Aasara Pension | అవసరాలను తీర్చదు. ఏ మూలకూ సరిపోదు. సమయానికి వస్తుందా అంటే.. అదీ లేదు. సవాలక్ష ఆంక్షలు. పైరవీలు. పలుకుబడులు. పైపెచ్చు ఆదాయ పరిమితులు. ఇదీ సమైక్య రాష్ట్రంలో పింఛన్ల కష్టం. తెలంగాణ వచ్చాక ఎంతో భిన్నమైన వాతావరణం. ఇప్పుడు పింఛన్ తిరుగులేని భరోసా. ఎవరి దగ్గరా చేయి చాచాల్సిన పన్లేని ఆత్మగౌరవం.
ఉమ్మడి పాలనలో వృద్ధులు, వితంతువులే కాదు.. దివ్యాంగులూ ఎదురొన్న తీవ్ర సమస్య సామాజిక, ఆర్థిక అభద్రత. తమను పట్టించుకునేవారు, ఆదుకునేవారు లేరనే వెలితి ప్రతి ఒక్కరినీ వెంటాడేది. నాటి పాలకులు పింఛన్ల విషయంలో మొక్కుబడిగా వ్యవహరించేవారు. అరకొర సాయానికి కూడా అనేక అవరోధాలు. లబ్ధిదారుల ఎంపికలో సవాలక్ష నిబంధనలు. స్వరాష్ట్రం అవతరించాక.. పింఛన్ల పథకాన్ని ఓ సామాజిక బాధ్యతగా అమలు చేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆసరా పింఛన్ పథకం అభాగ్యులకు బతుకు భరోసానిస్తున్నది. నిరుపేద వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, గీత శ్రామికులు, నేతన్నలు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, వృద్ధ కళాకారులు, డయాలసిస్ రోగులకు ఆత్మగౌరవాన్ని ప్రసాదిస్తున్నది.
ప్రధాని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్ సహా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాలు పింఛన్ పథకానికి అర్హుల ఎంపికలో అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో రూ.60 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.75 వేలు. ఒక్క రూపాయి మించినా అనర్హులుగా ప్రకటిస్తున్నారు. కనా కష్టంగా నెలకు ఐదారువేలు సంపాదించుకునే వారిని కూడా కుబేరుల కింద లెక్కగడుతున్నారు. ఎంత అన్యాయం? తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో పెద్ద మనసుతో వ్యవహరిస్తున్నది. మానవీయతను చాటుకుంటున్నది. వీలైనంత ఎక్కువమందికి ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా పింఛన్ల పథకాన్ని అమలు చేస్తున్నది. ఆదాయ పరిమితి విషయంలోనూ ఉదారంగా ఉంటున్నది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు ఆదాయ పరిమితిగా నిర్ణయించడం సీఎం మానవీయ దృక్పథానికి నిదర్శనం. చాలా రాష్ర్ర్టాల్లో పింఛనుకు అర్హులైనవారి వయసు నిర్ధారణలకూ సవాలక్ష ఆంక్షలు పెట్టారు. తెలంగాణ సర్కారు ఈ విషయంలోనూ ఉదారంగా వ్యవహరిస్తున్నది. వృద్ధుల పింఛన్ అర్హత వయసును 57కు కుదించింది. వితంతువు పింఛన్‌ను 18 నుంచి 57 ఏళ్ల వరకూ విస్తరించింది. కాబట్టే, గతంలో 29 లక్షలకు మించని పింఛన్‌దారుల సంఖ్య నేడు 44 లక్షలు దాటిపోయింది.
దాదాపు అన్ని రాష్ర్టాలూ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ పేషెంట్లు.. ఇలా గరిష్ఠంగా ఐదు వర్గాలకు మాత్రమే పింఛన్లను ఇస్తున్నాయి. అదీ నామమాత్రపు మొత్తమే. తెలంగాణ సర్కారు మాత్రం మానవీయ దృక్పథంతో ఏకంగా 11 వర్గాల ప్రజలకు పింఛన్లు అందిస్తూ విశాల హృదయాన్ని చాటుకుంటున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా.. ఏ ఆధారం లేకుండా జీవిస్తున్న ఒంటరి మహిళలు, బోదకాలు బాధితులు, డయాలసిస్ పేషెంట్లు, గీత కార్మికులు, వృద్ధ కళాకారులు, బీడీ కార్మికులకు సైతం పింఛన్ల పథకాన్ని వర్తింపజేస్తున్నది. ముఖ్య మంత్రి కేసీఆర్ ఇంటి పెద్ద కొడుకులా.. అన్నీ తెలిసిన అన్నలా నిరుపేదల బాధ్యత తీసుకుంటున్నారు.
పేరు మామిడి పద్మ. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం దుంపెల్లిగూడెం గ్రామం. చిన్నతనంలోనే తల్లి దండ్రులు చనిపోయారు. పదమూడేండ్ల క్రితం కట్టస్వామితో వివాహమైంది. అయినా ఆ సంతోషం మిగల్లేదు. పదేండ్ల క్రితం అనారోగ్యంతో భర్త చనిపోయాడు. అప్పటికి బిడ్డ బెస్లీకి రెండేండ్లు. జానెడు భూమి లేదు. ఆస్తిపాస్తులు లేవు. నిలువ నీడ కూడా కరువే. పూరి గుడిసెలో తలదాచుకుంటూ.. కూలిపనులు చేస్తూ బిడ్డను పోషించుకుంటున్నది. “ఇంతకు ముందయితే పింఛన్ పైసలు సరిపోయేటివి కావు. వచ్చినా రాకున్నా ఒకటే అన్నట్టుగ ఉండె. కూలీకి పోవాల్సిందే. రోగమొచ్చినా.. నొప్పొచ్చినా తప్పేది కాదు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక.. కేసీఆర్ సార్ ఇస్తున్న రూ. 2016 పింఛన్ డబ్బులు ఎంతో ఆసరైతున్నయి. నెల గాసం, చిల్లర ఖర్చులన్నీ ఎల్లిపోతున్నయి. ఇప్పుడు నా బిడ్డ బెస్లీ ములుగులోని ఎస్సీ బాలికల ప్రభుత్వ హాస్టల్లో ఆరో తరగతి చదువుతున్నది. కూలీపైసలు బిడ్డ కోసం పొదుపు చేస్తున్న” అని పద్మ
వివరించింది. సర్కారు సాయం మరువలేనిదని కృతజ్ఞతలు తెలిపింది. కూతుర్ని బాగా చదివించి ప్రయోజకురాలిని చేస్తానని ఆత్మవిశ్వాసంతో వెల్లడించింది.
నా అవ్వగారి ఊరు ఇల్లందు. అట్నుంచి ఇప్పుడు సుట్టాలెవరూ లేరు. ఇగ మా ఇంటాయనది చెన్నారావుపేట. పేరు ఎల్ల సమ్మయ్య. ఆయన కాలంజేసి 20 ఏండ్లయితంది. మాకు పిల్లలు లేరు. గుడిసె తప్ప ఏం లేదు. ఇంతకు ముందయితే పింఛన్ కింద రెండొందలు వచ్చేటియి. అవి ఎటూ సాలకపోయేటియి. ఇక అప్పుడు ఒంట్లె సత్తువ ఉండే. కూలీనాలి జేసుకుంట బతికిన. మధ్యల ఒంట్లె ఆసరలేకుంటయి మస్తు తిప్పలువడ్డ. సుట్టుపక్కలోల్లు ఏదో సాయం జేసేటోళ్లు. అయినా ముక్కుకుంట, మూలుగుకుంట కూలీకి పోక తప్పకపోయేది. కానీ కేసీఆర్ వచ్చినంక ఆ రంది వాసింది. పింఛన్ మొట్టమొదలు వెయ్యిజేసిండు. అప్పటి సంది పన్జేసుడు బంద్ జేసిన. ఆ పైసలతోనే, కంట్రోల్ బియ్యంతోని నా ఒక్కదానికి సరిపోయేటివి. పింఛన్ పైసలు 2వేలు జేసినంక ఇప్పుడు మంచిగున్నది. ఒంట్ల బలం ఉడిగినందుకు ఇప్పుడు ఆ పింఛనే ఆసరైంది. ఆ పైసలు రాకుంటే ఏనాడో పోయేదాన్ని కావచ్చు.
– ఎల్ల సమ్మక్క, చెన్నారావుపేట (వరంగల్ జిల్లా)
నా ఇంటాయన కాలంజేసి పదేండ్లయింది. ఆయనుండగానే బిడ్డ పెండ్లి జేసి అత్తగారింటికి పంపిన. ఇక ఇద్దరు కొడుకుల్లో పెద్దోడు పక్కనే కమలాపురంలనే ఉంటండు. మా జోలి పట్టించుకోడు. ఇక చిన్నోడు ఎడ్డోడు. క్యాలీ ఉండదు. ఏ పనీ చేయరాదు. నాతోనే ఉంటడు. భూమి లేదు. ఐదేండ్ల కింది వరకు కూలీ పనులు జేసుకుంటనే సాదిన. చక్కెర బీమారి వచ్చినంక కూలీ పనులు పోవుడు కూడ బంద్‌జేసిన. అప్పటినుంచి సర్కారు పింఛన్ పైసలతోనే బతుకుతున్నం. నా కొడుక్కి రూ. 3016, నాకు రూ. 2016 పింఛన్ వత్తంది. ఆ పైసలతోనే పొట్టపోసుకుంటున్నం. కారటు బియ్యం, ఒకలి పింఛన్ పైసలతోని ఇల్లుమొత్తం గడిచి
పోతంది. ఇంకో పింఛన్ పైసలు జమచేసిన. ఐదేండ్ల కిందటిదాన్క ఇల్లు సుత లేకుండె. ఆ పైసలతోని ఇంత నీడ జేసుకున్నం. సర్కారు పింఛన్ ఇయ్యకుంటే నేను, నా చిన్నకొడుకు ఏనాడో ఆగమైపోయేటోళ్లం. కేసీఆర్ సారు మాకు నిజంగా దేవుడే.
-ముసుకు నర్సమ్మ రేఖంపల్లి (దుగ్గొండి), వరంగల్ జిల్లా
నాకు ఇద్దరు బిడ్డలు. ఇద్దరు కొడుకులు. నీరటి పన్జేసుకుంట, ఉన్న భూమి జూసుకుంట ఉన్నంతల ఇల్లు ఎల్లదీసిన. అందరి పెండ్లిళ్లు జేసిన. మధ్యల దోమ కర్సి కాలుమొత్తం వాసింది. పన్జేసుడు అయితలేదు. పోయినేడు నుంచి బోదకాలోళ్లకు ఇచ్చే పింఛన్ రూ. 2016 నాకూ ఇస్తుండ్రు. దవాఖాన నుంచి మందులు సుత ఇస్తున్నరు. పింఛన్ పైసలతో ఇంటి కర్సులు ఎల్లిపోతున్నయి. ఒకలకు చేయిచాపకుంట పూట గడుత్తంది. సార్‌కు రుణపడి ఉంటం.
-కల్లెపల్లి జంపయ్య, ఏన్గులతండా (వరంగల్ జిల్లా)
నా పేరు అనసూర్య. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల. 15 ఏండ్ల క్రితం పెండ్లయింది. కట్టుకున్నోడు మధ్యలోనే వదిలేసి పోయిండు. అప్పటినుంచి అవ్వ,బాపు దగ్గరనే బతుకుతున్న. తల్లిదండ్రులు ఎంతకని నన్ను సాదుతరు? కూలీనాలీ
చేసుకుంటూ ఉండేదాన్ని. మధ్యల కండ్ల నజర్ సుత పాడైంది. కండ్లు మసకైనయ్. అప్పటిసంది సక్కగా పని చేసుడయితలేదు. దాంతో పనికి పిలుసుడు సుత బంద్జేసిన్రు. ఎట్లా అని దిక్కుదోచక బతుకుతున్న టైమ్‌ల కేసీఆర్ పుణ్యమా అని పింఛన్ వచ్చుడు మొదలైంది. నెలనెలా వత్తంది. ఇప్పుడు ఖర్చులు నేనే భరించుకుంటున్న. అవ్వయ్యతో మాటలు అని పించుకుంటలే. కేసీఆర్ సార్‌కు జీవితాంతం రుణపడి ఉంట.
-అనసూర్య, చిట్యాల (జయశంకర్ భూపాలపల్లి జిల్లా)
నాకు ఇద్దరూ ఆడబిడ్డలే. కార్పెంటర్ పనిచేస్త. చిన్నబిడ్డ మానస మూగది. పెద్దబిడ్డ పెండ్లి జేసినం. చిన్నబిడ్డ మాతోనే ఉంటది. బిడ్డను ఒక్కదాన్ని ఇడ్సిపెట్టి ఎటూ పోలేం. మా ఇంటామె ఇంటికాడ్నే ఉండుడు. నేను ఒక్కణ్నే పనిజేయాలె. ఇల్లు సగబెట్టాలె. మస్తు తిప్పలయ్యేది. అయినా ఏం జేసేది లేక ఉన్నదాంట్లనే ఎల్లదీస్కున్నం. కేసీఆర్ సర్కార్ వచ్చినంక పింఛన్ పెరిగింది. ఇప్పుడు చిన్నబిడ్డకు మూడువేల పింఛన్ వత్తంది. ఆ పైసలు ఎంతో ఆసరైతున్నయి. బిడ్డకు ఇప్పుడు మేం ఏం పెట్టాల్సిన అక్కర లేకుంటవోయింది. బట్టలు, అవీ ఇవీ కొంటున్న. ఇంట్ల సామానుకూ ఎంతో ఆసరైతున్నయి. ఆ పైసల నుంచే నెలకు వెయ్యి రూపాయలు బిడ్డ పేరిట పోస్టాఫీసుల పొదుపు జేత్తన్న.
– రాచమల్ల నర్సింహాచారి ,చెన్నారావు పేట(వరంగల్ జిల్లా)
– మ్యాకం రవికుమార్
రజినీకాంత్