆమోదించారని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది ఆదిత్య సోంది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. వ్యాజ్యాల విచారణ పూర్తయ్యే వరకు ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ చేపట్టబోమని గత విచారణ సమయంలో రాజ్‌భవన్ ప్రకటన చేసిందని గుర్తు చేశారు. దీంతో తమ ముందు వ్యాజ్యాలు విచారణలో ఉండగా నియామక ప్రక్రియను ఎలా కొన సాగిస్తారని అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డిని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదని, గత విచారణ సమయంలో పరస్పర ఒప్పందంలో భాగంగా తదుపరి విచారణ వరకు.. అంటే ఈ నెల 24వ తేదీ వరకు నియామకాలు చేపట్టబోమని హామీ ఇచ్చినట్టు చెప్పారు.
ఈ హామీని పొడిగించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోరలేదని.. అంటే, ఈ నెల 24 వరకే ఆ హామీ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యాక కోర్టులు జోక్యం చేసుకోడానికి వీల్లేదని, ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనల ప్రకారం వెలువడిన నోటిఫికేషన్ నిలుపుదలకు కోర్టులకు అధికారం లేదని వాదించారు. దీనిపై పిటిషనర్ల తరఫు మరో న్యాయవాది మయూర్‌రెడ్డి స్పందిస్తూ, కోర్టుకు ఇచ్చిన హామీకి విరుద్ధంగా నియామకాల విషయంలో గవర్నర్ ముందుకు వెళ్లారని ఆరోపించారు. ఇది నమ్మకానికి సంబంధించిన విషయమని, నమ్మకాన్ని వమ్ము చేశారని అన్నారు. నమ్మకం దెబ్బతినేలా చేసిన చర్యలను అడ్డుకోవాలని కోరారు. ఇరుపక్షాల వాదనల తర్వాత ఈ నెల 24న జరిగిన విచారణ సమయంలో అందరి అభిప్రాయాల తర్వాతే తదుపరి విచారణను ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసినట్టు ధర్మాసనం గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో అప్పటికే ఇరుపక్షాల ఏకాభిప్రాయంతో ఇచ్చిన హామీ ఉండగా నియామకాల విషయంలో ముందుకు ఎలా వెళతారని ప్రశ్నించింది. ఎమ్మెల్సీల నియామకాల ప్రక్రియను నిలుపుదల చేయడం లేదని, అయితే, యథాతథస్థితి (స్టేటస్ కో) ఉత్తర్వులు జారీ చేస్తున్నామని వెల్లడించింది. ఉదయం విచారణ ముగిసిన తర్వాత మధ్యాహ్నం స్టేటస్ కో ఉత్తర్వులను వెలువరించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది.
గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా కేసీఆర్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్రా సత్యనారాయణ పేర్లను సిఫారసు చేసింది. అయితే, వారికి రాజకీయ సంబంధాలున్నాయన్న కారణం చూపి గవర్నర్ తిరసరించారు. గవర్నర్ చర్య రాజ్యాంగ వ్యతిరేకమని పేరొంటూ దాసోజు, కుర్రా వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖ లు చేశారు. వీటిపై గత విచారణ సమయంలోనే హైకోర్టు.. గవర్నర్ నిర్ణయంపై సమగ్ర విచారణ చేపడతామని ప్రకటించింది. సాంకేతిక అంశా ల పేరుతో వ్యాజ్యాలపై విచారణ ముగించబోమని కూడా తేల్చి చెప్పిం ది. పిటిషన్ల విచారణార్హతతోపాటు గవర్నర్ నిర్ణయంపై న్యాయ సమీక్ష పరిధిపై కూడా విచారణ చేస్తామని వెల్లడించింది. ఆ పిటిషన్లపై ఫిబ్రవరి 8న తదుపరి విచారణ జరగాల్సి ఉండగా, కొత్త ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ ఎడిటర్ అమీర్ అలీఖాన్ పేర్లను ప్రతిపాదించడం.. గవర్నర్ ఆమోదించటం చకచకా జరిగిపోయాయి. బుధవారం వారిద్దరు ప్రమాణస్వీకారం చేసేందుకు ఏర్పాట్లు కూడా జరిగాయి. ఎమ్మెల్సీ నియామక జీవో 12 ఈ నెల 27న వెలువడింది. ఈ జీవోను సవాల్ చేస్తూ పిటిషనర్లు మధ్యంతర పిటిషన్లను దాఖలు చేశారు. కోదండరాం, అమీర్ అలీఖాన్‌ను ప్రతివాదులుగా చేర్చాలన్న పిటిషన్లను సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది.